శిరీష పలు విషయాలు వెల్లడించింది: సింధుశర్మ

10 Apr, 2017 11:35 IST|Sakshi
శిరీష పలు విషయాలు వెల్లడించింది: సింధుశర్మ

పెద్దపల్లి: హైకోర్టు ఆదేశాల మేరకు మంథని మధుకర్‌ మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు విచారణ అధికారి ఏసీపీ సింధుశర్మ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 60మందిని విచారణ జరిపినట్లు ఆమె సోమవారమిక్కడ పేర్కొన్నారు. మధుకర్‌ కేసులో కీలకమైన శిరీషను విచారణ చేశామని, ఈ సందర్భంగా ఆమె పలు విషయాలు వెల్లడించినట్లు సింధుశర్మ తెలిపారు.  విచారణ కొనసాగుతున్న దృష్ట్యా అన్ని వివరాలు వెల్లడించలేమని ఆమె అన్నారు. ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి ఫోన్‌కాల్‌ డేటా వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు భారీ పోలీసు బందోబస్తు మధ్య మధుకర్‌ మృతదేహానికి  సోమవారం రీ పోస్టుమార్టం జరుపుతున్నారు. కరీంనగర్‌ చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ పర్యవేక్షణలో కుటుంబసభ్యుల సమక్షంలో కేఎంసీ, ఉస్మానియా వైద్య బృందం పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీస్తున్నారు. పోలీసులు దీనిపై నివేదికను సీల్డ్‌ కవర్‌లో హైకోర్టుకు అందించనున్నారు.

కాగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్‌కు చెందిన మధుకర్‌ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అతడి మృతదేహానికి మరోసారి శవ పరీక్ష (రీపోస్టుమార్టం) నిర్వహించాలని ఉమ్మడి హైకోర్టు పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఉస్మానియా, కాకతీయ మెడికల్‌ కాలేజీలకు చెందిన ఫోరెన్సిక్‌ నిపుణుల నేతృత్వంలో రీ పోస్టుమార్టం జరపాలని స్పష్టం చేసింది.

మార్చి 13న ఇంటి నుంచి వెళ్లిన మధుకర్‌ 14వ తేదీన శవమై కనిపించగా, దీన్ని పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే కుటుంబీకులు మాత్రం అది ముమ్మాటీకి హత్యేనని ఆరోపించారు. అగ్ర కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించినందుకు సదరు యువతి బంధువులు మధుకర్‌ను హత్య చేశారని తెలిపారు.

మధుకర్, శిరీష ప్రేమపెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు నిరాకరించారని, ఈ నేపథ్యంలో మధుకర్‌ హత్య జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడి మృతి కేసును హత్య కేసుగా పరిగణించి ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించాలని కోరుతూ మధుకర్‌ తల్లి లక్ష్మి హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు