సాధారణ స్థాయికి ఎల్పీజీ డిమాండ్‌ 

7 Apr, 2020 02:15 IST|Sakshi

కొరత లేకపోవడంతో తగ్గిన బుకింగ్‌లు 

సాక్షి, హైదరాబాద్‌: దేశీయంగా, రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్‌ నిల్వలకు ఎలాంటి కొరత లేదంటూ ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీల ప్రకటనల నేపథ్యంలో డిమాండ్‌ సాధారణ స్థాయికి చేరింది. గత కొన్ని రోజులుగా వంట గ్యాస్‌ సిలిండర్‌ల బుకింగ్‌లు విపరీతంగా పెరగ్గా, ప్రస్తుతం అవి తగ్గుముఖం పట్టాయి. ఎక్కడా కొరత లేకపోవడం, ఆయిల్‌ కంపెనీలు సైతం బుకింగ్‌ చేసిన రెండు, మూడు రోజుల్లోనే సరఫరా చేస్తుండటంతో అటు వినియోగదారులు, ఇటు కంపెనీలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. రాష్ట్రంలో గత ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చి 21 నుంచి గ్యాస్‌ బుకింగ్‌లు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజూ బుకింగ్‌లు 1.75లక్షల నుంచి 1.85లక్షల వరకు ఉంటుండగా, మార్చి నెలాఖరులో అవి ఏకంగా రోజుకు 3లక్షల వరకు పెరిగాయి. వినియోగదారులు అవసరం లేకున్నా అదనపు బుకింగ్‌లు చేస్తుండటంతో అప్రమత్తమైన ఆయిల్‌ కంపెనీలు ఒక్కో సిలిండర్‌ బుకింగ్‌కు మధ్య గడువును 14 రోజులకు పెంచాయి. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌తో పాటే ఎల్పీజీ నిల్వలు సరిపడేంతగా ఉన్నాయని ఆయిల్‌ కంపెనీలు ప్రకటించాయి. ఎల్పీజీ సిలిండర్‌ పూర్తిగా అందుబాటులో ఉండటంతో సోమవారం బుకింగ్‌లు కేవలం 1.08లక్షలు మాత్రమే ఉన్నాయని ఆయిల్‌ కంపెనీలు తెలిపాయి.

మరిన్ని వార్తలు