బయోడైవర్సిటీ బస్టాప్‌ తరలింపు

27 Nov, 2019 08:04 IST|Sakshi
బస్టాప్, ఆటో స్టాండ్‌ను తరలించడంతో ఖాళీగా మారిన ప్రాంతం

సాక్షి, గచ్చిబౌలి : బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ నుంచి కారు పల్టీలు కొడుతూ ఎగిరి పడడంతో బస్సు కోసం ఎదురుచూస్తున్న సత్యవేణి మృతి చెందిన విషయం తెలిసిందే. కారు పడిన చోట బస్టాప్‌తో పాటు ఆటో స్టాండ్‌ ఉంది. ఫ్లైఓవర్‌ పైనుంచి పడిన కారు రోడ్డుపై పడి ఢీకొట్టడంతో చెట్టు విరిగిపోగా మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో మాదాపూర్‌ ట్రాఫిక్‌ పోలీసులు బయోడైవర్సిటీ జంక్షన్‌లో మాదాపూర్‌కు వెళ్లేందుకు నిస్సాన్‌ షోరూం ముందు ఉన్న బస్టాప్, ఆటో స్టాండ్‌ను అక్కడి నుంచి తరలించారు. ఈ జంక్షన్‌ నుంచి దాదాపు రెండు వందల మీటర్ల పొడవున బస్సులు, ఆటోలతో పాటు క్యాబ్‌లు ప్రయాణికుల కోసం అగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదానికి ముందు ప్రయాణికులు, వాహనాలు ఆగడంతో రద్దీగా ఉండే చోటు నేడు ఖాళీగా మారింది. 

ఇదే నెల మొదట్లో అర్ధరాత్రి కారు ఢీకొని ఇద్దరు యువకులు ఎగిరి నిసాన్‌ షోరూమ్‌ ముందున్న బస్టాప్‌ సమీపంలోనే పడి అక్కడికక్కడే మృతి చెందారు. గత శనివారం ఫ్లైఓవర్‌ పైనుంచి దూసుకొచ్చిన కారు కూడా అదే ప్రాంతంలో పడింది. బస్టాప్‌తో పాటు ఆటో స్టాండ్‌ ఉంటే ఎప్పటికైనా ప్రమాదమేనని ఆలోచించిన ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలు ఆగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
 

మరిన్ని వార్తలు