ఆరెంజ్‌ జోన్‌లో పాలమూరు

16 Apr, 2020 13:10 IST|Sakshi
జిల్లాకేంద్రంలో తనిఖీలు చేస్తున్న పోలీసులు

దేశవ్యాప్తంగా రెడ్‌ జోన్, ఆరెంజ్‌ జోన్‌ జాబితా విడుదల

20కి పైగా కేసులు ఉండడంతో రెడ్‌జోన్‌లోకి జోగుళాంబ గద్వాల  

ఆరెంజ్‌ జోన్‌లో నాగర్‌కర్నూల్‌ జిల్లా

గ్రీన్‌ జోన్‌ పరిధిలోకి వనపర్తి, నారాయణపేట  

జిల్లావ్యాప్తంగా పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు

వారం రోజుల్లో ఒక్క పాజిటివ్‌ కేసు లేదు

మహబూబ్‌నగర్‌ క్రైం: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రెడ్‌జోన్, ఆరెంజ్‌ జోన్ల జాబితాను ప్రకటించింది. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని జిల్లాల వారీగా రెడ్, ఆరెంజ్, గ్రీన్‌ జోన్‌లుగా విభజించింది. ఈ జాబితాలో ఉమ్మడి పాలమూరులో గద్వాల జిల్లా ఒక్కటే రెడ్‌జోన్‌లో ఉండగా.. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ ఆరెంజ్‌ జోన్‌ పరిధిలోకి వెళ్లాయి. ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాని వనపర్తి, నారాయణపేట జిల్లాలు గ్రీన్‌జోన్‌ పరిధిలో ఉన్నాయి. 20కి పైనా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన జిల్లాలను రెడ్‌ జోన్‌లోకి, 10 నుంచి 20 లోపు పాజిటివ్‌ కేసులు ఉన్న జిల్లాలను ఆరెంజ్‌ జోన్‌ పరిధిలోకి, 0–5 కేసులు నమోదైన జిల్లాలను గ్రీన్‌ జోన్‌ పరిధిలోకి తెస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

గద్వాల జిల్లా రెడ్‌జోన్‌లోకి వెళ్లడం కలవర పెడుతోంది. మిగిలిన నాలుగు జిల్లాలతో పోలిస్తే ఈ జిల్లాలో పాజిటివ్‌ కేసులు రెండింతలు అధికంగా ఉన్నాయి. రెడ్‌జోన్‌ అంటే పాజిటివ్‌ కేసు నమోదైన ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల పరిధిని ఈ జోన్‌లో కలుపుతారు. ఈ జోన్‌లో నివాసం ఉండే వ్యక్తులు అనుమతి లేనిదే బయటకు వెళ్లడానికి వీలులేదు. వారి ఇంటికి నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాలు ఇతర వస్తువులను ఆయా మున్సిపాలిటీ అధికారులు సరఫరా చేస్తారు. ఆరెంజ్, గ్రీన్‌ జోన్‌లపై పెద్దగా ఆంక్షలు లేకపోయినా పాజిటివ్‌ కేసు వచ్చిన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండే వారందరూ హోం క్వారంటైన్‌లో ఉండాలి. ప్రతి రోజూ వీరికి జిల్లా వైద్యారోగ్యశాఖ సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 

పెండింగ్‌లో మూడు శాంపిల్స్‌  
బాలానగర్‌  మండలంలో ఓ కంపెనీలో పని చేస్తున్న బిహార్‌ రాష్ట్రానికి చెందిన ఓ కార్మికుడు రెండు రోజుల కిందట జ్వరం, వాంతులు చేసుకొని మృతి చెందాడు. మృతి చెందిన కార్మికుడికి కరోనా లక్షణాలు ఉన్నాయని ప్రచారం కావడంతో వైద్యాధికారులు అతని నమూనాలు సేకరించి పంపించారు. ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. అలాగే అతనితో సన్నిహితంగా ఉన్న ఇద్దరు వ్యక్తుల నమూనాలు తీసి పంపగా వారి ఇద్దరికి నెగిటివ్‌ వచ్చింది. బుధవారం జిల్లాలోని నవాబ్‌పేట, కోయిలకొండ ప్రాంతాలకు చెందిన మరో ఇద్దరు వ్యక్తుల నమూనాలను కరోనా నిర్ధారణ కేంద్రాలకు పంపారు. ఇప్పటి వరకు జిల్లా నుంచి 277 నమూనాలు పంపగా.. 11పాజిటివ్‌ వచ్చాయి. మరో మూడు నమూనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం జనరల్‌ ఆస్పత్రి ఐసోలేషన్‌లో ఒకరు, ఎస్‌వీఎస్‌లో ఒకరు ఉన్నారు. పాలమూరు మెడికల్‌ కళాశాల క్వారంటైన్‌ కేంద్రంలో 12మంది ఉన్నారు.

