మహారాష్ట్ర టు తెలంగాణ

18 Oct, 2014 23:34 IST|Sakshi
మహారాష్ట్ర టు తెలంగాణ

మళ్లీ వలస జీవుల పల్లెబాట  రద్దీగా బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు
 
రాయికల్ (కరీంనగర్): తెలంగాణ ప్రజలకు సర్వేల ఫీవర్ పట్టుకుంది. ఏ క్షణంలో ఏ పథకానికి సర్వే జరుగుతుందోనని ఇటు అధికారులు, అటు ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. రెండు నెలల క్రితం సమగ్ర కుటుంబ సర్వే కోసం స్వగ్రామాలకు వచ్చి వెళ్లిన వలస జీవులు.. ప్రస్తుతం సంక్షేమ పథకాల దరఖాస్తుల కోసం మళ్లీ పల్లెబాట పడుతున్నారు. ఆహార భద్రత కార్డులు, సామాజిక పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సర్కారు ఆదేశాలు జారీచేసింది. దీంతో వివిధ ప్రాంతాలకు వలస వెళ్లినవారు గ్రామాలకు తిరిగివస్తున్నారు. ఇప్పుడు అందుబాటులో లేకుంటే సంక్షేమ పథకాలను కోల్పోతామనే భయంతో దరఖాస్తులు చేసుకుంటున్నారు. శుక్రవారం నుంచి ఇంటింటి విచారణ మొదలవడంతో.. దరఖాస్తుదారుల్లో ఎవరైనా ఒకరు  తప్పనిసరిగా ఉండి సంబంధిత అధికారికి సహకరించాలని ఆదేశాలు జారీ కావడంతో విచారణ పూర్తయ్యేంత వరకు గ్రామాల్లోనే ఎదురుచూస్తున్నారు.

మహారాష్ట్రలో 10 లక్షల మంది..

తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ తదితర జిల్లాలకు చెందిన నిరుపేదలు ఎక్కువగా మహారాష్ట్రలో ఉపాధి పొందుతున్నారు. ముంబయి, భీవండి, పూణే, గుజరాత్‌లోని సూర త్ తదితర ప్రాంతాల్లో కుటుంబాలతోపాటు నివసిస్తున్నారు. సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు కుటుంబంలోని ఒక సభ్యుడైనా స్వగ్రామంలో అందుబాటులో ఉండి అధికారులకు సహకరించాలని ఆదేశాలు రావడంతో వీరంతా మళ్లీ పల్లెబాట పట్టారు. రద్దీని ఆసరాగా చేసుకుని ప్రైవే టు ఏజెన్సీలు అధిక మొత్తంలో ప్రయాణ చార్జీలు వసూలు చేస్తున్నాయి. సాధారణ రోజుల్లో ముంబ యి నుంచి కరీంనగర్‌కు బస్‌చార్జి రూ.వెయ్యి ఉండగా, ప్రస్తుతం రూ.రెండు వేల దాకా గుంజుతున్నారు. రాకపోకలకు ప్రయాణ చార్జీలు, ఇతర ఖర్చులు కలుపుకొంటే ఒక్కో కుటుంబానికి రూ.ఐదు వేల దాకా అవుతోందని చెబుతున్నారు. నాలుగు రాళ్లు వెనకేసుకుందామంటే.. అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని నిరుపేదలు తలలు పట్టుకుంటున్నారు. విచారణ అధికారులు గ్రామాలకు ఎప్పుడు వస్తారో.. ఏం అడుగుతారో.. వాళ్ల కోసం ఎన్నిరోజులు చూడాలో.. స్పష్టత లేకపోవడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు.
 
జీతం బస్‌చార్జీలకే సరి


ఉపాధి నిమిత్తం మా కుటుంబ సభ్యులంతా ముంబయిలో ఉంటున్నాం. ఇటీవలే సమగ్ర సర్వే కోసం ముంబయి నుంచి స్వగ్రామానికి వచ్చాం. రెండు నెలలు గడువకముందే మళ్లీ రావడంతో మా జీతం డబ్బులంతా బస్‌చార్జీలకే సరిపోతున్నాయి.
 - గాజంగి రవీందర్, రాయికల్
 
 చార్జీల్లో దోపిడీ

 సాధారణ  రోజుల్లో ముంబయి నుంచి కరీంనగర్‌కు రావాలంటే రూ.వెయ్యి బస్‌చార్జి. కానీ ఈ సర్వేలను గమనించి ప్రైవేటు బస్సుల వారు రూ.1500 నుంచి రూ.2 వేలు వసూలు చేస్తుండ్రు. రాకపోకలు, ఇతర ఖర్చులకు కనీసం రూ.5వేలు ఖర్చవుతున్నాయి.
 -  మహేశ్, రాయికల్ ట
 

మరిన్ని వార్తలు