క్రమబద్ధీకరణపై ‘పన్ను’పోటు!

30 May, 2018 03:03 IST|Sakshi

బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులపై ఆస్తి పన్నుల పిడుగు

బీఆర్‌ఎస్‌ దరఖాస్తుల్లోని సమాచారం ఆధారంగా జరిమానాలు

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులపై ఖాళీ స్థలాల పన్నుల వడ్డన

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో అనుమతిలేని భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారిపై ఆస్తి పన్నులు, ఖాళీ స్థలం పన్నుల పిడుగు పడింది. భవనాల క్రమబద్ధీకరణ పథకం(బీఆర్‌ఎస్‌) దరఖాస్తుదారుల సమాచారాన్ని వినియోగిం చుకుని పురపాలికలు అనుమతి లేని కట్టడాలపై జరిమానాల పేరుతో ఆస్తి పన్నులను ఏకంగా 25 శాతం నుంచి 100 శాతం వరకూ పెంచేశాయి. అలాగే లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖా స్తుల సమాచారాన్ని వినియోగించుకుని ఆయా లేఅవుట్లు, ప్లాట్లపై వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌లను వడ్డించాయి. అసాధారణ రీతిలో ఆస్తి పన్నులు పెరిగిపోవడంతో బీఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులు, కొత్తగా ఖాళీ స్థలం పన్నులు వడ్డించడంతో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులు లబోదిబోమంటున్నారు. పెంచిన ఆస్తి పన్నులను తగ్గించాలని కోరుతూ నేరుగా రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శికి దరఖాస్తు చేసుకుంటు న్నారు. మరికొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు.

చేతికి అందిన సమాచారం..
అనధికార భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం 2015 నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాలను ప్రవేశపెట్టింది. బీఆర్‌ఎస్‌ కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పురపాలికల్లో 3 లక్షల దరఖాస్తులు రాగా, అందులో 1.6 లక్షల దరఖాస్తులు జీహెచ్‌ఎంసీకి వచ్చాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ కింద మరో 1.65 లక్షల దరఖాస్తులొచ్చాయి. అనధికార భవనాల క్రమబద్ధీకరణను సవాల్‌ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా తుది ఉత్తర్వులు జారీ చేసే వరకు బీఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిశీలించరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. రెండేళ్లు గడిచినా ఈ కేసులో పురోగతి లేకపోవడంతో బీఆర్‌ఎస్‌ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. మరోవైపు బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల రూపంలో చేతికి అందిన సమాచారం ఆధారంగా ఆయా అనధికార భవనాలపై జరిమానాలు, లే అవుట్లపై ఖాళీ స్థలాల పన్నులు విధించేందుకు పురపాలక శాఖ వినియోగించుకుంది. అనుమతి లేని/పూర్తిగా అక్రమ కట్టడాలపై జరిమానాలతో కూడిన ఆస్తి పన్నులు విధిస్తూ జారీ చేసే గులాబీ రంగు డిమాండ్‌ నోటీసులను బీఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు పురపాలికలు జారీ చేస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిష్కారానికి హైకోర్టు అనుమతి లభించే వరకు ఈ భవన యజమానులు జరిమానాలు చెల్లించక తప్పదని పురపాలక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

గులాబీ రంగులో పెనాల్టీ నోటీసులు
పూర్తిగా అనుమతి లేకుండా లేక అనుమతులను ఉల్లంఘించి నిర్మించిన కట్టడాలపై రాష్ట్ర పురపాలక శాఖ చట్టంలోని నిబంధనల ప్రకారం 25 శాతం నుంచి 100 శాతం వరకు ఆస్తి పన్నులు పెంచి జరిమానాల రూపంలో వసూలు చేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు జరిమానా వసూళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటిస్తూ 2017 డిసెంబర్‌ 20న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం.. భవన నిర్మాణ ప్లాన్‌లో అనుమతించిన ప్రకారమే అంతస్తులు నిర్మించినా, సెట్‌బ్యాక్‌ విషయంలో 10 శాతం లోపు ఉల్లంఘనలు ఉంటే 25 శాతం ఆస్తి పన్నును పెంచి జరిమానాగా వసూలు చేయాలి. అనుమతించిన సంఖ్యలోనే అంతస్తులు కలిగి ఉండి సెట్‌బ్యాక్‌ విషయంలో 10 శాతానికి మించి ఉల్లంఘనలుంటే 50 శాతం ఆస్తి పన్నులను పెంచి వసూలు చేయాలి. అనుమతించిన అంతస్తుల మీద అనుమతి లేకుండా అదనపు అంతస్తులు కడితే 75 శాతం ఆస్తి పన్ను పెంచాలి. పూర్తిగా అనుమతి లేని కట్టడంపై 100 శాతం ఆస్తి పన్ను వడ్డించాలి. జరిమానాలతో కూడిన ఆస్తి పన్నుల డిమాండ్‌ నోటీసులను గులాబీ రంగులో భవన యజమానులకు అందించాలి. 
 

మరిన్ని వార్తలు