ఆడా ఉంటాం.. ఈడా ఉంటాం..!

14 Mar, 2019 04:03 IST|Sakshi

రెండు రాష్ట్రాల్లో20 లక్షల డూప్లికేట్‌ ఓట్లు

2014లో రెండుచోట్లాఓటు వినియోగం

ఈసారి ఏపీ, తెలంగాణలోఒకేసారి పోలింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘నేను తెలుగు భాష లెక్క.. ఆడా ఉంటా.. ఈడా ఉంటా.. అన్న డైలాగ్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ఫేమస్‌. తెలుగు ప్రజలు మాత్రం ఓటు నమోదు విషయంలో ఈ డైలాగ్‌ను ఎప్పుడో ఫాలో అయ్యారు. ఏపీ, తెలంగాణలో ఓటు నమోదు చేసుకున్నారు. అక్కడా ఓటేస్తారు. ఇక్కడా ఓటేస్తారు. రెండు చోట్లా ఎన్నికల్లో పాల్గొని తమ సత్తా చాటుతారు. అయితే, ఇది స్వల్ప మొత్తంలో ఉంటే ఫరవాలేదు. కానీ, పార్టీల భవితవ్యాన్ని, ప్రభుత్వాల్ని మార్చగలిగే స్థాయిలో అంటే.. అక్షరాలా లక్షల సంఖ్యలో ఉండటం గమనార్హం. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి 2014 రాష్ట్ర విభజన వరకు ఈ ఓటర్లు రెండు రాష్ట్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  

లక్షల సంఖ్యలో డూప్లికేట్‌ ఓటర్లు.. 
ఉమ్మడి రాష్ట్రంలో 292 అసెంబ్లీ స్థానాలు, 42 పార్లమెంటు స్థానాలు ఉండేవి. ఈ స్థానాలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరపడం కష్టతరం కావడంతో ఏపీలో ఒక దశలో, తెలంగాణలో మరో దశలో నిర్వహించేవారు. ఆ సమయంలో చాలామంది తెలంగాణ, ఏపీల్లో ఓటు నమోదు చేయించుకున్నారు. (2018 నవంబర్‌ వరకు రెండుచోట్లా ఓట్లు నమోదు చేయించుకుని ఉన్నవారి సంఖ్య 20 లక్షలుగా ఉంది.) వీరు తెలంగాణలో ఒకసారి, ఏపీలో మరోసారి ఓటు హక్కు వినియోగించుకునేవారు. రాష్ట్ర విభజన తరువాత కూడా తెలంగాణలో ఏప్రిల్‌ 30న, ఏపీలో మే 7న ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలోనూ వీరిలో చాలామంది ఇక్కడా, అక్కడా ఓట్లేశారు.  

అవి బోగస్‌ ఓట్లు కావు.. 
ఏపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని, ఏకంగా 52 లక్షల బోగస్‌ ఓట్లు నమోదయ్యా యని ఆరోపిస్తూ గతేడాది హైకోర్టులో ఓ పిల్‌ దాఖలైంది. దీనికి అప్పటి ఏపీ ఎన్నికల ప్రధా నాధికారి స్పందించారు కూడా. తమకు ఈ విష యంపై ఫిర్యాదు అందిందని, అయితే వీటిలో అన్నీ బోగస్‌ ఓట్లు కావని తెలిపారు. ఇందులో ఒకే పేరు, తండ్రి పేరు, ఇంటిపేరు, వయసు తదితర వివరాలను పోల్చి చూసినపుడు ఏపీ, తెలంగాణలో ఇలాంటి వారు 18.2 లక్షల మం దికిపైగా ఉన్నారని తెలిపారు. దీంతో వీరంతా అక్కడా, ఇక్కడా ఓటుహక్కు కలిగి ఉన్నారన్న విషయం తేటతెల్లమైంది. 

ఒకేదశలో రావడంతో.. 
చాలా ఏళ్లుగా తెలంగాణలో, ఏపీలో వేర్వేరు దశల్లో ఎన్నికలు నిర్వహించాల్సి రావడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ఈసారి మాత్రం ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు మొదటిదశలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అంటే, రెండు రాష్ట్రాల్లోనూ ఒకేరోజు పోలింగ్‌ ఉంటుంది. దీంతో ఈ ఓటర్లు ఏదో ఒక ప్రాంతంలోనే ఓటు వేయగలరు. వీరిలో అధికశాతం హైదరాబాద్‌ నగరంలోనే ఓటు హక్కు కలిగి ఉండటంతో.. అదే రోజు ఏపీకి వెళ్లి ఓటు వేయడం దాదాపుగా అసాధ్యంగా భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు