వరి సాగు అస్సలొద్దు..

16 Jun, 2019 07:55 IST|Sakshi

మహబూబ్‌నగర్‌ రూరల్‌: ఈ సారి ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 1.25 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేస్తున్నట్లు అంచనా వేశాం.. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యాచరణ చేపట్టి అందుకు తగ్గట్టు అవసరమైన విత్తనాలను, ఎరువులను సిద్ధం చేసింది. రైతులు వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా  పంటలను సాగు చేసుకొని లబ్ధి పొందాలి.. అని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుచరిత సూచించారు. శనివారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సూచనలు చేశారు.

వాతావరణం వరికి అనుకూలించదు.. 
ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు జిల్లాలో వరి పంట సాగుకు ఏమాత్రం అనుకూలించే విధంగా లేవు. అందువల్ల రైతులు ఆరుతడి పంటల సాగుకే ప్రాధాన్యం ఇవ్వాలి. రైతులు పంటల సాగు విషయంలో మూస పద్ధతులు పాటిస్తే నష్టపోయే ప్రమాదం ఉంది. పంటల సాగు విషయంలో వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారుల సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకోవాలి.

భూగర్భజలాలు లేకనే.. 
గత ఏడేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురియకపోవడం వల్ల భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఈ కారణంగానే వరి పంట సాగు శ్రేయస్కారం కాదు. నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటివరకు కురియాల్సిన వర్షం కురియకపోవడం వల్ల జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. ఇకముందు కూడా నమోదయ్యే అవకాశం కనిపించడం లేదు. అందువల్ల రైతులు ఆరుతడి పంటల సాగుకే ప్రాధాన్యత ఇవ్వాలి.

నెలాఖరువరకు జొన్న, కందులు వేసుకోవచ్చు.. 
ఈ నెలాఖరు వరకు జొన్న, కందుల విత్తనాలను విత్తుకోవచ్చు. ఆ తర్వాత జూలై 15వ తేదీ వరకు పత్తి పంటను సాగు చేసుకోవాలి. జూలై ఆఖరు వరకు ఆముదం పంటను సాగు చేసుకోవాలి. పంటల సాగు విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. రైతులు వ్యవసాయ అధికారులు, విస్తరణాధికారుల సలహాలు తీసుకొని పంటలను సాగు చేస్తేనే ప్రయోజనకరంగా ఉంటుంది.
 
పదును ఉన్నప్పుడే విత్తనాలు వేయండి 
అదునుకు తగ్గ పదును లభిస్తేనే పంటలను సాగు చేసుకోవాలి.  కొద్దిపాటి వర్షపు జల్లులు కురిస్తే పంటలను సాగు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. విత్తనాలు విత్తే ముందే అన్ని రకాలుగా ఆలోచించి విత్తుకోవాలి. ఈ సంవత్సరం వర్షం సమృద్ధిగా కురియాలని రైతులతో పాటు తాము కూడా అభిలాషిస్తున్నాం.  ఒకవేళ వాతావరణ పరిస్థితులు అనుకూలించక వర్షం సమృద్ధిగా కురియకుంటే ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తాం.

విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి 
గత ఖరీఫ్‌లో ఎదురైన సవాళ్లను ఎదుర్కొని ఈ సీజన్‌లో రైతులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తగు జాగ్రత్తలను తీసుకుని ముందుకు సాగుతున్నాం. ఈ ఖరీఫ్‌లో వర్షాలు సకాలంలో కురిస్తే జిల్లా వ్యాప్తంగా 1.25 లక్షల హెక్టార్లలో వివిధ పంటలను సాగు చేసే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా వర్షాధార పంటలు పత్తి 35వేల హెక్టార్లు, కందులు 12వేల హెక్టార్లు, మొక్కజొన్న 39వేల హెక్టార్లు, ఆముదం వరి 17,211 హెక్టార్లు, జొన్న 8,500 హెక్టార్లు, ఆముదం 250 హెక్టార్లు, రాగులు 600 హెక్టార్లు సాగు చేసే అవకాశం ఉంది. వీటితో ఇతర పంటలు సాగు చేసే అవకాశం ఉంటుంది.

సబ్సిడీపై అందిస్తున్నాం.. 
జిల్లాలో రైతులకు సబ్సిడీపై అందించడానికి 15,977 క్వింటాళ్ల అన్ని రకాల విత్తనాలను సిద్ధంగా ఉంచాం. జిల్లాలోని పీఏసీఎస్, ఏఆర్‌ఎస్‌కే కేంద్రాల ద్వారా సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికే పత్తి విత్తనాలను డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయి. విత్తనాలకు ఎలాంటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

మరిన్ని వార్తలు