మౌనిక కుటుంబానికి రూ.20 లక్షలు

24 Sep, 2019 03:12 IST|Sakshi
మౌనిక కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న కోదండరామ్‌

మృతురాలి కుటుంబంతో ఎల్‌ అండ్‌ టీ చర్చలు

ఉద్యోగం, ఇన్సూరెన్స్‌ ఇచ్చేందుకు అంగీకారం

గాంధీఆస్పత్రి: మౌనిక కుటుంబాన్ని ఆదుకోవడానికి మెట్రో నిర్వహణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ అంగీకరించింది. అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో పిల్లర్‌ పెచ్చులూడి తలపై పడటంతో కేపీహెచ్‌బీకి చెందిన మౌనిక(24) మృతి చెందిన విషయం విదితమే. బాధితురాలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం, కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం, ఇన్సూరెన్స్‌ ఇచ్చేందుకు ఎల్‌ అండ్‌టీ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది.

అంతకుముందు అఖిలపక్ష నేతలు ప్రొఫెసర్‌ కోదండరాం, సుధాకర్, ఇందిర తదితరులు సోమవారం ఉదయం గాంధీ ఆసుపత్రికి వచ్చి మౌనిక కుటుంబసభ్యులను పరామర్శించారు. ఘటన జరిగి రోజున్నర గడిచినా మెట్రో అధికారుల నుంచి స్పందన లేకపోవడం, ప్రభుత్వం నిర్ధిష్టమైన ప్రకటన చేయకపోవడం దారుణమని విచారం వ్యక్తం చేశారు. వారు నిరసనకు దిగుతున్నట్లు సమాచారం తెలుసుకొని మధ్యాహ్నం ముగ్గురు ఎల్‌ అండ్‌ టీ అధికారులు ఆసుపత్రి మార్చురీ వద్దకు వచ్చారు. సికింద్రాబాద్‌ ఎల్‌ అండ్‌టీ కార్యాలయంలో మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులతో ఎల్‌ అండ్‌ టీ అధికారులు చర్చలు జరిపారు.  

గాంధీ ఆస్పత్రిలో విషాదం 
మౌనిక బంధువులు, కుటుంబసభ్యుల రోదనలతో గాంధీ ఆసుపత్రిలో విషాద వాతావరణం నెలకొంది. పెద్దపల్లి జిల్లా ఓదేలు మండలం గోపరపల్లి నుంచి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, మంచిర్యాల నుంచి అత్తింటివారు, బంధువులు పెద్దసంఖ్యలో సోమవారం ఉదయం ఆసుపత్రికి వచ్చారు.విగతజీవిగా పడి ఉన్న మౌనికను చూసి బోరున విలపించారు.

తన భార్య మృతికి మెట్రో అధికారులు, ప్రభుత్వమే బాధ్యత వహించాలని మౌనిక భర్త హరికాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తాను, మౌనిక అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో దిగి కిందికి వచ్చి వర్షం కారణంగా కాసేపు నిల్చున్నామని, అంతలోనే సిమెంట్‌ పెచ్చులు పడి మౌనిక తలకు తీవ్ర గాయాలయ్యాయని, మెట్రోసిబ్బంది నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందలేదని నిఖిత వివరించింది.  

ఎల్‌ అండ్‌ టీపై కేసు నమోదు 
అమీర్‌పేట: ఎల్‌ అండ్‌టీ సంస్థపై ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మౌనిక భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ కోణాల్లో విచారణ జరిపారు. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్లే మౌనిక దుర్మరణం చెందినట్లు నిర్ధారించారు. కాగా అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో పిల్లర్‌ పెచ్చులూడి పడిన ప్రాంతాన్ని మెట్రో ఉన్నతాధికారులు పరిశీలించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా