‘కాళేశ్వరం’ సర్జ్‌పూల్‌లో కొనసాగుతున్న పరిశీలన 

20 Apr, 2019 03:05 IST|Sakshi

ప్రాజెక్టును సందర్శించిన మహారాష్ట్ర ఇంజనీర్ల బృందం  

సాక్షి, హైదరాబాద్‌ : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కొనసాగుతున్న ట్రయల్‌రన్‌ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఎల్లంపల్లి రిజర్వాయర్‌ నుంచి ప్యాకేజీ–6 కాల్వలకు నీటిని విడుదల చేసిన ఇంజనీర్లు, టన్నెళ్ల ద్వారా వస్తున్న నీటితో నందిమేడారం పంప్‌హౌజ్‌లోని సర్జ్‌పూల్‌ను నింపుతున్నారు. 138 మీటర్ల లోతైన సర్జ్‌పూల్‌ను క్రమంగా నీటితో నింపుతూ లీకేజీలను గమనిస్తున్నారు. ఇప్పటివరకు సర్జ్‌పూల్‌ లెవల్‌ని 16 మీటర్ల వరకు నింపినట్లు ప్రాజెక్టు అధికారులు ప్రకటించారు. ప్రతి గంటకు 0.6 మీటర్ల మేర నీరు సర్జ్‌పూల్‌లో నిండుతోందని తెలిపారు. ఇప్పటివరకు ఎలాం టి నీటి లీకేజీలు లేవని స్పష్టంచేశారు. 138 మీటర్ల లెవల్‌కు నీటి మట్టాలు చేరిన వెంటనే పంప్‌హౌజ్‌లోని మోటార్లను రన్‌ చేయనున్నారు. ఈ మోటార్ల ద్వారా వెట్‌ రన్‌ నిర్వహించనున్నారు. ఈ నెల 24న వెట్‌రన్‌ను నిర్వహించే అవకాశాలున్నట్లు ప్రాజెక్టు అధికారులు ప్రకటించారు. సర్జ్‌పూల్‌ నింపే ప్రక్రియను ప్రభుత్వ ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్‌లు పర్యవేక్షిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను శుక్రవారం మహారాష్ట్ర నీటి పారదుల శాఖ ఇంజనీర్ల బృందం పరిశీలించింది.

మరిన్ని వార్తలు