బీజేపీ  గెలుపు ఖాయం

26 Mar, 2019 10:48 IST|Sakshi

సాక్షి, పాలమూరు : జిల్లాలో డీకే అరుణకు ఉన్న ప్రజాదరణను గుర్తించిన పార్టీ నాయకత్వం మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థిగా ఆమెను బరిలో దించిందని, ఫలితంగా 20 ఏళ్ల తర్వాత పాలమూరులో మళ్లీ బీజేపీ గెలవబోతుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ అన్నారు. తెలంగాణలో బీజేపీని పటిష్టం చేయడంలో పార్లమెంట్‌ ఎన్నికలు మొదటి మెట్టుగా భావిస్తున్నామన్నారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ సీటును 20 ఏళ్ల తర్వాత సీటు గెలవాలని కార్యకర్తలు భావిస్తున్నారు.

డీకే అరుణ గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మోదీ మహబూబ్‌నగర్‌కు వస్తున్నారు.. దీన్ని బట్టి డీకే అరుణపై బీజేపీకి ఎంత నమ్మకం ఉందో తెలుస్తుందన్నారు. రాష్ట్రంలోని 17 సీట్లలో కొన్ని ముఖ్య స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నిజాం నియంతృత్వ పాలనను ప్రజలు ఎండగడతారనే విశ్వాసం తమలో పెరుగుతుందన్నారు. రజాకార్ల పార్టీతో పొత్తు పెట్టుకుని కేసీఆర్‌ మత రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఎన్నికల కోసం అయోధ్య రామాలయం అంశాన్ని వాడుకునే అవసరం బీజేపీకి లేదని, ఆ అంశం జాతీయ అంశమని వ్యాఖ్యానించారు.

రామ జన్మభూమి గురించి కేసీఆర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. దేశ భద్రత కోసం.. దేశ భవిష్యత్తు కోసం నరేంద్రమోదీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా డీకే అరుణని గెలిపించాలని పిలుపునిచ్చారు. నిధులను దారి మళ్లించారు.. బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మాట్లాడుతూ కేంద్రం ఎన్నో నిధులు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినా.. వాటిని సద్వినియోగం చేసుకోకుండా ఇచ్చిన నిధులను టీఆర్‌ఎస్‌ పాలకులు దారి మళ్లించారని ఆరోపించారు.

కేంద్రంలో చక్రం తిప్పి, ప్రధాని అవుతానని చెబుతున్న కేసీఆర్‌ కేవలం 16 సీట్లతో ఏవిధంగా ప్రధాని అవుతారో ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష బాధ్యతను పోషించలేని దుస్థితికి చేరిన నేపథ్యంలో తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పారు. దేశ భద్రత, సంక్షేమం కోసం దేశ ప్రజలు మోదీ నాయకత్వం కోరుకుంటున్నారన్నారు. తెలంగాణలో కొనసాగుతున్న అరాచక పాలనను, నిజాం వారసత్వ రాజకీయాలను తరిమికొట్టాలంటే బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమన్నారు. బీజేపీకి ఓటు వేయడం ద్వారా దేశ సమగ్రతను కాపాడుకోవచ్చన్నారు.

మరిన్ని వార్తలు