భూ రికార్డులను సంస్కరించాలి 

16 Jul, 2019 01:32 IST|Sakshi

కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌ ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌  

హైదరాబాద్‌: భూ సంస్కరణలు ఆహ్వానించదగ్గ పరిణామమే అయినా ముందుగా భూ రికార్డులను సంస్కరించకుండా సాధ్యమయ్యే పనికాదని కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌ ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌ అన్నారు. సోమవారం బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో ‘రెవెన్యూ పాలనలో సంస్కరణలు, భూ రికార్డులు, హక్కులు’ అంశంపై నిర్వహించిన ఒక్క రోజు జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. రోజురోజుకూ భూమి విలువ పెరుగుతుండటంతో వివాదాలు పెరుగుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న న్యాయస్థానాల్లో ఇప్పటికే 3 కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉంటే అందులో 66 శాతం కేసులు భూ వివాదాలకు సంబంధించినవేనన్నారు. ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూములను అమ్ముతూ రూ.వేల కోట్లు అర్జిస్తున్నాయని వీటికి సరైన ఆడిట్‌ లేదని వ్యాఖ్యానించారు. రెవెన్యూ యంత్రాంగానికి అనేక విధులు అప్పగించి అవినీతి చేయడానికి ఆస్కారం కల్పించారని.. ఇప్పుడు అదే రెవెన్యూ విభాగాన్ని తప్పుపట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ సదస్సులో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ టి.పాపిరెడ్డి, కేసీఆర్‌ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి జ్వాలా నరసింహారావు, వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ కె.సీతారామారావు తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు