గోదారి గుండె చెరువు

19 Jul, 2019 07:26 IST|Sakshi
వర్షాకాలం ప్రారంభమైనా గోదావరినదిలో వరద నీరు కనిపించడం లేదు. గురువారం గోదావరిఖని గోదావరి బ్రిడ్జి వద్ద నది పరిస్థితి ఇలా.. 

ప్రాణహితలో గతేడాది జూలైలో 2 లక్షల క్యూసెక్కుల  ప్రవాహాలు

ఈ ఏడాది 20 వేల క్యూసెక్కులు దాటని వరద 

సాక్షి, హైదరాబాద్‌ : జూలై అంటే ఖరీఫ్‌కు మోఖ. మోఖలోనే వర్షాలు మొఖం చాటేశాయి. నాట్లు పడాల్సిన సీజన్‌లో రైతులు పాట్లు పడుతున్నారు. గలగలా గోదారి పారాల్సిన నెల ఇది. పంటల ‘ప్రాణహిత’ం కోరే రోజులివి. అట్లాంటిది గోదావరి వెలవెలపోతోంది. ‘ప్రాణహిత’లో జలజీవం లేదు. గతేడాది జూలై ఆరంభం నుంచి లక్ష క్యూసెక్కులకు తక్కువగా ఎన్నడూ ప్రవాహాల్లేవు. ఈ ఏడాది గరిష్టం గా 20 వేల క్యూసెక్కులు మించి ప్రవాహాలు రాలే దు. నీరురాక నారులేక మడులన్నీ బీడులయ్యాయి. 

47 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరువు.. 
రాష్ట్రంలో గోదావరి బేసిన్‌లో ఉన్న ప్రధాన ప్రాజెక్టు లు ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి. వీటికి ఎగువన కురిసే వర్షాల ఆధారంగా ప్రతి ఏటా జూలై నుంచి ప్రవాహాలు కొనసాగుతాయి. జూన్, జూలైలో ఈ ప్రాజెక్టులకు నీటి ప్రవాహాలున్నా లేకున్నా, ఎగువన ఉన్న ప్రాణహిత నది నుంచి మాత్రం జూన్‌ రెండు, మూడో వారం నుంచే గోదావరిలో కలిసి గరిష్ట ప్రవాహాలు వస్తుంటాయి. ప్రాణహితపై ఉన్న టెక్రా గేజ్‌ స్టేషన్‌ వద్ద ప్రతి ఏడాది జూలైలో ప్రవాహాలు లక్ష క్యూసెక్కుల నుంచి గరిష్టంగా 3 లక్షల వరకు నమోదవుతూ ఉంటాయి. అయితే ఈ ఏడాది పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ప్రాణహిత నదికి 5 లక్షల చదరపు కిలోమీటర్ల నదీ పరీవాహకం ఉన్నప్పటికీ గత నలభై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో నీటి ప్రవాహాలే కరువయ్యాయి. గత ఏడాది జూలై 18 నాటికి గరిష్టంగా 2.78 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రాగా ఈ ఏడాది గరిష్టంగా 20 వేల క్యూసెక్కులకు మించి వరద రాలేదు. వచ్చిన కొద్దిపాటి వరద నీటిని మేడిగడ్డ బ్యారేజీ గేట్లను మూసివేసి, కన్నెపల్లి పంపుల ద్వారా ఇప్పటి వరకు 6 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. గురువారం మేడిగడ్డ వద్ద 9,888 క్యూసెక్కుల కనిష్ట ప్రవాహం ఉండటంతో పంపులను నిలిపివేశారు.  గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు ఇంతవరకూ 3 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చి చేరింది. ఇందులోనే ఎల్లంపల్లికి 1.95 టీఎంసీలు, కడెంకు 0.80 టీఎంసీలు వచ్చింది. ఎస్సారెస్పీ, మిడ్‌మానేరు, ఎల్‌ఎండీలోకి మాత్రం చుక్కనీరు రాలేదు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు