పర్యావరణ పరిరక్షణ నా లక్ష్యం

21 Nov, 2018 12:45 IST|Sakshi

అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా..  

కార్వాన్‌ సోషలిస్టు పార్టీఅభ్యర్థి లుబ్నా సార్వత్‌  

పర్యావరణ హితంగా ప్రచారానికి ఏర్పాట్లు

సాక్షి,సిటీబ్యూరో: ‘వైవిధ్యభరితమైన హైదరాబాద్‌ సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. శతాబ్దాల నాటి చారిత్రక వారసత్వ కట్టడాలు మసకబారుతున్నాయి. ఇప్పటికే వందలాది చెరువులు, కుంటలు, నీటి వనరులు కబ్జాలకు గురయ్యాయి. వరదలతో నాలాలు ఉప్పొంగుతున్నాయి. నగర జీవనం అస్తవ్యస్తమవుతోంది. క్రమంగా అస్తిత్వాన్ని కోల్పోతోంది. ఈ ముప్పు నుంచి నగరాన్ని కాపాడుకోవాలి’.. అంటున్నారు. ప్రముఖ సామాజిక కార్యకర్త లుబ్నా సార్వత్‌. నగరంలో నీటి వనరుల పరిరక్షణ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తోన్న ఆమె ఆ లక్ష్య సాధన కోసం ఎన్నికలను ప్రచార అస్త్రంగా చేసుకున్నారు. ఆ లక్ష్యంతోనే ఎన్నికల బరిలోకి దిగారు. వారసత్వ కట్టడాలకు నెలవైన కార్వాన్‌ నియోజకవర్గం నుంచి సోషలిస్టు (ఇండియా) పార్టీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. గతంలో ఆమ్‌ ఆద్మీ నుంచి హైదరాబాద్‌ ఎంపీ పదవి కోసం పోటీ చేశారు. ‘నాలుగున్నరేళ్ల క్రితం ఎంపీ అభ్యర్థిగా నగరంలో విస్తృతంగా పర్యటించాను. అన్ని వర్గాల ప్రజలను కలిసాను. అప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఇప్పుడూ ప్రజలు అవే సమస్యలను ఎదుర్కొంటున్నారు. అప్పటికి ఇప్పటికీ నగర పర్యావరణానికి ముప్పు రెట్టింపైంది’ అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారామె. ఎన్నికల బరిలోకి దిగిన ఆమె ‘సాక్షి’తో పలు అంశాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

జీవన ప్రమాణాల నాణ్యత పడిపోయింది
ప్రజల జీవన ప్రమాణాల్లో నాణ్యత పూర్తిగా పడిపోయింది. తెలంగాణ వల్ల ఎలాంటి మెరుగైన అవకాశాలు లభించలేదు. సాంకేతిక పరిజ్ఞానం మానవ అభివృద్ధి కాదు. పర్యావరణం బాగా దెబ్బతింది. భూగర్భ జలాలు  చెడిపోయాయి. చెరువులన్నీ కుంచించుకొనిపోయాయి. ప్రజల సంతోషం  ఆవిరైపోయింది. ఏ ఒక్క రంగంలోనూ తెలంగాణకు ముందు, తర్వాత అని చెప్పుకోదగిన అభివృద్ధి కనిపించడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం గ్రేటర్‌లో 185 చెరువులు ఉన్నాయి. కానీ అంతకంటే ఎక్కువే కబ్జాకు గురయ్యాయి. జలగం వెంగళరావు పార్కులో పెద్ద చెరువు ఉండేది. ఇప్పుడది చిన్న నీటి కుంటలా మారింది. ఇందిరాపార్కులో పెద్ద చెరువు ఉండేది. హుస్సేన్‌ సాగర్‌ నాలాను ఈ చెరువులోకి మళ్లించేవారు. ఇప్పుడు చెరువును కుదించారు. నాలాను ముసేశారు. చెరువులోకి వరదనీరు చేరడం వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లిందో గతంలోనే చూశాం. పబ్లిక్‌గార్డెన్, మాసబ్‌ ట్యాంక్‌ సహా అనేక చెరువులు ఇలాగే కుంచించుకుపోయాయి. దీంతో వరదనీటితో నాలాలు ఉప్పొంగి జనావాలను ముంచెత్తుతోంది. హుస్సేన్‌ సాగర్‌ కాలుష్య కాసారంగా మారింది. ప్రక్షాళన కాగితాలకే పరిమితమైంది. 

కార్వాన్‌ నుంచే ఎందుకంటే..
అతి పురాతనమైన నగరం కార్వాన్‌. ఒకప్పుడు ఇక్కడ రతనాలు, ముత్యాలు, వజ్రాలు రాశులుగా పోసి విక్రయించేవారట. అలాంటి కార్వాన్‌ పురాతన వైభవం ఇప్పుడు పూర్తిగా కనుమరుగైంది. గొప్పగొప్ప చారిత్రక వారసత్వ కట్టడాలు  మసకబారాయి. గోల్కొండ కోట, టూంబ్స్, నయాఖిల్లా, పాతబస్తీలో ఉన్న చారిత్రక కట్టడాలకు రక్షణ లేకుండా పోయింది. చారిత్రక, వారసత్వ కట్టడాలకు విఘాతం కలిగించే  గోల్ఫ్‌ కోర్సులోచ్చాయి. ఇక కోట చుట్టూ ఉన్న చెరువులు లంగర్‌హౌస్‌ చెరువు, జమాల్‌ చెరువు, నయాఖిల్లా చెరువు, షాహతమ్‌ చెరువు, జమాలీకుంట వంటివి చాలా వరకు కబ్జాకు గురయ్యాయి.

పేద ప్రజలు ఏం తిని బతుకుతారు?
పాతబస్తీతో పాటు, అనేక చోట్ల దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేద ప్రజలు వంటగ్యాస్‌ కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు. రూ.1000 గ్యాస్‌ ధర వారికి భారంగా మారింది. ఎప్పుడో వచ్చే సబ్సిడీ కోసం ఇప్పుడు ఆ వెయ్యి రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలంటూ చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికీ వంటగ్యాస్‌ అని గొప్పగా చెప్పినా, ఆ గ్యాస్‌ కొనుక్కోలేని స్థితిలో తిరిగి కట్టెల పొయ్యినే ఆశ్రయిస్తున్నారు. 

వినూత్నంగా ప్రచారం..
పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నికల ప్రచారంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, ప్లాస్టిక్‌ వస్తువులకు బదులు కాటన్‌ బ్యానర్లను మాత్రమే వినియోగిస్తాం. సీఎన్‌జీతో నడిచే ఆటో రిక్షాలనే వినియోగిస్తాం. నా వల్ల నగరంలో కార్బన్‌ స్థాయి ఏ మాత్రం పెరగకుండా జాగ్రత్తలు పాటిస్తాను. అన్ని రాజకీయ పార్టీలు పర్యావరణహితంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే బాగుంటుంది.

మరిన్ని వార్తలు