గణేష్‌ చందా ముసుగులో మహారాష్ట్ర దొంగలు

28 Aug, 2019 20:01 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : గణేష్‌ చందాల పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ చందా ఇవ్వని వారింట్లో దొంగతనానికి ప్రయత్నించిన సంఘటన నగరంలో సంచలనం రేపింది. సాయికృప నగర్‌ కాలనీలో ఉన్న మొదటి అంతస్థులోని ఓ ఇంట్లో ఇద్దరు వ్యక్తులు వినాయక చవితి పండుగ నిమిత్తం చందా అడగడానికి వెళ్లారు. ఇంటి ఇల్లాలు చందా డబ్బులు ఇవ్వననడంతో మంచి నీళ్లు కావాలని అడిగి చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. దీంతో భయపడ్డ ఇల్లాలు అరుస్తూ ఇంట్లోకి పరుగు తీసింది. అప్రమత్తమైన ఇల్లాలి భర్త వెంటనే గేటు తాళం వేసి వారిని ప్రశ్నించగా, వారిలో ఒకరు భర్తను తోసేసి గేటు దూకి పారిపోయాడు. మిగిలిన మరొకరిని పట్టుకొని స్థానికులు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారమందించగా వారు విచారించి నిందితులు మహారాష్ట్రకి చెందినవారుగా గుర్తించారు. పారిపోయిన మరో నిందితుడి కోసం పోలీసులు నగరమంతా గాలింపు చర్యలు చేపడుతున్నారు. తోపులాటలో భర్తకు స్పల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటనతో గణేష్‌ చందాల పేరుతో వచ్చేవారి విషయంలో సాయికృప నగర్‌, వినాయక నగర్‌ కాలనీ వాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

మరిన్ని వార్తలు