యాదగిరీశుడికి మహాప్రాకార మండపం

9 May, 2018 00:52 IST|Sakshi
యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం

36 అడుగుల ఎత్తు, 25 వేల చదరపు అడుగుల వైశాల్యం

రేపు ఉదయం మొదలై రాత్రికి పూర్తవనున్న కప్పు నిర్మాణం

12 ఆళ్వార్ల స్తంభాలతో ప్రత్యేకాకర్షణగా మండపం

సాక్షి, హైదరాబాద్‌: యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణం తాలూకు ప్రత్యేకతల పరంపరకు మరో ఆకర్షణ తోడవనుంది. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో కీలకమైన ప్రధాన ప్రాకార మండపం కొత్త రికార్డు నెలకొల్పనుంది. ఇటీవలి కాలంలో ఏ కొత్త నిర్మాణంలోనూ లేని తరహాలో ఈ మండపం ఏకంగా 36 అడుగుల ఎత్తుతో నిర్మితమవుతోంది. దీని పైకప్పును గురువారం నిర్మించనున్నారు. ఉదయం నుంచి రాత్రి కల్లా కాంక్రీట్‌తో ఈ నిర్మాణం జరగనుంది. అంతెత్తుతో ఉండే ప్రాకార మండపం వైశాల్యం కూడా 25 వేల చదరపు అడుగుల్లో భారీగా ఉండనుంది.

భక్తులు భారీగా పోటెత్తినా ఇబ్బంది లేని రీతిలో నిర్మాణం ఉంటుంది. పెద్ద పెద్ద పురాతన మందిరాల్లో ప్రాకార మండపం రాతితో చాలా ఎత్తుతో కనిపిస్తుంటుంది. వీటి స్తంభాల తాలూకు శిల్ప శోభ కూడా ఆకట్టుకుంటుంది. కొత్త దేవాలయాల్లో కాంక్రీట్‌తో నిర్మిస్తున్న ప్రాకార మండపాలు మామూలు ఎత్తులోనే ఉంటున్నాయి. యాదాద్రిలో గత మండపం కూడా సాధారణంగానే ఉంది. ఇప్పుడు మొత్తం దేవాలయ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నందున మండపాన్ని పురాతన పెద్ద దేవాలయాల తరహాలో భారీగా నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం 36 అడుగుల ఎత్తుండే సెంట్రింగ్‌ రాడ్లు దొరక్కపోవడంతో వాటిని ప్రత్యేకంగా తయారు చేయటం విశేషం! 

స్తంభాలూ ప్రత్యేకమే 
విశాలంగా ఉండే మండపంలో స్తంభాలు కూడా అంతే ప్రత్యేకంగా సిద్ధమయ్యాయి. 12 మంది ఆళ్వార్ల రూపంలో వీటిని సిద్ధం చేశారు. వీటి ఎత్తు 12 అడుగులుంటుంది. వీటిపై కాకతీయ స్తంభాలు ఏర్పాటు చేశారు. వీటికి ప్రత్యేకంగా ఆధార పీఠాలూ రూపొందించారు. పురాతన దేవాలయాల్లో కప్పు కూడా రాతితో నిర్మించడం ఆనవాయితీ ఇక్కడ మాత్రం కాంక్రీట్‌తోనే నిర్మిస్తున్నారు. చుట్టు గోడలు మాత్రం రాతితో నిర్మిస్తారు. ఆలయానికి నాలుగు వైపులా నిర్మించే మాడ వీధులు దీనికి అనుసంధానమై ఉంటాయి.

ప్రధాన మూల విరాట్టు కొలువుదీరే గర్భాలయ నిర్మాణం దాదాపు పూర్తయింది. దాని కప్పు గతంలోనే నిర్మించారు. దానిపై గోపుర నిర్మాణానికి ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దసరా నాటికి మిగతా పనులు కూడా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దసరా తర్వాత బాలాలయంలోని ఉత్సవ మూర్తులను ప్రధానాలయంలో ప్రతిష్టించనున్నారు. 

మరిన్ని వార్తలు