పొత్తు కలిసివచ్చేనా

22 Nov, 2018 16:30 IST|Sakshi

2014 ఎన్నికల్లో భారీగా పడిపోయిన టీడీపీ గ్రాఫ్‌ 

అప్పట్లో బీజేపీతో పొత్తు ఉన్నా అభ్యర్థులకు కలిసిరాని ఓట్లు 

ఇప్పుడు కాంగ్రెస్‌కు టీడీపీ పొత్తు కలిసి వస్తుందా అని సంశయం

 సాక్షి, మోర్తాడ్‌(బాల్కొండ): మహాకూటమి పొత్తులో భాగంగా ఉమ్మడి నియోజకవర్గంలోని తొమ్మిది నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు పోటీలో నిలవగా వీరికి టీడీపీతో పొత్తు కలిసి వచ్చేనా అనే సందేహం వ్యక్తం అవుతోంది. తెలుగుదేశం పార్టీ గ్రాఫ్‌ భారీగా పడిపోవడాన్ని పరిశీలిస్తే కాంగ్రెస్‌ పార్టీకి టీడీపీతో పొత్తు ఎంత మేరకు ప్రయోజనం కలిగిస్తుందో వెల్లడికావడం లేదని రాజకీయ పరిశీలకు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కావడం, అప్పట్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోవడంతో టీడీపీ బలహీనపడిందనే వాదన వినిపిస్తుంది. అంతేకాక గడిచిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు మూడో స్థానంలో నిలవడంతో ఆ పార్టీ గ్రాఫ్‌ దిగజారిపోయిందని స్పష్టమవుతోంది.

టీడీపీ గ్రాఫ్‌ దిగజారి పోవడంతో ఆ పార్టీతో కాంగ్రెస్‌కు కలిసి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో టీడీపీకి ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఎంతో బాగుండగా 2009 తరువాత మాత్రం ఎదురుగాలి వీయడంతో పార్టీ పతనం ఆరంభమైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని బాల్కొండ, ఆర్మూర్, జుక్కల్, బోధన్, బాన్సువాడ నియోజకవర్గాలను టీడీపీకి కేటాయించారు.

మిగిలిన నిజామాబాద్‌ అర్బన్, నిజామాబాద్‌ రూరల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేశారు. టీడీపీ, బీజేపీ పొత్తులను పరిశీలిస్తే బీజేపీ అభ్యర్థులు పోటీ చేసిన చోట కొంత మెరుగైన ఓటింగ్‌ లభించగా, టీడీపీ పోటీ చేసిన చోట తెలంగాణ సెంటిమెంట్‌ ప్రభావం చూపింది. దీంతో టీడీపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల శాతం పడిపోయింది.

 టీడీపీ పోటీ చేసిన చోట ఫలితాలు ఇలా..

టీడీపీ అభ్యర్థులు పోటీ చేసిన అన్ని నియోజకవర్గాలలో మూడో స్థానంకే పార్టీ పరిమితమైంది. బాల్కొండలో టీడీపీకి 17.69 శాతం ఓట్లు లభించాయి. టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ ఆర్మూర్‌ నియోజకవర్గంలో ఉండగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాజారాం యాదవ్‌కు 5.06 శాతం ఓట్లు లభించడం గమనార్హం. బోధన్‌లో 17.05 శాతం, బాన్సువాడలో 14.35 శాతం, జుక్కల్‌లో 5.29 శాతం ఓట్లు లభించాయి. ఈ నియోజకవర్గాలలో బీజేపీ టీడీపీకి మద్దతు ఇచ్చింది. అయితే టీడీపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని తెలంగాణ వాదులు ప్రచారం చేయడంతో టీడీపీకి ఎంతో పట్టు ఈ నియోజకవర్గాల్లో పెద్దదెబ్బ తగిలింది. 

 2009లో టీడీపీకి మెరుగైన ఫలితాలు

 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఫలితాలను పరిశీలిస్తే తొమ్మిది నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. బోధన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి, బాల్కొండలో పీఆర్పీ అభ్యర్థి ఈరవత్రి అనిల్, ఎల్లారెడ్డిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డిలు గెలుపొందారు. నిజామాబాద్‌ అర్బన్‌లో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ, ఆర్మూర్, బాన్సువాడ, జుక్కల్, నిజామాబాద్‌ రూరల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు అన్నపూర్ణమ్మ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హన్మంతత్‌ సింధే, మండవ వెంకటేశ్వర్‌రావు, గంప గోవర్ధన్‌లు గెలుపొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ టీడీపీకి మెరుగైన ఫలితాలు రావడం గమనార్హం.

2004లో తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ

 2004 సాధారణ ఎన్నికల్లో మాత్రం ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలలో టీడీపీ నామరూపాలు లేకుండా పోయింది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పొత్తు వల్ల టీడీపీ అభ్యర్థులు ఘోరపరాజయం పాలయ్యారు. తొమ్మిది నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించగా, మూడు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ ఓట్ల గ్రాఫ్‌ ఈ ఎన్నికల్లో భారీగా పతనమైంది.

కాంగ్రెస్‌కు టీడీపీ పొత్తు లాభించడంపై సందేహాలు 

గతంలోని ఫలితాలను పరిశీలిస్తే పడిపోయిన టీడీపీ ఓట్ల గ్రాఫ్‌ను విశ్లేసిస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు టీడీపీ పొత్తు లాభించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీకి మరో పార్టీ పొత్తువల్ల ప్రయోజనం కలిగింది తప్ప మరో పార్టీకి టీడీపీ పొత్తు మాత్రం అనుకూలించలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్‌కు టీడీపీతో పొత్తు కలిసి వస్తుందని అనేక సందేహాలు వ్యక్తమవుతుండగా పోలింగ్‌లో కాంగ్రెస్‌కు టీడీపీ సహకారం ఎలా ఉంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

బీజేపీకి అనుకూలించని టీడీపీ పొత్తు

టీడీపీ, బీజేపీల పొత్తులో భాగంగా నాలుగు నియోజకవర్గాలలో పోటీకి బీజేపీకి అవకాశం లభించింది. అయితే టీడీపీ క్యాడర్‌ బీజేపీకి సపోర్టు చేయకపోవడంతో తమ పార్టీ అభ్యర్థులు మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని అప్పట్లో బీజేపీ నాయకులు వ్యాఖ్యానించారు. బీజేపీకి వచ్చిన ఓట్లు కేవలం తమ కార్యకర్తల కృషి వల్లనే అని కూడా నాయకులు వివరించారు. బీజేపీ అభ్యర్థి కామారెడ్డిలో పోటీ చేయగా ఈ నియోజకవర్గంలో 8.82 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.

నిజామాబాద్‌ అర్బన్‌లో 20.91 శాతం, రూరల్‌ నియోజకవర్గంలో 25.23 శాతం, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 21.11 శాతం ఓట్లు బీజేపీకి లభించాయి. టీడీపీ అభ్యర్థులు పోటీ చేసిన స్థానాలను, బీజేపీ అభ్యర్థులు పోటీ చేసిన స్థానాలను పరిశీలిస్తే బీజేపీ పోటీ చేసిన చోటనే ఓట్ల శాతం పెరిగిందని స్పష్టమవుతోంది. ఈ ఎన్నికల్లో ఫలితాలను విశ్లేసిస్తే టీడీపీతో పొత్తు బీజేపీకి లాభించలేదని వెల్లడైతుంది. 

మరిన్ని వార్తలు