నాకే ఎందుకిలా జరిగింది?

30 Aug, 2018 09:39 IST|Sakshi

ఇక్కారెడ్డిపల్లిలో చిన్నారి మృతి కలచివేసింది 

ఎంతోమంచి శ్రమించినా ఫలితం లేకపాయే.. 

బదిలీపై వెళ్లిన రఘునందన్‌రావు మనోవేదన

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నాకే ఎందుకిలా జరిగింది..? జిల్లా నుంచి బదిలీపై వెళుతున్న కలెక్టర్‌ రఘునందన్‌రావు ఆవేదన ఇది. ఇదేదో ఆయన బదిలీ గురించిన ఆవేదనో.. తన కుటుంబానికి సంబంధించిన బాధనో కాదు. ఓ చిన్నారి బోరుబావిలో పడి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఆయన పడిన మనోవేదన ఇది. ఆ కీలక క్షణాల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఓవైపు.. పాప నిండు ప్రాణం ఓ వైపు.. అలా చేయండి.. ఇలా చేయండంటూ సలహాలు మరోవైపు. అసలేం చేయాలి.. పాప ప్రాణం ఎలా కాపాడాలి? స్వల్ప వ్యవధిలో పాపకు ఏమైనా జరిగితే జిల్లా ఉన్నతాధికారిగా అప్రతిష్ట పాలవుతానా..? ఓ మనసున్న వ్యక్తిగా ఎంత క్షోభ పడతారో.. ఈ ఉత్కంఠను ఆ రోజంతా అనుభవించాను. నిజంగా నా జీవితంలో ఓ చేదు అనుభవాన్ని మిగిల్చింది. నేను ఉన్నప్పుడే ఆ పాపకు అలా జరగాలా? ఎన్నో హృదయాలు స్పందించి.. చిత్తశుద్ధితో శ్రమించినా ఫలితం దక్కలేదాయె. అసలు నేను కలెక్టర్‌గా ఉన్నప్పుడే ఇలా ఎందుకు జరిగింది. నాకే ఎందుకు జరిగింది? చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిపల్లి గ్రామంలో ఓ చిన్నారి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడి మృతి చెందిన ఘటనను తలుచుకుని జిల్లా నుంచి వెళ్లిపోతున్న కలెక్టర్‌ రఘునందన్‌రావు విలేకర్లతో పంచుకున్న ఈ ఆవేదన నిజంగా భారమైందే. ఆ ఘటన మనసున్న ప్రతి మనిషినీ కలచివేసిందే.  

‘మనసాక్షికి అనుగుణంగా చేశా..’ 
జిల్లాలో సుదీర్ఘకాలం పనిచేసే అదృష్టం నాకే దక్కింది. ఈ సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా. భూ వివాదాల్లో న్యాయపరమైన అవరోధాలు వచ్చినా.. నా మనసాక్షిగా అనుగుణంగానే న్యాయమనుకున్నదే చేశా. విలువైన భూముల పరిరక్షణలో ఆనేక ఒత్తిళ్లు వచ్చినా.. వృత్తిలో సర్వసాధారణంగా భావించా. ప్రజలకు సేవ చేసే అవకాశం కొందరికే దక్కుతుంది. మన దగ్గరకు వచ్చేవారి మనసులో ఏముందో కనుక్కోవడంతో సగం న్యాయం చేసినట్లే. అందుకు తగ్గట్టుగా స్పందిస్తే సామాన్యుల మన్ననలు పొందగలం. భూ రికార్డుల ప్రక్షాళన, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం(ఎన్‌ఎఫ్‌బీసీ) తదితర పథకాలను సంతృప్తినిచ్చాయి. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు