పల్లె పిలుస్తోంది!

22 Mar, 2019 09:40 IST|Sakshi

సాగునీటి ప్రాజెక్టులతో పంటలకు జీవం

పాలమూరు వలసలు వాపస్‌వలసజీవుల తిరుగు పయనం

పల్లె పిలుస్తోంది. సాగుకు నీరు లేక, చేతినిండా పనిలేక పొట్ట కూటికి పరాయి ప్రాంతాలకు వలస వెళ్లిన బిడ్డల్ని వాపస్‌ రమ్మంటోంది. ఒకప్పుడు సాగునీరందక కరువుతో అల్లాడిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు కొత్త కళొచ్చింది. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావచ్చాయి. పంటలకు జీవం పోశాయి. ఒకప్పుడు వలసలకు కేరాఫ్‌గా పేరొందిన పాలమూరు ఇప్పుడు సాగుకు చిరునామాగా మారుతోంది. కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్, కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు, సంగంబండ, భూత్పూర్‌ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తి కావడంతో గడిచిన రెండేళ్లలో వ్యవసాయ ముఖచిత్రం మారిపోయింది. ఒకప్పుడు ఉన్న ఊళ్లో చేసేందుకు పని లేక బతుకుజీవుడా అని మూటాముల్లె కట్టుకుని నగరాలు, పట్టణాలకు వలస వెళ్లిన సుమారు పది లక్షల జనం ఇప్పుడు సొంతూళ్ల దారి పడుతున్నారు. వెనక్కి వచ్చిన వారిలో కొంత మంది సాగు పనుల్లో నిమగ్నమయ్యారు, కొందరు వ్యవసాయ అనుబంధ పనులతో ఉపాధి పొందుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగు.. బాగయింది. నాటి, నేటి పరిస్థితులపై ప్రత్యేక కథనం..- ముహమ్మద్‌ ముజాహిద్‌ బాబా, మహబూబ్‌నగర్‌

పంట పండింది
నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం నుంచి ఏటా దాదాపు 20 వేల మందికి పైగా రైతులు, వ్యవసాయాధారిత వృత్తుల వారు పొట్టచేత పట్టుకుని కూలి పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు లేని రోజుల్లో పంటలకు వర్షమే ఆధారం. వానలు పడకుంటే పంటలు ఎండిపోయేవి. పంట కోసం చేసిన అప్పులు తీర్చే దారి తోచక రైతులు ఆత్మహత్య చేసుకునేవారు. జిల్లాలో సాగునీటి కోసం కేఎల్‌ఐ ప్రాజెక్టుకు 2002లో శంకుస్థాపన మాత్రమే జరిగింది. 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టుకు సంబంధించి 90 శాతం పనులు పూర్తి చేశారు. అనంతరం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక పెండింగ్‌ పనులను పూర్తి చేసింది. కేఎల్‌ఐ ద్వారా పొలాలకు నీరొచ్చింది. దీంతో ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌ నియోజవర్గంలో 98 గ్రామాల పరిధిలోని 70 వేల ఎకరాలకు నీరందుతోంది. గతంలో     నీరులేక పంటలు పండక వలసెళ్లిన వారు ప్రస్తుతం తిరిగొచ్చారు.

పెద్దపల్లిలో 200 కుటుంబాలు వెనక్కి..
నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలోని పెద్దపల్లిలో 800 కుటుంబాలు ఉంటాయి. దాదాపు 200 కుటుంబాల వారు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌తోపాటు హైదరాబాద్‌కు కూలీలుగా వెళ్లారు. ఏడాదిగా పెద్దపల్లికి కేఎల్‌ఐ ద్వారా సాగునీరు అందుతుండటంతో వలస వెళ్లిన వారంతా తిరిగొచ్చి సాగు చేసుకుంటున్నారు. గ్రామంలో మొత్తం 4,500 ఎకరాల భూమి ఉండగా సాగుయోగ్యమైన భూమి 2,495 ఎకరాలే. కేఎల్‌ఐ నీరు రాకముందు 500 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి పండించేవారు. ప్రస్తుతం సాగు విస్తీర్ణం 1,500 ఎకరాలకు పెరిగింది.

