త్రివేణీ సంగమం.. బాపూ స్మృతివనం

2 Oct, 2019 09:04 IST|Sakshi

లంగర్‌హౌస్‌: మహాత్ముడికి మన నగరం ఎంతో గౌరవం ఇచ్చింది. ఆయన స్మృతిలో ఎందరో తరించారిక్కడ. ఈ నేపథ్యంలోనే బాపూజీ సమాధి నగరంలోని లంగర్‌హౌస్‌ త్రివేణీ సంగమం వద్ద ఏర్పాటైంది. అదే బాపూఘాట్‌గా వర్ధిల్లుతోంది. 

బాపూజీ అస్థికల నిమజ్జనం...
బాపూజీ మరణానంతరం ఆయన అస్థికలను దేశంలోని ఐదు ప్రధాన ప్రాంతాలతో పాటు ప్రపంచంలోని పలుచోట్ల  నిమజ్జనం చేశారు. దక్షిణ భారత దేశంలో కేవలం ఒకే ఒక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఆ సమయంలో హైదరాబాద్‌ రాష్ట్రం నిజాం పరిపాలనలో ఉండటంతో నగరానికి అస్థికలు తీసుకురావడానికి తర్జనభర్జన చేశారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కలుగజేసుకొని విషయాన్ని నిజాం నవాబుకు తెలపడంతో ఆయన సంతోషంగా ఆహ్వానించారు. దీంతో కె.ఎ మున్షి సమక్షంలో హరిశ్చంద్ర హేడా, కుమారి హేడాల ఆధ్వర్యంలో గాంధీజీ అస్థికలను 1948 ఫిబ్రవరి 9 వ తేదీన బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌కు తీసుకువచ్చారు. రెండు రోజులు ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచి...12 వతేదీన లంగర్‌హౌస్‌ త్రివేణీ సంగమం వద్ద అస్థికలతో కూడిన కలశాన్ని ఉంచి సమాధి నిర్మించారు. మరి కొన్ని అస్థికల్ని త్రివేణీ సంగమంలో నిమజ్జనం చేశారు.

దక్షిణ కాశి..
లంగర్‌హౌస్‌ త్రివేణీ సంగమాన్ని దక్షిణ కాశి అని కూడా అంటారు. కొడంగల్‌ గుట్టల నుంచి వచ్చే హిమగంగ, అనంతగిరి గుట్టల నుంచి వచ్చే ముచుకుంద, గుప్త గంగ మూడు నదుల కలయికతో ఈ పవిత్ర త్రివేణీ సంగమం ఏర్పడింది. రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ, వాజ్‌పేయి, ఎన్టీ రామారావు, మర్రి చెన్నారెడ్డి, ఆర్మీ అమర వీరులతో పాటు పలువురు ప్రముఖుల అస్థికల్ని కూడా ఇక్కడ నిమజ్జన ం చేశారు.

బాపూఘాట్‌ నిర్మాణం...
త్రివేణి సంగమం వద్ద బాపూ సమాధి నిర్మించినా అప్పట్లో ఆ ప్రాంతం అరణ్యంలా ఉండటంతో ప్రజలు వెళ్లేవారు కాదు. లంగర్‌హౌస్‌ చౌరస్తాలో బాపూ విగ్రహం ఏర్పాటు చేసి, పక్కనే ఉన్న లైబ్రరీలో బాపూ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణకాంత్‌ రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన సమయంలో..ఆయన చొరవతో ఇక్కడ బాపూఘాట్‌ నిర్మాణం పూర్తిచేశారు. సమాధికి దగ్గరలో బాపూ ధ్యానమందిరం నిర్మించి అందులో సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. కాగా ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చే అవకాశం ఉన్నా...నిర్లక్ష్యం వహిస్తున్నారు. బాపూఘాట్‌ను మరింత అభివృద్ధి పరిస్తే నేటి తరానికి ఎన్నో విషయాలు అవగతమయ్యే అవకాశం ఉంది.

నేడు జయంతి వేడుకలు..
మహాత్ముని 150వ జయంతి వేడుకలకు బాపూఘాట్, బాపూ సమాధి, బాపూ ధ్యాన మందిరాలు ముస్తాబయ్యాయి. నూతన గవర్నర్‌ తమిళిసై గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రముఖులు, విద్యార్థులు బాపూ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించనున్నారు.

మరిన్ని వార్తలు