వెనకబడుతున్న ‘మిషన్ కాకతీయ’

28 Dec, 2014 23:20 IST|Sakshi
వెనకబడుతున్న ‘మిషన్ కాకతీయ’

సాక్షి, సంగారెడ్డి: ‘చెరువుల పునరుద్ధరణ ప్రతిపాదనల రూపకల్పన సంతృప్తికరంగా లేదు.. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోంది.. ఇలా అయితే లక్ష్యం మేరకు చెరువుల పునరుద్ధరణ ఎలా చేస్తాం..?’ గతసోమవారం జరిగిన ‘మిషన్‌కాకతీయ’ సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మాటలివి.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌కాకతీయ లక్ష్యానికి గండికొట్టేలా జిల్లాలో నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదనల రూపకల్పనలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఈ శాఖకు సంబంధించిన మంత్రి సొంత జిల్లాలోనే అధికారులు ఇప్పటికి సుమారు 25 శాతం చెరువుల ప్రతిపాదనలు మాత్రమే పూర్తి చేశారు. మంత్రి హరీష్‌రావు ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు విఫలమవుతున్నారు. దీనికితోడు సిబ్బంది కొరత, అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో మిషన్‌కాకతీయ ప్రతిపాదనల రూపకల్పనలో మెతుకుసీమ వెనకబడుతోంది.

క్షేత్రస్థాయిలో పనిచేసే ఏఈలకు సర్వే సామగ్రి ఇంకా అందలేదు. పలుచోట్ల సిబ్బంది సెలవుల్లో ఉండటం, మరికొంత మంది రెండు, మూడు చెరువుల ప్రతిపాదనలు మాత్రమే పూర్తి చేయటంపై మంత్రి హరీష్‌రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సర్వే సామగ్రి ఏఈలకు చేరవేయకపోవడంపై మండిపడ్డారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని ఆ శాఖ ఉన్నతాధికారులను హెచ్చరించారు. దీంతో జనవరి మొదటి వారం వరకు ప్రతిపాదనలు పూర్తిచేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు మంత్రికి హామీ ఇచ్చారు. అయితే అది ఎంత మేరకు  కార్యరూపం దాలుస్తుందో వేచి చూడాల్సిందే.

చీఫ్ ఇంజనీర్‌కు చేరింది 224 ప్రతిపాదనలే...
మిషన్ కాకతీయలో భాగంగా జిల్లాలో మొదటి విడతగా 1,958 చెరువులను ఎంపిక చేశారు. అధికారుల సమాచారం మేరకు వీటిలో ఇప్పటి వరకు 224 ప్రతిపాదనలు పూర్తయి చీఫ్ ఇంజినీర్ కార్యాలయానికి చేరాయి. మరో 82 ప్రపోజల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఇంకా 1,652 చెరువుల ప్రతిపాదనలు పూర్తి చేయా ల్సి ఉంది. సంగారెడ్డి డివిజన్ పరిధిలో 464 చెరువులను ఎంపిక చేయగా 56 చెరువుల ప్రతిపాదనలు పూర్తయ్యాయి.

ఇంకా 408 ప్రతిపాదనలు పూర్తి చేయాల్సి ఉంది. సిద్దిపేట డివిజన్‌లో 1,017 చెరువులు ఎంపిక చేయగా 160 ప్రతిపాదనలు పూర్తయ్యాయి. మరో 857 ప్రతిపాదనలు పూర్తి చేయాలి. మెదక్ డివిజన్‌లో 477 చెరువులకు 90 చెరువుల ప్రతిపాదనలు పూర్తి కాగా 387 చెరువుల ప్రతిపాదనలు పూర్తి కావాల్సిఉంది.

సర్వే పనులు మందకొడిగా సాగుతుండటంతో ప్రతిపాదనల రూపకల్పనలో సైతం జాప్యం జరుగుతోంది. సర్వే పనులు త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం మండలానికి అవసరమైన సర్వే సామగ్రి అందజేస్తోంది.  సమగ్ర సర్వే ప్రతిపాదనల రూపకల్పనలో కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని నిర్ణీత గడువులోగా ప్రతిపాదనలు పూర్తి చేస్తామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.

ఇకపై ప్రత్యేక అధికారి పర్యవేక్షణ...
మిషన్ కాకతీయ పనుల పర్యవేక్షణకు చీఫ్ ఇంజినీర్ కృష్ణారావును జిల్లా ఇన్‌చార్జ్‌గా నియమించినట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. కృష్ణారావు జిల్లా నీటిపారుదల అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రతిపాదనల రూపకల్పనను త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా అదేశించారు. ప్రత్యేక అధికారి పర్యవేక్షణలోనైనా మిషన్‌కాకతీయ పనులు వేగవంతమవుతాయో..? లేదో..? వేచి చూడాలి.

మరిన్ని వార్తలు