‘ప్రేమ’తో గెలవండి

14 Feb, 2015 03:16 IST|Sakshi

ప్రేమ ఒక అనిర్వచనీయమైన అనుభూతి. అందమైన అనుబంధం. అపుపూప జ్ఞాపకం. మరుపురాని మధురఘట్టం. అనుభవించేవారికి మాత్రమే ప్రేమలోని మాధుర్యం అర్థమవుతుంది. ప్రేమించడం తప్పుకాదు... అలాగని పెద్దలను నొప్పించడమూ సరికాదు. అందరూ కలిసిమెలసి ఉన్నప్పుడే ఆ జీవితం సంతోషంగా సాగుతుంది. ప్రేమించండి... కానీ, పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకోండి. రోజూ దేవుడికి పూజలు చేస్తున్నా... పండగ రోజు పూజల్లో ప్రత్యేకత ఉన్నట్లే... ప్రేమికులకు కూడా ఏటా ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డేగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మనసులో దాగి ఉన్న ప్రేమను గుట్టువిప్పి బయటపెట్టేందుకు ఎంచుకున్న రోజుగాప్రేమికులు వాలంటైన్స్ డే జరుపుకుంటున్నారు. ఇలా ప్రేమను వ్యక్తం చేసిన పలువురు తమ పెద్దలను ఒప్పించి అందరి సమక్షంలో పెళ్లి చేసుకుని సక్సెస్ సాధించారు.
 
 అదో ‘ప్రేమ’ కుటుంబం
 
 వెంకట్రావుపేట (మేడిపెల్లి) :
 సాధారణంగా అందరికి దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది, రంజాన్, క్రిస్మస్ మొదలైన పండుగలను ఘనంగా జరుకోవడం ఆనవాయితీ. కానీ వీరికి మాత్రం ప్రేమికుల రోజే పండుగ రోజు. పండుగలు, శుభకార్యాలు ఏదైనా ఇదే రోజు చేసుకోవడం వీరికి ఇష్టం. మేడిపెల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన అంగడి ఆనందం పుట్టినరోజు 1982 ఫిబ్రవరి 14. ఏ కార్యక్రమం తలపెట్టినా ఫిబ్రవరి 14నే మొదలుపెడతారు.
 
  సమాజ సేవ చేయాలన్న లక్ష్యంతో తన తండ్రి జాన్ పేరిట ఏర్పాటు చేసిన జిర్డ్స్ స్వచ్ఛంద సంస్థను 2007 ఫిబ్రవరి 14న ప్రారంభించాడు. తన జీవిత భాగస్వామి అయిన అక్షయలక్ష్మిని మొదట ప్రేమిస్తున్నానని ప్రపోజల్ చేయడంతోపాటు జీవిత భాగస్వామిగా చేసుకున్న రోజు 2009 ఫిబ్రవరి 14నే. ఇదే రోజున ద్విచక్రవాహనాన్ని, సెల్‌ఫోన్‌ను సైతం తీసుకొన్నాడు. తను చేసే ఏ కార్యక్రమమైనా ప్రేమికులరోజునే చేస్తుంటాడు. అందుకే ఈ కుటుంబానికి ఫిబ్రవరి 14 వచ్చిందంటే చాలు సంబరపడిపోతారు. చివరికి తన పిల్లలు జాన్సీ, జయంత్‌లను సైతం పాఠశాలలకు పంపించడం, అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలు కూడా ఇదే రోజు మొదలుపెట్టాడు. అందుకే వీరికి ఫిబ్రవరి 14 పండుగ దినంగా చెప్పవచ్చు. ఆనందంను దగ్గరి మిత్రులు ప్రేమానంద్‌గా పిలుస్తుంటారు.
 
 నా విజయం వెనక స్నేహలత
 సింగరేణి  ఉద్యోగం నుంచి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ స్థాయి వరకు ఎదగడం వెనుక నా భార్య స్నేహలత ప్రేమ ఎంతో ఉంది. మాది ఆదర్శ, కులాంతర వివాహం. ఒకరినొకరం ఇష్టపడిన మేం 1982 జూలై 15న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం. నా భార్య గొప్ప ధైర్యం ఇస్తున్న ఉత్తమ ఇల్లాలు. ఇద్దరం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కలిసి కష్టాలు, సుఖాలు పంచుకుంటున్నాం. పెళ్లయ్యాక ఒకరికొకరం ప్రేమించుకుంటున్నాం. 34 ఏళ్ల మా దాంపత్య జీవితంలో ఏనాడూ మనస్పర్థలు తలెత్తలేదు. యువత ప్రేమ పేరుతో తప్పటడుగులు వేయకుండా జీవితాన్ని డిజైన్ చేసుకోవాలి. ప్రేమించడం తప్పు కాదు. కానీ, ఆ ప్రేమ ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా ఉండాలి.
 - కొప్పుల ఈశ్వర్-స్నేహలత, ప్రభుత్వ చీఫ్ విప్
 

మరిన్ని వార్తలు