నర్వ.. వలస వెళ్లనంటోంది!
నర్వ మండలంలో భూత్పూరు, సంగంబండ రిజర్వాయర్‌తో పాటు కోయిల్‌సాగర్‌ కెనాల్‌ ద్వారా రైతులు సాగునీటిని పారించుకుంటున్నారు. రిజర్వాయర్ల ద్వారా మండలంలోని అన్ని గ్రామాల చెరువులను నింపడంతో చెరువు ఆయకట్టు విస్తీర్ణం పెరిగింది. ఎల్లంపల్లి, పెద్దకడ్మూర్, అప్పంపల్లి శివారు, కొత్తపల్లి, లక్కర్‌దొడ్డి, యాంకి, బెక్కర్‌పల్లి, నాగిరెడ్డిపల్లి, నర్వ, లంకాల్, రామ్‌పురం గ్రామాల రైతులకు రిజర్వాయర్ల నుంచి సాగునీరు అందడంతో గతంతో పోలిస్తే వలసలు తగ్గాయి. గతంలో నాలుగు వేలకు పైగా రైతులు వలస వెళ్లేవారు. ఖరీఫ్, రబీ పంటలకు సాగునీరందితే వలసలు ఆగిపోతాయి.

నెట్టెంపాడుతో చిగురించిన ఆశలు
గద్వాల జిల్లాలో నెట్టెంపాడు ప్రాజెక్టు రాక ముందు గట్టు, ధరూరు, మల్దకల్‌ మండలాల రైతులు పక్కనే ఉన్న కర్ణాటక, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. అయితే నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా 4 టీఎంసీల సామర్థ్యంలో ర్యాలంపాడు రిజర్వాయర్‌ నిర్మించారు. ఇందులో మూడేళ్లుగా పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. గట్టు, కేటిదొడ్డి మండలాల్లో చాలా గ్రామాలు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి.

సీన్‌ రివర్స్‌..!
గట్టు, ధరూరు, కేటి దొడ్డి మండలాల నుంచి ఒకప్పుడు బతుకుదెరువు కోసం వలసలు వెళ్లేవారు. ర్యాలంపాడు రిజర్వాయర్‌లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడం ద్వారా వ్యవసాయపనులు పెరిగాయి. గట్టు, మల్దకల్, ధరూరు మండలాలకు కర్ణాటక నుంచి కూలీలు వస్తున్నారు. కర్ణాటకలోని రాయచూర్‌ చుట్టుపక్కల ఉన్న యరగేర, చంద్రబండ, వడ్డేవాట, సింగనేడి, బాయ్‌దొడ్డి, ఉండ్రాలదొడ్డి, బిజినిగేరి గ్రామాల నుంచి శ్రామికులు పనుల కోసం ఇక్కడికి వస్తున్నారు.

జీవం పోసిన ‘సంగంబండ’
సంగంబండ ప్రాజెక్టు మక్తల్‌ నియోజకవర్గ పరిధిలోని 30కి పైగా పల్లెలకు జీవం పోసింది. సాగునీరు లేని రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధికంగా ఈ నియోజకవర్గం నుంచే పది వేల మందికి పైగా ముంబైకి వలస వెళ్లేవారు. మక్తల్‌ మండలంలోని కర్ని, చిట్యాల, మంతన్‌గోడ్, ఖానాపూర్, పంచదేవ్‌పాడు, చిన్నగోప్లాపూర్, రుద్రసముద్రం, ముష్టి్టపల్లి, దాసర్‌దొడ్డి, మాగనూరు గ్రామాల నుంచి అత్యధిక వలసలుండేవి. సంగంబండ, భూత్పూర్‌ రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టడంతో బీడు భూములు పచ్చబడుతున్నాయి. భూత్పూర్‌ రిజర్వాయర్‌ నుంచి కాల్వల ద్వారా చెరువులను నింపుకుని రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు.  

సాగు ఖిల్లా
ఇది వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం గ్రామం. ఈ గ్రామానికి ఆనుకుని ఘట్టుకాడిపల్లి అనే చిన్న పల్లె ఉంది. రెండు గ్రామాల్లో కలిపి జనాభా 8,300కు పైనే. ఈ ప్రాంత ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. 3,701 ఎకరాల సాగు విస్తీర్ణం ఉన్న ఈ గ్రామాల్లో ఏడాదిన్నర క్రితం సాగునీరు లేక 460 ఎకరాలే సాగయ్యేవి. నేల నెర్రలు బారడం తో వేలాది మంది రైతులు కుటుంబాలతో సహా హైదరాబాద్, ముంబై ఇతర పట్టణాలకు వలస వెళ్లేవారు. ఏడాదిన్నర క్రితం వరకూ ఆ పల్లె ల్లో ఎటు చూసినా బీడు భూములే. ఇప్పుడా పరిస్థితి మారింది. కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు (కేఎల్‌ఐ) పూర్తయింది. ఆ ప్రాజెక్టు నుంచి నీరు ఖిల్లాఘనపురంలో ఉన్న గణపసముద్రం చెరువుకు చేరింది. 2018–19 ఖరీఫ్‌లో 2,300 ఎకరాలు, రబీలో 1,900 ఎకరాల్లో పంటలు వేశారు. రైతులు కరువును జయించి.. సొంతూళ్లలోనే ఆనం దంగా జీవిస్తున్నారు.

బతుకునిచ్చిన ‘భూత్పూర్‌’
రిజర్వాయర్‌ కెనాల్‌ ద్వారా మా పంట పొలాలకు సాగునీరందుతోంది. దాంతో పనుల కోసం వలస పోవడం మానుకున్నాం. గతేడాది రెండు పంటలకు నీరందింది. రిజర్వాయర్‌లో నీరు నిల్వ ఉండటం వల్ల భూగర్భ జల మట్టం పెరిగింది. బావుల కింద సాగుచేస్తున్నాను. ప్రభుత్వం అందిస్తున్న నిరంతర విద్యుత్, రిజర్వాయర్ల సాగునీటితో వలసలు బంద్‌ అవుతున్నాయి.– నాగన్న, రైతు, పెద్దకడ్మూర్‌

ఇరవై ఏళ్ల తర్వాత..
నాకు నాలుగెకరాల పొలం ఉంది. గతంలో వర్షంపైనే ఆధారపడి పంటలేసి నష్టపోయాను. ఇక ఇక్కడ బతకలేనని 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కెళ్లి చిన్నాచితకా పనులు చేసుకుంటూ బతుకు వెళ్లదీశా ను. రెండేళ్లుగా కేఎల్‌ఐ నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు మా ఊరికొచ్చి సాగు చేస్తున్న. రైతుకి పంటలు పండించుకుంటూ సొం తూర్లో బతకడానికి మించిన ఆనం దం ఇంకేముంటుంది. ఎండిన బతుకులు తిరిగి చిగురిస్తున్నాయి.

ఇంకెందుకు పోతాం
కాలువల నుంచి పొలాలకు నీళ్లు రావడంతో హైదరాబాద్‌ వెళ్లడం మానేశాను. కాలువల్లో నీళ్లు నిల్వ ఉండటంతో నేల చల్లబడింది. ఎండిపోయిన బోర్లు కూడా పని చేస్తున్నాయి. గతేడాది నుంచి వేరుశెనగ, వరితో పాటు కూరగాయల సాగు చేస్తున్నారు. వ్యవసాయ అనుబంధ ఉపాధి కూడా పెరిగింది. ఇక మాకు బతకడానికి ఎక్కడికో పోవాల్సిన పనేముందిప్పుడు.

వలసల ఆనకట్ట.. నెట్టెంపాడు
నా పేర ఐదెకరాల పొలం ఉంది. ముగ్గురు పిల్లలు. వాళ్ల చదువులు, జీవనం కోసం ఇబ్బంది పడేవాళ్లం. వైఎస్సార్‌ పుణ్యాన, ఆయన చేపట్టిన నెట్టెంపాడు ప్రాజెక్టు మాకిప్పుడు బతుకునిస్తోంది. ర్యాలం పాడు రిజర్వాయర్‌ నుంచి మా గ్రామానికి నీరందుతోంది. పంటలు బాగా పండిస్తున్నాం. గతంలో నీళ్లు లేక, పంటలు పండక, పనుల కోసం కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్లే వాళ్లం. రిజర్వాయర్‌ నుంచి నాలుగేళ్లుగా ఒక పంటకు సాగు నీరందుతోంది. ఇప్పుడు సొంతూర్లోనే ఉంటున్నాం. పెద్దమ్మాయికి ఇటీవలే పెళ్లి చేశాం.

మరిన్ని వార్తలు