జనం లేని జాతర

13 Jul, 2020 06:37 IST|Sakshi

చరిత్రలో మొట్ట మొదటి సారి

నిర్మానుష్యంగా సికింద్రాబాద్‌ ప్రాంతాలు

భక్తులు లేకుండా  మహంకాళి బోనాల ఉత్సవాలు

రాంగోపాల్‌పేట్‌: ఎటు చూసినా భక్త జన సందోహం, అమ్మవారికి బోనం సమర్పించేందుకు బారులు తీరే భక్త జనం, ఫలహార బండ్ల ఊరేగింపులు, తొట్టెల సమర్పణలకు వచ్చే యువత తీన్మార్‌ స్టెప్పులు...శివసత్తుల పూనకాలు....అమ్మవారికి మొక్కులు తీర్చుకోవాలని ఆశతో ఎంతో దూరం నుంచి వచ్చే భక్తులు.. ఇదీ ఏటా సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర సందర్భంగా కనిపించే కమనీయ దృశ్యం...ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు, ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించే  ప్రజాప్రతినిధులు...అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే వీవీఐపీలు, వీఐపీలతో కొనసాగే సందడి. అయితే ఈ ఏడాది ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి  అమ్మవారిని దర్శించుకోవాలని, బోనం సమర్పించి మొక్కులు తీర్చుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్న భక్తులకు నిరాశే మిగిల్చింది. అమ్మవారి జాతర  ప్రారంభమైనప్పటి నుంచి చరిత్రలో మొదటి సారిగా భక్తులు లేకుండానే బోనాల జాతర మొదలైంది. లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ జన జాతర ఈ ఏడాది జనం లేని జాతరగా చరిత్రలో నిలిచిపోనుంది. లష్కర్‌ బోనాల సందర్భంగా ఉజ్జయినీ మహంకాళి దేవాలయం చుట్టు ఎక్కడ భక్తుల జాడ కనిపించ లేదు. ఎటు చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. అయితే అధికారులు అమ్మవారికి భక్తుల బోనం లేకున్నా సంప్రదాయాల్లో ఎలాంటి లోటు లేకుండా, శాస్త్రోక్తంగా బోనాల ఉత్సవాలను నిర్వహించారు.

సంప్రదాయబద్ధంగా పూజలు... మంత్రి ఇంటి నుంచి తొలి బోనం
కోవిడ్‌ నిబంధనల మధ్య సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతర సంప్రదాయాలతో వైభవంగా జరిగింది. ఆదివారం ఉదయం 4.05 నిమిషాలకు మహాహారతితో మహంకాళి అమ్మవారికి పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంత్రి తలసాని కుటుంబ సభ్యులు బోనాన్ని దేవాలయం బయటి వరకు తెచ్చి ఆలయ ఈవో మనోహర్‌రెడ్డికి అప్పగించారు.  మహాహారతి అనంతరం ఆలయ అధికారులు అమ్మవారికి బోనం సమర్పించారు. ఆలయ ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే ఆలయ సిబ్బంది అమ్మవారికి 7 బోనాలను సమర్పించారు. ఉదయం 4.45 నిమిషాలకు వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 8గంటలకు ఆర్యసమాజ్, దక్కన్‌ మానవ సేవా సమితి ఆధ్వర్యంలో లోక కల్యాణం కోసం హోమం చేశారు.  

కనిపించని భక్త జనం  
కరోనా నేపథ్యంలో  ప్రభుత్వం ఈ ఏడాది బోనాల జాతరలో భక్తులకు అనుమతి ఇవ్వలేదు. అమ్మవారికి జరిగే పూజలన్నీ మాత్రం యధావిధిగా ఆలయ అధికారులు నిర్వహించారు. ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులు రాకుండా చూశారు. ఈ విషయం తెలియని కొందరు భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు, బోనాలు సమర్పించేందుకు వచ్చి నిరాశగా వెనుదిరిగారు.  

అమ్మవారే కరోనాను తరిమి కొట్టాలి:  మంత్రి తలసాని
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధిని మహంకాళి అమ్మవారే తరిమికొట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ఆదివారం మహంకాళి బోనాల జాతర సందర్భంగా ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలరా వ్యాధిని తరిమికొట్టడంతో 1815లో అప్పయ్యదొర మధ్యప్రదేశ్‌ లోని ఉజ్జయినీ నుంచి అమ్మవారిని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్టించారన్నారు. నాడు కలరా వ్యాధిని తరిమికొట్టిన అమ్మవారే నేడు కరోనాను కూడా దేశం నుంచి పారదోలాలని ప్రార్థించారు. అయితే ఈ ఏడాది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాతరకు భక్తులను అనుమతించడం లేదని ఇందుకు వారు క్షమించాలని కోరారు. ప్రభుత్వ సూచనలను భక్తులు, స్థానిక ప్రజలు పాటిస్తూ ఇంట్లోనే బోనాల ఉత్సవాలు జరుపుకున్నారని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  

నేడు 9.30 గంటలకు రంగం
 ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరలో మరో ప్రధాన ఘట్టం రంగం. అవివాహిత మహిళ అమ్మవారికి ఎదురుగా ఉండే మాతంగేశ్వరీ అమ్మవారి ముందు పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి వినిపిస్తారు. అమ్మవారు ఆమెను ఆవహించగా ఆమె నోటి నుంచి వచ్చే ప్రతి మాట అమ్మవారే పలుకుతున్నట్లుగా భక్తుల నమ్మకం. సోమవారం ఉదయం 9.30 గంటలకు భవిష్యవాణి ఉంటుంది. ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తుండటం,  భక్తుల బోనాలు లేకుండానే జాతర జరుగడంతో అమ్మవారి నుంచి ఎలాంటి వాక్కులు వినవలసి వస్తుందోనని భక్తులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అనంతరం అమ్మవారి సాగనంపే నిర్వహిస్తారు. దీంతో బోనాల జాతర ముగుస్తుంది.  

దూరం నుంచి దండం
అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ రాంగోపాల్‌పేట్‌ పాత పోలీస్‌ స్టేషన్‌ వద్దకు రాగానే పోలీసులు కోవిడ్‌ నిబంధనల నేపథ్యంలో భక్తులను అనుమతించడం లేదని చెప్పడంతో ఆయన అక్కడి నుంచే అమ్మవారికి దండం పెట్టుకుని వెనుదిరిగి వెళ్లారు. 

మరిన్ని వార్తలు