అహంకారానికి, ఆత్మగౌరవానికి పోటీ

15 Nov, 2018 13:48 IST|Sakshi

పేద విద్యార్థులకు సన్న బియ్యం ఘనత కేసీఆర్‌దే..

అపవిత్ర పొత్తును చూసి స్వర్గంలోని ఎన్టీఆర్, వైఎస్సార్‌ ఆత్మ క్షోభిస్తుంది 

పిలిస్తే పలికే నాయకుడు కమల్‌రాజ్‌ 

నియోజకవర్గ అభివృద్ధి నిరోధకుడు భట్టి  

మధిర: రాష్ట్రంలో డిసెంబర్‌ 7న జరగనున్న ఎన్నికలు ఢిల్లీ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోటీ వంటివని రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్‌) అన్నారు. మధిర టీఆర్‌ఎస్‌ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌ నామినేషన్‌ సందర్భంగా మండల కేంద్రంలోని వైరారోడ్డులో బుధవారం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు అధ్యక్షతన బుధవారం జరిగిన భారీ బహిరంగ సభలో కేటీఆర్‌ మాట్లాడారు. మధిర నియోజకవర్గానికి సరిహద్దున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైతుబంధు పథకం ఉందా అని ప్రశ్నించారు.

ఆంధ్రాలో ఉన్న రైతులకు తెలంగాణలో గుంట భూమి ఉన్నా.. రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్న మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని గుర్తు చేశారు. కేసీఆర్‌ మనుమడు, మనుమరాలు ఏ సన్నబియ్యం తింటున్నారో.. పేదింటి విద్యార్థులకు కూడా ఆ సన్నబియ్యం అందిస్తున్నది కేసీఆరేనని అన్నారు. నేతన్నలు, గీతన్నలు, బీడీ కార్మికులకు, బోదకాలు బాధితులకు, వృద్ధులకు పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. రైతుబంధు పథకం కింద రైతులకు ఎకరానికి రూ.8వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, దేశంలో ఇది మరెక్కడా లేదన్నారు.

పేదింటి ఆడబిడ్డకు పెళ్లి చేయడానికి కట్నం ఇచ్చే స్తోమత లేనప్పటికీ, పెళ్లికి మేనమామ రాకపోయినప్పటికీ పెద్దకొడుకుగా రూ.లక్ష అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబాకర్‌ చెక్కులపై సంతకాలు పెట్టకుండా.. హైదరాబాద్‌లో కూర్చొని ఆరు నెలలు, 8 నెలలు ఆలస్యం చేస్తూ లబ్ధిదారుల పొట్టకొడుతున్న భట్టి విక్రమార్కను ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే మడుపల్లిలో లెదర్‌ పార్క్, బోనకల్‌లో డిగ్రీ కళాశాల, వైరా నదిపై మడుపల్లి వద్ద బ్రిడ్జి తదితర కార్యక్రమాలు చేపడతామన్నారు. రూ.5లక్షలు ఇచ్చి అనుకూలమైన స్థలంలో డబుల్‌ బెడ్‌రూం ఇల్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. భట్టి ఎమ్మెల్సీగా ఉండి.. తెలంగాణ వద్దని ఢిల్లీకి వెళ్లి చెప్పిన మాట వాస్తవం కాదా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. పురపాలక శాఖ మంత్రిగా ఉన్న తనను మధిర మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఏనాడూ స్థానిక ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయాలని అడగలేదన్నారు.
  
కేసీఆర్‌ను విమర్శించడమే పని..
 
హైదరాబాద్‌లో కూర్చొని ప్రెస్‌మీట్లు పెట్టి కేసీఆర్‌ను విమర్శించడమే భట్టి విక్రమార్క పనిగా పెట్టుకున్నారని, నియోజకవర్గ అభివృద్ధిని ఆయన ఏనాడూ పట్టించుకోలేదని ఆరోపించారు. పిలిస్తే పలికే నాయకుడు కమల్‌రాజ్‌ అని, ప్రజల్లో ఉండే కమల్‌రాజ్‌ కావాలో.. హైదరాబాద్‌లో కూర్చునే భట్టి కావాలో తేల్చుకోవాలన్నారు. జాలిముడి ప్రాజెక్టు నిర్మాణం కాంగ్రెస్‌ పార్టీ పనితీరుకు నిదర్శనమైతే.. భక్తరామదాసు ప్రాజెక్టు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరును తెలియజేస్తుందన్నారు. ఇటీవల కేసీఆర్‌ను కుటుంబ పాలన అని విమర్శిస్తున్న భట్టి.. మల్లు అనంతరాములు కుటుంబం నుంచి రాలేదా అని ఆయన ప్రశ్నించారు.
 
ఆయన గెలుపు కోసం ప్రస్తుతం కుటుంబ సభ్యులు ప్రచారం చేయడం లేదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి టీడీపీ తోక పార్టీగా మారిందని విమర్శించారు. జెండాలు, ఎజెండాలు వేరని, అటువంటి పార్టీలు మహాకూటమిగా ఏర్పడి కేసీఆర్‌ను గద్దె దించాలని ఎజెండాగా పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. మహాకూటమి పొత్తును స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్, వైఎస్‌.రాజశేఖరరెడ్డి చూసి బాధపడతారని తెలిపారు. గోదావరి జలాలు రావాలన్నా.. అభివృద్ధి కొనసాగాలన్నా.. ఉచిత విద్యుత్‌ ఉండాలన్నా.. సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగాలంటే మీరు ఏగట్టున ఉంటారో తేల్చుకోవాలన్నారు. మధిర నియోజకవర్గ ప్రజలు ఆలోచించి కమల్‌రాజ్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
 
సభలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బొమ్మెర రామ్మూర్తి ప్రసంగించారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు, ఖమ్మం మేయర్‌ పాపాలాల్, వక్కలగడ్డ సోమచంద్రశేఖర్, ఆర్జేసీ కృష్ణ, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, తుంబూరు దయాకర్‌రెడ్డి, చావా రామకృష్ణ, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ మొండితోక నాగరాణి సుధాకర్, ఎంపీపీ వేమిరెడ్డి వెంకట్రావమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు మూడ్‌ ప్రియాంక, ఎర్రుపాలెం ఎంపీపీ చావా అరుణ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు