అదే అలజడి..

6 Apr, 2020 12:32 IST|Sakshi
కలెక్టరేట్‌లో ఆశా కార్యకర్తలకు కరోనా నివారణ కరపత్రాలను అందజేస్తున్న కలెక్టర్‌ వెంకట్‌రావు

ఢిల్లీ బాధితులతో మరింత అప్రమత్తం

ఉల్లంఘనులపై పోలీసుల నజర్‌

తాజాగా 22 మందికి నెగిటివ్‌  

మరో 64 మంది ఫలితాలు రాలే..

కొత్తగా సేకరించని శాంపిళ్లు

2,951మందికి హోం క్వారంటైన్‌ పూర్తి

 ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు లేకపోయినా శాంపిల్‌ తీసి పంపితే పాజిటివ్‌ అని తేలింది. దీంతో అధికారులతో పాటు వైద్యులు కంగుతిన్నారు. ఈ వైరస్‌ ఎవరికీ అంతుచిక్కకుండా కొత్త రూపాల్లో కనిపిస్తోంది. ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడం కొంత కష్టతరంగా మారింది. ఇలా కొందరు వ్యక్తులకు ఎలాంటి లక్షణాలు లేకపోయినా పాజిటివ్‌ వచ్చే అవకాశం ఉండటాన్ని క్యారియల్స్‌ అంటారు. ఇలాంటి వారు తరచూ శరీర ఉష్ణోగ్రతలు చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

మహబూబ్‌నగర్‌ క్రైం: హైదరాబాద్‌లో కరోనా పరీక్షలు చేసే ల్యాబ్‌లన్నీ నిండిపోవడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి తాజాగా ఎలాంటి శాంపిళ్లు పంపలేదు. ఆయా జిల్లాల నుంచి భారీ స్థాయిలో నిత్యం శాంపిళ్లు రావడంతో ఆయా ల్యాబ్‌లలో పెండింగ్‌లో పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారుల ఆదేశించడంతో తాజాగా అధికారులు అనుమానితుల నుంచి కొత్తగా ఎలాంటి శాంపిళ్లు తీసుకోలేదు. ఇటీవల మహబూబ్‌నగర్‌ నుంచి పంపిన వాటిలో ఆదివారం సాయంత్రం 22మంది ఫలితాలు నెగిటివ్‌గా వచ్చాయి. ఇంతవరకు 161మంది శాంపిళ్లు పంపగా ఐదుగురికి పాజిటివ్‌ రాగా 92మందికి నెగిటివ్‌ వచ్చింది. ఇంకా 64మంది ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటికే ఢిల్లీ నుంచి వచ్చిన 39మందిలో ఇద్దరికి, అలాగే వారి కుటుంబ సభ్యుల్లో మరో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. వీరందరినీ మెడికల్‌ కళాశాల క్వారంటైన్‌లో ఉంచారు. ప్రస్తుతం పాలమూరు మెడికల్‌ కళాశాలలో 101, ఎస్‌వీఎస్‌ ఐసోలేషన్‌ వార్డులో 14, జనరల్‌ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో 30మంది అనుమానితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఏడు పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. దీంట్లో ఐదు మహబూబ్‌నగర్‌ పట్టణంలో, మరో రెండు జడ్చర్లలో ఉన్నాయి.

హోం క్వారంటైన్‌లోనే 2,529మంది
మహబూబ్‌నగర్‌ జిల్లాకు ఇతర దేశాల నుంచి వచ్చిన 327మంది ఆదివారం నాటికి అందరూ హోం క్వారంటైన్‌ పూర్తి చేసుకున్నట్టు అధికారులు ప్రకటించారు. దీంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 5,153మందిలో ఆదివారం నాటికి 2,624మంది హోం క్వారంటైన్‌ పూర్తి చేసుకోగా ఇంకా 2,529మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాల్లో అధికారులు ప్రతిరోజూ ఇంటింటి సర్వే చేయిస్తున్నారు. జిల్లా కేంద్రంలో 15ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి సర్వే చేస్తున్నారు. ఇలా వారు 14రోజుల పాటు ప్రతిరోజూ సర్వే చేయనున్నారు. ఈ సర్వేలో ఎవరైనా అనుమానితులు ఉంటే గుర్తించి వారిని ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు.

మరింత అప్రమత్తత
ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిలో మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన 12మందికి పాజిటివ్‌ రావడంతో వారి కుటుంబ సభ్యులు సహా ఇతరులపై అధికారులు నిఘా పెంచుతున్నారు. వారిని గుర్తించి క్వారంటైన్, ఐసోలేషన్‌ కేంద్రాలకు పంపించడంతో పాటు నమూనాలను హైదరాబాద్‌కు పంపించారు. ఇంకా కేసులు పెరుగుతాయని, మరింత అప్రమత్తత అవసరమని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ మహమ్మారి క్రమంగా పెరుగుతున్న తరుణంలో పోలీసులు సడలింపు సమయంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఉదయం వేళ పట్టణాల్లో సాధారణ రోజుల మాదిరిగా జనాలు తిరుగుతున్న తీరును గమనిస్తూ కేసుల నమోదుతో పాటు కొన్ని వాహనాల్ని సీజ్‌ చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిని ఆయా సందర్భాల్లో కలిశారని అనుమానం ఉన్న వారి నమూనాలను పంపించారు. ఇంకా మరికొందరివి తీసి పంపాల్సి ఉన్నట్టు తెలిసింది. జిల్లాలో కరోనా ప్రభావం కనిపించినప్పటి నుంచి ఇంతవరకు క్వారంటైన్‌ కేంద్రాలకు, ఐసోలేషన్‌ వార్డులకు అనుమానితులు భారీగా చేరుతున్నారు.

ఐక్యతా దీపం
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా జాతి ఐక్యతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఆదివారం రాత్రి తొమ్మిది నుంచి తొమ్మిది నిమిషాల పాటు ఇళ్లలో లైట్లు నిలిపివేసి దీపాలు వెలిగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు జిల్లావాసులు భారీగా స్పందించారు. ఈ సమయంలో కొవ్వొత్తులు, దీపాలు, టార్చ్, మొబైల్‌ ఫ్లాష్‌లైట్‌ ఆన్‌చేసి జాతి ఐక్యతను చాటారు. చాలా మంది మహిళలు ఇళ్లలో, ఆరుబయట ప్రహరీలపై దీపాలు వెలిగించారు. ఎస్పీ రెమా రాజేశ్వరి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో ఈ దీపాలు వెలిగించారు.

ఆందోళనలో ప్రజలు
మహబూబ్‌నగర్‌ జిల్లాలో పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లోనూ రహదారులపై స్వేచ్ఛగా తిరిగిన ప్రజలు రెండు రోజుల నుంచి పాజిటివ్‌ కేసులు నమోదు పెరుగుతుండటంతో ఇళ్లకే పరిమితమవుతున్నారు. ముఖ్యంగా రెడ్‌జోన్ల పరిధిలో ఉన్నవారు ఎవరూ బయటకు రాకుండా బయటి వారు లోపలికి వెళ్లకుండా పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నా అక్కడున్న స్థానికులు కొందరు బయట తిరుగుతున్నారు. పోలీసులు వచ్చినప్పుడు ఇళ్లకే పరిమితమై.. తిరిగి వీధుల్లో క్రికెట్‌ ఆడటం, బయట తిరగడం చేస్తుండటంతో ఆయా ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నారాయణపేట జిల్లాలో ఇంతవరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు. విదేశాల నుంచి 38మంది రాగా 28మంది 14రోజుల హోం క్వారంటైన్‌ పూర్తి చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి 4,929మంది రాగా 961మంది హోం క్వారంటైన్‌ పూర్తి చేసుకున్నారు. జిల్లా ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఒకరు చికిత్స పొందుతున్నారు.  

దీపాలు వెలిగించి ఐక్యతను చాటిన ప్రజలు
స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: జిల్లా దీప కాంతులతో మెరిసింది. కరోనా మహమ్మారి పారదోలేకుందుకు అందరూ పోరాటం చేయాలని, అందుకోసం ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు ప్రతి ఒక్కరూ ఇంట్లోని లైట్లు ఆపివేసి ఇంటి ఆవరణలో, బాల్కానీ, మిద్దెలపై దీపాలు వెలగించి ఐక్యతను చాటాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు ప్రజల్లో విశేషమైన స్పందన వచ్చింది.  

కరోనా నివారణకు చర్యలు
జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలన్నారు. కరోనా పాజిటివ్‌ కేసులను గుర్తించిన ప్రాంతాల్లో వైరస్‌ మరొకరికి వ్యాపించకుండా ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకుండా చూడాలన్నారు. ముఖ్యంగా ఆయా ప్రాంతాల వారికి అవసరమైన మందులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసే ఏర్పాట్లు చేయాలని సూచించారు. రెండుసార్లు రసాయనాలు స్ప్రే చేయించాలన్నారు. వైద్యబృందాలు ఇల్లిల్లూ తిరిగి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించాలన్నారు. మర్కజ్‌కి వెళ్లి వచ్చిన పాజిటివ్‌ కేసులను గాంధీ ఆసుపత్రికి, నెగెటివ్‌ వచ్చిన వారిని ప్రభుత్వ క్వారంటైన్‌లలో ఉంచాలన్నారు. ఆయా ప్రాంతాలను జియో ట్యాంగింగ్‌ చేయాలని సూచించారు. మరో వారం పాటు ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. కలెక్టర్‌ వెంకట్‌రావు బదులిస్తూ.. జిల్లాలో ఇప్పటి వరకు క్వారంటైన్‌తో పాటు ఐసోలేషన్‌ వార్డులకు సంబంధించి ఎలాంటి సమస్య లేదని, అనుమతిస్తే క్వారంటైన్‌ పూర్తయిన వారిని ఇళ్లకు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మోహన్‌లాల్, డీఎంహెచ్‌ఓ డా. కృష్ణ, డీఆర్‌ఓ స్వర్ణలత, డా. శశికాంత్, ఆర్‌డీఓ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు