నాగార్జునసాగర్‌లో 14 ఏళ్ల కనిష్టానికి నీటి నిల్వలు

8 Aug, 2017 02:07 IST|Sakshi
నాగార్జునసాగర్‌లో 14 ఏళ్ల కనిష్టానికి నీటి నిల్వలు

500 అడుగులకు పడిపోయిన నీటిమట్టం
తాగు, సాగు నీటికి అడుగంటిన ఆశలు
నల్లగొండ, హైదరాబాద్‌ తాగునీటికి తీవ్ర కొరత
ఉదయ సముద్రంలో మరో 10రోజులకే సరిపడే నిల్వ
కర్ణాటక నుంచి 15 టీఎంసీలు కోరాలని నిర్ణయం
సాగర్‌ కింది 6 లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్థకం

సాక్షి, హైదరాబాద్‌
తెలుగు రాష్ట్రాల్లోని సుమారు మూడు కోట్ల మంది ప్రజల సాగు, తాగు నీటి అవసరాలను తీర్చే నాగార్జునసాగర్‌ వట్టిపోయింది. ప్రాజెక్టు పరీవాహకంలో సరైన వర్షాలు లేక, ఎగువ నుంచి దిగువకు ప్రవాహాలు రాక ప్రాజెక్టు వెలవెలబోతోంది. నీటి నిల్వలు 14 ఏళ్లలో ఎన్నడూ లేనంత కనిష్టానికి పడిపోయాయి. తప్పని అవసరాల కోసం తిప్పలు పడుతూ లభ్యత జలాలన్నీ తోడేయడంతో ప్రస్తుతం తోడటానికి బురద తప్ప మరేదీ మిగిలే పరిస్థితి లేదు. ఇప్పటికే ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో బురద తప్ప నీళ్లు లేకపోగా, అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో కూడా అదే పరిస్థితి ఉంది. .

8 టీఎంసీలు అత్యవసరం..
కృష్ణా బేసిన్‌లో అన్ని ప్రాజెక్టులతో పోలిస్తే సాగర్‌ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎగువ కృష్ణాలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆల్మట్టి ప్రాజెక్టులోకి కొత్తగా 151.5 టీఎంసీలు, నారాయణపూర్‌లోకి 38.77 టీఎంసీలు, తుంగభద్రలోకి 45.17 టీఎంసీల మేర నీరు రాగా, రాష్ట్ర పరిధిలోని జూరాలకు 8.84 టీఎంసీలు, శ్రీశైలానికి 3.21 టీఎంసీల మేర కొత్త నీరు మాత్రమే వచ్చింది. అయితే జూరాలకు వస్తున్న నీటిని పాలమూరు జిల్లాలోని భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ అవసరాలకు మళ్లిస్తుండటంతో అక్కడినుంచి శ్రీశైలానికి చుక్క నీరు రావడం లేదు. దీంతో సాగర్‌కు నీటి విడుదల లేదు. సాగర్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 500.50 అడుగుల వద్ద 116.10 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఇందులో వినియోగార్హమైన నీరు చుక్క లేదు. ఇందులోంచి నీటిని తోడాలని ప్రయత్నిస్తే వచ్చేదంతా బురదే. వాస్తవానికి ప్రాజెక్టు కనీన నీటి మట్టం 510 అడుగులే అయినప్పటికీ, హైదరాబాద్‌ తాగునీటి అవసరాల దృష్ట్యా గత ఆరు నెలలుగా 502 అడుగుల మట్టానికి దిగువన అతి కష్టంగా నీటిని తీసుకుంటున్నారు. 502 అడుగులకు దిగువకు వెళ్తే హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు గండం తప్పదని పదేపదే తెలంగాణ విన్నవించిన నేపథ్యంలో కృష్ణాబోర్డు అడపాదడపా శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేస్తూ వచ్చింది.

అయితే ప్రస్తుతం శ్రీశైలంలోనూ 885 అడుగుల మట్టానికి గానూ 778 అడుగులకు మట్టాలు పడిపోవడంతో దిగువకు నీటి విడుదల జరగడం లేదు. దీంతో సాగర్‌లోకి రెండు నెలల వ్యవధిలో కేవలం 2.7 టీఎంసీలే రాగా, మట్టం 500 అడుగుల కనిష్టానికి చేరింది. సాగర్‌పై ఆధారపడ్డ ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచే నల్లగొండ జిల్లాలోని 232 గ్రామాలకు తాగునీటి పథకాల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి ఉంది. అక్కడ ప్రస్తుతం 0.13 టీఎంసీల నీరే ఉండటంతో అది మరో 10 రోజులకు మించి అవసరాన్ని తీర్చలేదు. ఇప్పటికే అక్కడ నీటిని తోడుతుంటే బురదే ఎక్కువగా వస్తోంది. ఇక హైదరాబాద్‌కు తాగునీటిని పంపించే అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి అతి కష్టంమీద ఒక పంపు సాయంతో నీటిని తోడుతున్నారు. కనీసం ఈ రెండు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ల నుంచయినా నీటిని తోడాలంటే ఇప్పటికిప్పుడు 8 టీఎంసీల నీరు అవసరం ఉంది. అప్పుడే 2 పంపులు పనిచేసే అవకాశం ఉంటుంది. 14ఏళ్ల క్రితం సాగర్‌లో 495 అడుగుల దిగువ వరకు వెళ్లి నీటిని తోడిన సందర్భాలు ఉన్నా, పుట్టంగండి పంప్‌హౌజ్‌ ఏర్పాటు చేశాక 500 అడుగుల దిగువకు వెళ్లి నీటిని తీసుకున్న పరిస్థితులు లేవు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

ఆయకట్టుకు గండమే..
గత ఏడాది శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు ఇదే సమయానికి 32.18 టీఎంసీల మేర ప్రవాహాలు రాగా, అవి ఈ ఏడాది 5.71 టీఎంసీలకు పడిపోయాయి. ఈ ప్రభావం తాగుతో పాటు సాగునీటిపై పడనుంది. సాగర్‌ జలాలపై ఆధారపడి నల్లగొండ జిల్లా పరిధిలో కాలువల కింద 2.8 లక్షల ఎకరాలు, ఎత్తిపోతల కింద 47 వేల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో మరో 2.8 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం తాగునీటికే గడ్డు పరిస్థితులు నెలకొన్న పరిస్థితిలో సాగు పూర్తిగా ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పటికిప్పుడు వర్షాలు కురిసి ఎగువ నుంచి భారీ వరద దిగువకు చేరినా, సాగర్‌ నిండేందుకు మరో రెండు నెలలు పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే నాగార్జునసాగర్‌ కింద ఖరీఫ్‌ ఆయకట్టుపై ఆశలు పూర్తిగా అడుగంటినట్లే.

15 టీఎంసీలకోసం కర్ణాటకకు మొర..
ప్రస్తుతం సాగర్‌లో నీటి మట్టాలు పూర్తిగా పడిపోవడం, వర్షాలు కురిసేందుకు మరో రెండు వారాలు పట్టే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎగువ రాష్ట్రం కర్ణాటక నుంచి నీటి విడుదల కోరాలని తెలంగాణ నిర్ణయించింది. ఉదయ సముద్రంలో మట్టాలు పడిపోతే నల్లగొండలోని ఫ్లోరైడ్‌ ప్రాంతాల తాగునీటి అవసరాలకు ఇక్కట్లు తప్పని కారణంగా తక్షణం నారాయణపూర్‌ నుంచి 15 టీఎంసీల నీటి విడుదలను కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూరాల, శ్రీశైలానికి వచ్చే ప్రతి చుక్కను సాగర్‌కు తరలించి ప్రస్తుత గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కాలని భావిస్తోంది. ప్రస్తుతం ఎగువన ఆలమట్టి, నారాయణపూర్‌లలో పూర్తి స్థాయిలో నీరున్నా, వచ్చిన నీటిని వచ్చినట్లుగా కర్ణాటక కాల్వలకు విడుదల చేయడంతో దిగువకు ప్రవాహాలు రాని విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు