ఐఆర్‌పీలు.. అడ్డగోలు ఫీజులు 

19 Jan, 2018 01:54 IST|Sakshi

దివాలా పరిష్కారదారుల తీరుపై ఎన్‌సీఎల్‌టీ విస్మయం 

రూ. 4.17 కోట్ల రుణం చెల్లించడంలో విఫలమైన మధుకాన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: పావలా కోడికి ముప్పావలా మసాలా చందంగా తయారైంది దివాలా పరిష్కారదారు(ఐఆర్‌పీ)ల తీరు. నిర్దిష్టమైన నిబంధనలు, మార్గదర్శకాలు లేకపోవడంతో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇటీవల మధుకాన్‌ కంపెనీ దివాలా ప్రక్రియలో ఐఆర్‌పీ కోరుతున్న ఫీజు చెల్లించాల్సిన రుణానికి 3 రెట్లు ఎక్కువగా ఉండటంతో విస్మయం వ్యక్తం చేసిన హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ).. ఈ వ్యవహారాన్ని ఇన్సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ బోర్డు (ఐబీబీఐ)కు నివేదించింది. సమస్యకు పరిష్కారం చూపి ఫీజు ఎక్కువగా ప్రతిపాదించిన ఐఆర్‌పీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. ఎన్‌సీఎల్‌టీ సభ్యులు విత్తనాల రాజేశ్వరరావు, రవికుమార్‌ దురైస్వామిల ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. మధుకాన్‌ సంస్థ తీసుకున్న రుణం రూ.4.17 కోట్లు చెల్లించడంలో విఫలమైనందుకుగాను దివాలా ప్రక్రియను ప్రారంభించాలంటూ ఎన్‌సీఎల్‌టీలో ముంబైకి చెందిన శ్రీకృష్ణ రైల్‌ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

కేసుకు సంబంధించి దివాలా పరిష్కారదారుగా నియమితులైన భావనా సంజయ్‌ రుయా.. రుణదాతల కమిటీ మొదటి సమావేశం వరకు రూ.5 కోట్లు, తర్వాత నెలకు రూ.1.75 కోట్ల ఫీజు చెల్లించాలని ప్రతిపాదించారు. మధుకాన్‌ చెల్లించాల్సిన రుణం వడ్డీ సహా రూ.4.17 కోట్లేనని ధర్మాసనం తెలిపింది. మధుకాన్‌ ఎండీ, సీఈవోల వేతనం ఏడాదికి రూ.60 లక్షలు, పూర్తిస్థాయి డైరెక్టర్ల వేతనం రూ.50 లక్షలు.. వీరి వేతనాలు ఏడాదికి రూ.1.10 కోట్లు అవుతుందని, ఐఆర్‌పీ మాత్రం రూ.14 కోట్లు ఫీజుగా ప్రతిపాదించారని ఆక్షేపించింది. ఐఆర్‌పీ భావనా రుయా పిటిషనర్‌ తరఫు న్యాయవాది సంజయ్‌ రుయా భార్యని.. సంజయ్‌ కూడా ఐఆర్‌పీగా రూ.85 లక్షలు ఫీజు ప్రతిపాదించగా రూ.9లక్షలకు తగ్గించినట్లు గుర్తు చేసింది. భావన ప్రతిపాదించిన అసాధారణ ఫీజుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని ఐబీబీఐకి సిఫార్సు చేసింది.   

మరిన్ని వార్తలు