రవళికి కన్నీటి వీడ్కోలు

6 Mar, 2019 06:53 IST|Sakshi
రామచంద్రాపురంలో రవళి అంతిమ యాత్ర

సంగెం: ప్రేమోన్మాది పెట్రోల్‌ దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన రవళికి కన్నీటి వీడ్కోలు పలికారు. మంగళవారం వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం రామచంద్రాపురం గ్రామంలో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు అశ్రు నివాళులర్పించారు.  గ్రామానికి చెందిన తోపుచర్ల పద్మ, సుధాకర్‌రావు ఏకైక కూతురు రవళిపై తోటి విద్యార్థి ఫిబ్రవరి 27న హన్మకొండలోని రాంనగర్‌లో పెట్రోల్‌ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. కాగా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో రవళి చికిత్స పొందుతూ  సోమవారం సాయంత్రం మృతి చెందింది.

పోస్టుమార్టం అనంతరం స్వ గ్రామానికి.. 
హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో రవళి  మృతదేహానికి హన్మకొండ, పర్వతగిరి సీఐలు సంపత్‌రావు, శ్రీధర్‌రావు పంచానామా నిర్వహించిన తర్వాత పోస్టుమార్టమ్‌ చేపట్టారు. అనంతరం కుటుంబసభ్యులు, బంధువులు రవళి మృతదేహాన్ని పోలీసు బందోబస్తు మధ్య రామచంద్రాపురం గ్రామానికి తీçసుకు వచ్చారు. విద్యార్థి్థని మృతదేహాన్ని చూడగానే బంధువులు, స్నేహితులు ఒక్కసారిగా గొల్లుమన్నారు. మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రవళిపై దాడి చేసిన నిందితుడిని కాల్చి చంపాలని గట్టిగా నినాదాలు చేశారు. 

అరటి మొక్కతో పెళ్లి.. 
రవళి మృతదేహానికి హిందూ సంప్రదాయం ప్రకారం అరటి మొక్కతో పెళ్లి జరిపించారు. అయ్యగారు పెళ్లి తంతు జరిపిస్తుండగా రవళి తల్లితండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
బందోబస్తు మధ్య అంత్యక్రియలు.. 
రవళి మృతదేహాన్ని ఇంటి నుంచి ఊరచెరువు శ్మశాన వాటిక వరకు పోలీసు బందోబస్తు మధ్య ఊరేగింపుగా తరలించారు. తండ్రి సుధాకర్‌రావు  తలకొరివి పెట్టి రవళి చితికి నిప్పంటించాడు. అయ్యో రవళి అంటూ అందరూ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ అశ్రు నయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మామునూర్‌ ఏసీపీ జి.శ్యాంసుందర్, హన్మకొండ, గీసుకొండ, పర్వతగిరి సీఐలు సంపత్‌రావు, సంజీవరావు, శ్రీధర్‌రావు, సంగెం, ఐనవోలు ఎస్సైలు నాగరాజు, నర్సింహరావు, 40 మంది కానిస్టేబుళ్లు, 8 మంది మహిళా కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించారు.
 

కడసారి చూపుకు నోచుకోలేక..  
కన్నకూతురును కడసారి చూసుకోని పరిస్థితి మరే తల్లితండ్రులకూ రావద్దని రవళి తల్లితండ్రులు పద్మ, సుధాకర్‌రావు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.  పెట్రోలు దాడిలో పూర్తిగా కళ్లు, ముఖం కాలిపోయిన కూతురు ముఖంను చూసుకోలేకపోయామని బావురుమన్నారు. 

మరిన్ని వార్తలు