ప్రేమను గెలిచి..జీవితంలో నిలిచి...

14 Feb, 2015 03:02 IST|Sakshi

అగాథంలో కూరుకుపోతున్న వారికి నేనున్నానంటూ ఆపన్నహస్తం అందించేది ప్రేమ.. కష్టాల కడలి నుంచి సౌఖ్యాల తీరాన్ని దాటించేది ప్రేమ..ఇతరుల ఆనందాన్నే తన సంతోషంగా భావించేది ప్రేమ..చీకట్లో చిరుదివ్వెను వెలిగించేది ప్రేమ..ఏమీ లేకున్నా.. అన్నీ ఉన్నాయన్న భరోసా కల్పించేది ప్రేమ..అడ్డంకులు.. అవాంతరాలను ఎదుర్కొనే శక్తినిచ్చేది ప్రేమ..
 ఇంతటి మహత్తర శక్తి ఉన్న ప్రేమను ఆస్వాదిస్తూ ఆనంద జీవితాలు గడుపుతున్న ప్రేమికులపై వాలంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం...
 
 స్నేహితుల సహకారంతో ఒక్కటయ్యాం
 కులాలు వేరని మా పెళ్లికి కుటుంబపెద్దలు ఒప్పుకోలేదు. ఐదేళ్లు పోరాటం చేశాం. అయినా అడ్డంకులు ఎదురొచ్చాయి. స్నేహితులు వెంకటయ్య, రాజు సహకారంతో ఉమామహేశ్వర క్షేత్రంలో ప్రేమవివాహం చేసుకున్నాం. బాలస్వామి ప్రస్తుతం అచ్చంపేటలో ఆర్‌ఎంపీగా, విజయలక్ష్మి ఏఎన్‌ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి కుమారుడు ధనుంజయ్, కుమార్తె గణప్రియ ఉన్నారు. ప్రస్తుతం ఇరువురి కుటుంబాలు కలిసి ఉంటున్నారు.
 - ఎం. బాలస్వామి,
 విజయలక్ష్మి(అచ్చంపేట)
 
 హ్యాపీగా ఉంది..!
 ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చదువుతుండగా మా పరిచయం ఏర్పడింది. నా సతీమణి రజనీది నల్గొండ జిల్లా రత్నావరం. ఎంఏ చదివి బీఈడీ పూర్తిచేసింది. ప్రస్తుతం నేను తలకొండపల్లి మండలం ఖానాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్నాను. అప్పట్లో ఒకేక్లాస్ కావడంతో మా పరిచయం ప్రేమగా మారింది. మా కుటుంబాల పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. మాకు ఇద్దరు పిల్లలు. మా మధ్య ఎలాంటి దాపరికాలేవు. కుటుంబ జీవనం హాయిగా, హ్యాపీగా సాగుతోంది.            
 - మల్లేష్, రజినీ, చుక్కాపూర్, తలకొండపల్లి మండలం
 
 కులాలు వేరని
 కులాలు వేరుకావడంతో ప్రేమపెళ్లికి కుటుంబపెద్దలు అంగీకరించలేదు. అయినా దాంపత్య జీవితానికి ఇరువురి భావాలు ఏకమయ్యాయి. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని స్నేహితుల సహ కారంతో బీచుపల్లి ఆంజేయస్వామి ఆలయంలో వివాహం చేసుకున్నాం. ప్రస్తుతం భార్యాపిల్లలతో హాయిగా జీవిస్తున్నాం.
 - తిరుమలేష్, అమరచింత
 
 స్నేహం ప్రేమగా మారింది
 మాది గట్టు మండలం చింతలకుంట గ్రామం. బీఈడీ వనపర్తిలో పూర్తిచేశాను. ఆ సమయంలో నా క్లాస్‌మేట్ శ్రీదేవితో పరిచయమేర్పడింది. ప్రేమను వ్యక్త పర్చుకున్నాం. ఆ తర్వాత ప్రేమను పెద్దల ముందుంచి పెళ్లికి ఒప్పించాం. పెళ్లికి ముందు కంటే పెళ్లయిన తర్వాతే రెట్టింపు ప్రేమతో ఉన్నాం. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో అన్యోన్యజీవితాన్ని సాగిస్తున్నారు. విధి నిర్వహణలో ఉండి ఇంటి బాధ్యతలు మరచినా తనకు తోడుగా వచ్చిన భార్య చక్కని ప్రోత్సాహం అందిస్తున్నారు.
 - శ్రీనివాస్, డిప్యూటీ తహశీల్దార్, ధరూరు
 
 ప్రేమపెళ్లి వద్దన్నారు
 1988లో ఎంవీ రామన్ ఆంగ్ల మీడియం స్కూలును ఆత్మకూర్‌లో ఏర్పాటు చేశాం. పాఠశాల అవసరం రీత్యా ఆంగ్లభాష బోధన కోసం కేరళ నుంచి ఉపాధ్యాయులను నియమించుకున్నాం. వారిలోనే ఆన్సీ అనే ఉపాధ్యాయినితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కులాలు వేరు.. పెళ్లొద్దని కుటుంబ సభ్యులు అభ్యంతరం చె ప్పినా.. పెళ్లి చేసుకున్నాం. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సమానంగా ఎదుర్కొంటాం. అందరికీ ఆదర్శంగా ఉండాలనే ఆలోచనతో దినదినాభివృద్ధితో పాఠశాలను ముందుకు తీసుకెళ్తూ గర్వంగా బతుకుతున్నాం.
  - ఎం.శ్రీధర్‌గౌడ్, ఎంపీపీ, ఆత్మకూర్
 
 ప్రేమపెళ్లితో స్థిరడడ్డా
 పాఠశాలలో కేరళ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఒకరినొకరు అర్థం చేసుకుని వైవాహిక జీవితానికి శ్రీకారం చుట్టాం. ప్రస్తుతం ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. భార్య ప్రైవేట్ పాఠశాల లో ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది. కేరళ అమ్మాయిని చేసుకునప్పటికీ ఇంట్లో ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. మా సంసార జీవితం కష్టసుఖాలతో సాగుతోంది.
  - రవిప్రకాష్ యాదవ్, కండక్టర్, అమరచింత
 

మరిన్ని వార్తలు