ఎస్సెస్సీ ప్రశ్నపత్రం లీక్‌పై కలెక్టర్‌ సీరియస్‌

22 Mar, 2018 08:08 IST|Sakshi
చీటీలను సేకరిస్తున్న కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌

పరీక్ష కేంద్రాలను చుట్టుముట్టిన అధికారులు

కలెక్టర్, ఆర్‌జేడీ, డీఈఓ,ఎంఈఓలందరూ తనిఖీల్లోనే..

భూత్పూర్‌లో ఒకరి డిబార్‌ 

ముగ్గురు కానిస్టేబుళ్లను  సస్పెండ్‌ చేసిన ఎస్పీ

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో కలెక్టర్‌ సమావేశం

సాక్షి, నెట్‌వర్క్‌ : మరికల్‌లో జరిగిన ఎస్సెస్సీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్‌గానే స్పందించారు. కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్, ఎస్పీ అనురాధ, ఆర్‌జేడీ విజయలక్ష్మి, డీఈఓ సోమిరెడ్డిలతోపాటు ఇతర అధికారులు బుధశారం ఉరుకులు, పరుగులు పెట్టడంతోపాటు క్షేత్రస్థాయి అధికారులను, సిబ్బందిని సైతం పరుగులు పెట్టించారు. స్వయంగా ఉన్నతాధికారులు సైతం సమస్యాత్మక కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. ఇలాంటి పొరపాటు మళ్లీ జరగకుండా బాధ్యులపై కఠినంగా వ్యవహరించారు. ఇప్పటికే 11 మందిపై వేటుపడింది. ఆ రోజు విధుల్లో ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లు కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు.   

భూత్పూర్‌ ఓ విద్యార్థి డిబార్‌
మండల కేంద్రంలోని రెండు సెంటర్లలో జరుగుతున్న పదో తరగతి పరీక్షలను బుధవారం కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. పంచవటి విద్యాలయం, జెడ్పీ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పరీక్ష రాస్తున్న గదుల వెనుక నుంచి వెళ్లి కలెక్టర్‌ పర్యవేక్షించారు. విద్యార్థులు కిటికీల నుంచి చీటీలు పడేసినట్లు గమనించిన కలెక్టర్‌ కొన్ని చీటీలు తీసి క్షుణ్ణంగా పరిశీలించారు. వాటిలో ఉన్న అక్షరాలను గుర్తించి ఓ గదిలో విద్యార్థుల రాత ట్యాలీ చేసి పరిశీలించారు. మరో చీటీలో ఏకంగా విద్యార్ధి పేరు చీటీపై రాసినట్లు గుర్తించిన కలెక్టర్‌ ఆ విద్యార్థి గురించి ఆరా తీశారు. కాసేపటి తర్వాత మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన విద్యార్థిని గురించి డీబార్‌ చేయాలని  చీఫ్‌ సూపరింటెండెంట్‌కు ఆదేశించి వెళ్లి పోయారు. ఇదిలాఉండగా కలెక్టర్‌ తనిఖీకి రావడంతో ఇన్విజిలేటర్లు ఆందోళనకు గురయ్యారు.   

ఉన్నతాధికారుల తనిఖీ
నారాయణపేట రూరల్‌: మరికల్‌లో ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై అప్రమత్తమైన విద్యాశాఖా అధికారులు పోలీస్, రెవెన్యూ అధికారులతో కలిసి పరీక్ష కేంద్రాల తనిఖీ ముమ్మరం చేశారు. డీఈఓ సోమిరెడ్డి, నారాయణపేట సబ్‌ కలెక్టర్‌ కృష్ణాధిత్యాతో పాటు మండలానికి ప్రత్యేక పరిశీలకులుగా నియమించిన జిల్లా సివిల్‌ సప్లయీస్‌ డీఎం భిక్షపతి, ఏఎంఓ రవీందర్, ఎంపీడీఓ వెంకటయ్య పట్టణంలోని ఆరు కేంద్రాలను తనిఖీ చేశారు. సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన ప్రభుత్వ గ్రౌండ్, బాలికల ఉన్నత పాఠశాల చుట్టు పోలీసు, రెవిన్యూ సిబ్బందితో బందోబస్తు పెంచారు. అలాగే మోడ్రన్‌ స్కూల్‌ కేంద్రంలో ఎస్‌ఐ ఎం.కృష్ణయ్య ఆధ్వర్యాన వీడియో చిత్రీకరణ చేపట్టారు.

డీఈఓ హల్‌చల్‌
మరికల్‌: స్థానిక బాలుర, బాలికల ఉన్నత పాఠశాలోని పరీక్ష కేంద్రాలను బుధవారం డీఈఓ సొమిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి హల్‌చల్‌ చేశారు. గణితం పేపర్‌–1 పరీక్ష రాస్తున్న విద్యార్థుల ప్యాడ్లు, చూట్టు పక్కల ప్రాంతాలను క్షుణంగా పరిశీలించారు. ఎవరైనా మాస్‌కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.   

డీఎఫ్‌ఓ పరిశీలన
అడ్డాకుల: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో  డీఎఫ్‌ఓ గంగారెడ్డి తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలోని గదులన్నింటినీ ఎంపీడీఓ బి.నర్సింగ్‌రావుతో కలిసి పరిశీలించారు. మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని ఇన్విజిలేటర్లను, నిర్వాహకులను ఆదేశించారు.   

ముగ్గురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌ : ఎస్పీ  
మహబూబ్‌నగర్‌ క్రైం: జిల్లాలో కలకలం సృష్టించిన పదో తరగతి ప్రశ్నపత్రం లీక్‌పై మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవలే మరికల్‌ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్‌ ప్రశ్నపత్రం లీక్‌పై కేసు నమోదు చేయించిన ఎస్పీ అనురాధ స్వయంగా దృష్టిసారించారు. ఈ కేసులో పోలీసులు చేసిన విచారణలో లభించిన సాక్ష్యాధారాల మేరకు స్థానికంగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలడంతో ఎస్పీ ఆ రోజు విధుల్లో ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెన్షన్‌ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటూ సున్నితమైన అంశాల పట్ల నిర్లక్ష్యం వహించడం, వ్యక్తిగత లాభాపేక్షతో వ్యవహరించడం ఏమాత్రం సహించరాదని స్పష్టం చేశారు. విధులు పట్ల ఎవరు నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
భూత్పూర్‌లోని ఓ పరీక్ష కేంద్రం వెనకాల


 

మరిన్ని వార్తలు