నిరంతరం పర్యవేక్షణ..
మహబూబ్‌నగర్‌ జిల్లాలో కరోనా వైరస్‌ కట్టడికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. మర్కజ్‌ వెళ్లి వచ్చిన వ్యక్తులతో పాటు ప్రథమ, ద్వితీయ కాంటాక్ట్‌ కేసుల గుర్తింపు పూర్తయింది. విదేశాల నుంచి వచ్చిన వారి హోంక్వారంటైన్‌ గడువు ఇప్పటికే ముగిసింది. ఈ క్రమంలో జిల్లాలో కొత్తగా పాజిటివ్‌ కేసుల నమోదు తగ్గింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో వారం రోజుల క్రితం వరకు 11 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయడంతో పాటు.. వారం రోజులుగా జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ వెంకట్రావ్, ఎస్పీ రెమా రాజేశ్వరి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. అనవసరంగా రోడ్ల పైకి వచ్చే జనాన్ని కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో పాటు పోలీసులు వాహనాలను సైతం సీజ్‌ చేస్తున్నారు.  

జిల్లాకేంద్రంలో అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మరో రెండు వారాల పాటు అత్యవసరమైతే తప్పా.. జనం ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో వార్డుకో ఎఎస్‌ఐ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించారు. మహబూబ్‌నగర్‌ డీఎస్పీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షణ చేస్తున్నారు. దీనికి తోడు హాట్‌స్పాట్‌ ఏరియాల్లో ఎక్కడిక్కడ రోడ్లకు అడ్డుకట్ట వేశారు. ఉదయం 6గంటల నుంచి 10గంటల మధ్యలో నిత్యావసర సరుకుల కోసం కొన్ని రహదారుల్లో అనుమతి ఇచ్చి.. ఆ తర్వాత మూసి వేస్తున్నారు. నిరంతర నిఘా ఉంచుతూ డ్రోన్‌ కెమెరాల పర్యవేక్షణతో పాటుగా 96 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జనం బయటికి రాకుండా 81 బారికేడ్లు, 22 పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. జిల్లాలో నాలుగు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌లోని పాత రైతుబజార్, టీడీగుట్ట, మెట్టుగడ్డ, న్యూటౌన్‌ ప్రాంతాల్లో ప్రజల అనవసర కదలికలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో మరింత కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక కార్యచరణ ఏర్పాటు చేశారు.  

కమ్యూనిటీ వాచింగ్‌ పద్ధతి..  
ఆయా పోలీస్‌స్టేషన్‌ పరి ధిలోని స్థానిక అధికారులు, గ్రామ పోలీసు అధికారులు గ్రామ గ్రామాన ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, ప్రజల కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్‌లు, వీఆర్‌ఓలు, అంగన్‌వాడీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో ఉమ్మడిగా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటున్నారు. అలాగే వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకుని కరోనాపై అవగాహన, నివారణ, జాగ్రత్తలు వంటి అంశాలను ప్రచారం చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

సిటిజన్‌ ట్రాకింగ్‌..
ఎస్పీ రెమా రాజేశ్వరి, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు నిత్యం సూచనలు, సలహాలు ఇస్తూ.. పోలీస్‌ సిబ్బందికి షిప్టుల వారీగా బాధ్యతలు అప్పగించారు. సరిహద్దు ప్రాంతంలో పోలీస్‌లను భారీగా మోహరింపజేసి పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. గృహ నిర్బంధంలో ఉన్న వ్యక్తుల వివరాలను, కదలికలను జియో ట్యాగింగ్‌ ద్వారా గుర్తిస్తున్నారు. సిటిజన్‌ ట్రాకింగ్‌ ద్వారా జనం అనవసరపు కదలికలను నియంత్రిస్తున్నారు. ముఖ్యంగా క్లస్టర్లుగా గుర్తించిన ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాల ద్వారా వీక్షించి.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు