మీరు ఇస్తామన్న 30 కోట్లు ఏవి?

1 Mar, 2019 19:44 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని నిజామాబాద్‌ మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్‌ విమర్శించారు. మద్దతు ధర కోసం ఆర్మూర్‌ రైతులు కొన్ని రోజులుగా ధర్నా చేస్తున్నా స్థానిక ఎంపీ కవిత పట్టించుకోవడంలేదని ఆయన మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పంటల మద్దతు ధర కోసం రైతులు ధర్నా చేస్తే అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టడం దారుణమన్నారు.

పసుపు, ఎర్రజొన్నల పంటలకు గిట్టుబాటు ధర కల్పిచాలని కోరుతూ.. నిజామాబాద్‌, ఆర్మూర్‌ రైతులు గత కొద్దిరోజులుగా జాతీయరహదారిపై ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రైతుల ఆందోళన వెనుక ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని, సీఎం కేసీఆర్‌ రైతుల ఆందోళనకు రాజకీయ రంగు అంటగడుతున్నారని మండిపడ్డారు. జైల్లో పెట్టిన రైతులను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు నిధులు ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తామన్న రూ.30 కోట్లు ఏవని మధుయాష్కీ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు