కాన్పు కోసం వస్తే కాదన్నారు

27 Sep, 2018 02:19 IST|Sakshi
ఆస్పత్రి ఎదుట బాలకిష్టమ్మ

     మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం 

     ఆస్పత్రి ముఖద్వారం వద్దే ప్రసవించిన మహిళ

పాలమూరు: మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రి సిబ్బంది ఓ నిండు గర్భిణికి వైద్య సాయం అందించకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. కాన్పు కోసం వచ్చిన ఆ మహిళను హైదరాబాద్‌ వెళ్లాలంటూ సిబ్బంది ఉచిత సలహా ఇవ్వగా.. బయటకు రాగానే నొప్పులు తీవ్రమై ఆ గర్భిణి ఆస్పత్రి ముఖద్వారం వద్దే ప్రసవించిన ఘటన ఇది. మహబూబ్‌నగర్‌ ధన్వాడ మండల కేంద్రానికి చెందిన బాలకిష్టమ్మను కాన్పు కోసం మంగళవారం ఉదయం ధన్వాడ పీహెచ్‌సీకి వెళ్లారు. అక్కడి సిబ్బంది జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రికి పంపించారు. దీంతో సాయంత్రం 5 గంటలకు ఆస్పత్రికి చేరుకున్నారు. బాలకిష్టమ్మకు వైద్యం చేయాల్సిందిగా కుటుంబీకులు కోరినా అక్కడి వైద్యులు, సిబ్బందిని స్పందించలేదు.

బుధవారం ఉదయం బాలకిష్టమ్మకు 2 సూదులు ఇచ్చి శిశువు బరువు తక్కువగా ఉన్నందున హైదరాబాద్‌ వెళ్లాలని సూచించారు. తాము పేద వాళ్లమని, హైదరాబాద్‌  వెళ్లడానికి ఇబ్బందిగా ఉన్నందున ఇక్కడే ప్రసవం చేయాలని కోరినా నర్సింగ్‌ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది కలసి బాలకిష్టమ్మను ఆమె భర్త బాలస్వామిని ఆస్పత్రి బయటకు పంపారు. బయటకు వచ్చిన కొన్ని క్షణాల్లో బాలకిష్టమ్మకు నొప్పులు తీవ్రమయ్యాయి. మళ్లీ ఆమె భర్త లేబర్‌ రూంలో విధులు నిర్వహిస్తున్న వైద్యురాలి దగ్గరకు వెళ్లి బయటకు రావాలని కోరినా స్పందించలేదు. ఉదయం 11 సమయంలో అక్కడ ఉన్న మహిళల సాయంతో బాలకిష్టమ్మ ఆస్పత్రి ముఖద్వారం వద్దే మగశిశువుకు జన్మనిచ్చింది. మీడియా సిబ్బంది వైద్యుల దృష్టికి తీసుకువెళ్లగా బాలకిష్టమ్మ, శిశువును ఆస్పత్రిలోకి తీసుకువెళ్లారు. 

హైదరాబాద్‌ వెళ్లాలని సూచించినా వెళ్లలేదు.. 
దీనిపై జిల్లా జనరల్‌ ఆస్పత్రి డిప్యూటీ సూపరిం టెండెంట్‌ డాక్టర్‌ జీవన్‌ను వివరణ కోరగా, బాలకిష్టమ్మకు బుధవారం ఉదయం ఉమ్మ నీరు పోతుంటే లేబర్‌ రూంకు తరలించి పరీక్షలు చేయగా శిశువు బరువు తక్కువగా ఉన్నట్లు తేలిందని, దీంతో హైదరాబాద్‌ నిలోఫర్‌కు వెళ్లాలని సూచించినా వాళ్లు వెళ్లకుండా అక్కడే ఉన్నారని తెలిపారు. దీంతో నొప్పులు తీవ్రమై ప్రసవించిందన్నారు. శిశువు బరువు తక్కువగా ఉండడంతో చికిత్స చేస్తున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు