లాటరీలో వరించిన విజయం..

26 Jan, 2020 08:51 IST|Sakshi
లాటరీ ద్వారా గెలుపొందిన ఆనందంతో బయటకు వస్తున్న సావిత్రిమేఘారెడ్డి దంపతులు

మోత్కూరులో ఉత్కంఠ రేపిన 7వ వార్డు ఫలితం

పోస్టల్‌ బ్యాలెట్‌తో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు సమాన ఓట్లు

లాటరీలో గట్టెక్కిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సావిత్రి

సాక్షి, మోత్కూరు :  భువనగిరిలోని అరోరా ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం నిర్వహించిన మోత్కూరు మున్సిపాటిటీ ఓట్ల లెక్కింపులో 7వ వార్డు ఫలితం తీవ్ర ఉత్కంఠను రేపింది.  మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా 6 టీఆర్‌ఎస్, 5 కాంగ్రెస్‌కు వచ్చాయి. 7వ వార్డు ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చి టై అయ్యింది. 7వ వార్డులో అత్యధికంగా 8మంది అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ ప్రధానంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తీపిరెడ్డి సావిత్రి, కాంగ్రెస్‌ అభ్యర్థి బద్దం నాగార్జునరెడ్డి మధ్యే పోటీ జరిగింది. 1,104 ఓట్లకు గాను 1,001 ఓట్లు పోలయ్యాయి.

అందులో ఒక పోస్టల్‌ బ్యాలెట్, 2 ఓట్లు నోటాకు పోలయ్యా యి. లెక్కింపులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సావిత్రికి 378 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి నాగార్జునరెడ్డికి 377 ఓట్లు వచ్చాయి. ఒకే ఒక్క పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు కాంగ్రెస్‌కు పడటంతో ఇద్దరికి సమానంగా 378 ఓట్లు రావడంతో టై అయ్యింది. దీంతో అభ్యర్థులు మళ్లీ కౌంటింగ్‌ చేయాలని కోరడంతో అధికారులు లెక్కించగా అవే ఓట్లు వచ్చాయి.

సుమారు రెండు గంటలకు పైగా ఫలితం ఎటూ తేలకపోవడంతో కౌంటింగ్‌ హాల్‌ లోపల ఉన్న అభ్యర్థులతో పాటు బయట ఉన్న ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు. చివరికి అధికారులు లాటరీ పద్ధతి ద్వారా విజేతను ప్రకటించేందుకు నిర్ణయించడంతో అభ్యర్థులు అంగీకరించారు. దీంతో ఒక్కో అభ్యర్థి పేరుతో 5 చీటీలు మొత్తం 10 చీటీలు రాసి లాటరీ తీశారు. లాటరీలో తీపిరెడ్డి సావిత్రి పేరు రావడంతో అధికారులు ఆమెను విజేతగా ప్రకటించారు.   

మరిన్ని వార్తలు