ఆ వార్త తెలిసి ఆశ్రమానికి...

2 Oct, 2019 10:12 IST|Sakshi

గాంధీ జ్ఞాపకాలు ఇప్పటికీ పదిలమే

ఆయనతో పరిచయం జీవితాన్నే మార్చేసింది

‘సాక్షి’తో సేవాగ్రామ్‌ కార్యదర్శి ఎస్‌ఎస్‌ఎన్‌ మూర్తి

నగరంలో మహాత్ముడి అడుగుజాడలు

భాగ్యనగరం అదృష్టం చేసుకుంది. చీకటి భారతంలోవెలుగులు నింపిన మహాత్ముడికి ఆతిథ్యం ఇచ్చింది. ఆయన అడుగుజాడలనుపదిలంగా భద్రపరుచుకుంది. ఆ మహనీయుడి జ్ఞాపకాల గని ఇప్పటికీ ఇక్కడుంది.నేడు ఆయన 150వ జయంతి...

బాపూఘాట్‌   
మహాత్మాగాంధీ అస్థికలను దేశంలోని ఐదు ప్రాంతాల్లో నదుల్లో కలపగా... ఇందుకు దక్షిణాది నుంచి హైదరాబాద్‌ను ఎంచుకున్నారు. అయితే అప్పుడు నిజాం పాలన ఉండడంతో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నవాబుతో మాట్లాడగా ఆయన సంతోషంగా ఆహ్వానించారు. అస్థికలనుబొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో రెండు రోజులు ప్రజల సందర్శనార్థం ఉంచారు. తర్వాతలంగర్‌హౌస్‌లోని త్రివేణి
సంగమంలో కొన్ని కలిపి...మరికొన్ని అస్థికలను కలశంలో పెట్టి ఒడ్డున సమాధి నిర్మించారు.అదే బాపూఘాట్‌. 

అడుగులో.. అడుగై...
అతనో 17 ఏళ్ల కుర్రాడు. 1945 మార్చి 8న మద్రాస్‌లోని మైలాపూర్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన గాంధీజీని కలిశాడు. ‘నేను దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను. మీతోపాటే సేవాగ్రామ్‌కు వస్తాన’ని చెప్పాడు. గాంధీ ‘ఇంత చిన్న వయసులోనే ఎందుకు?’ అని ప్రశ్నించగా... దేశం కోసం అని బదులిచ్చాడు. అప్పుడు గాంధీతోనే మహారాష్ట్ర వార్దాలోని సేవాగ్రామ్‌కు వెళ్లిన ఆ కుర్రాడు... మహాత్ముడితోనే చాలాకాలం ఉన్నాడు. ఆయనే శ్రీపాద సూర్యనారాయణమూర్తి. 92 ఏళ్ల ఈ పెద్దాయన ఇచ్చిన ఇంటర్వ్యూ ‘సాక్షి’కి ప్రత్యేకం...  

‘గోల్డెన్‌’ బస
మహాత్ముడి జ్ఞాపకాలెన్నో నగరంలో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. ఆయన నగరానికి ఎప్పుడొచ్చినా సరోజినీ
నాయుడు ఇంట్లో (గోల్డెన్‌ త్రెషోల్డ్‌)నే బస చేసేవారు. ఇక్కడ ఒక మామిడి మొక్కను నాటగా... అది మహావృక్షమైంది. బాపూజీ విశ్రాంతి తీసుకున్న మంచం ఇప్పటికీ పదిలంగా ఉంది.  

ఉద్యమ ఉప్పెన  
1934 మార్చి 9... నగరంలోని కర్బలా మైదానం.. సాయంత్రం 4గంటలు... గ్రౌండ్‌ మొత్తం జనసందోహం... ఒక్కసారిగా అభిమానుల హర్షాతిరేకాలతో మైదానమంతా దద్దరిల్లింది. మహాత్ముడి రాకతో భాగ్యనగరం పుల కించింది. అస్పృశ్యతపై ఆనాడు నిర్వహిం చిన ఈ సభలో గాంధీ హరిజనోద్ధరణపై చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.

అది 1945, మార్చి 8వ తేదీ...
అప్పటికే మద్రాస్‌లోని మైలాపూర్‌ ఎంతో సందడిగా ఉంది. వేలాది మంది బాపూజీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎటు చూసినా జన సందోహమే. ‘స్వాంతంత్య్ర’ నినాదమే. ప్రతి ఒక్కరిలో జాతీయోద్యమ స్ఫూర్తి. ఎంతోమంది దేశభక్తులు గాంధీజీ కోసం ఎదురు చూస్తున్నట్లుగానే ఓ పదిహేడేళ్ల కుర్రాడు సైతం ఎదురు చూస్తున్నాడు. బాపూజీతో రెండు నిమిషాల పాటు మాట్లాడవలసిన అవసరం ఉంది. ఆ రెండు నిమిషాల కోసమే అతడు ట్రిప్లికేన్‌ మైలార్‌పల్లికి వచ్చాడు. ఆ రోజు అక్కడ హిందూ ప్రచార సభ, ఆంధ్రమహిళా సభ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు గాంధీజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒక్కసారిగా ఉద్వేగభరితమైన వాతావరణం నెలకొంది. కానీ ఆ కుర్రాడికి మాత్రం టెన్షన్‌గా ఉంది. గాంధీజీతో మాట్లాడే అవకాశం లభిస్తుందో లేదోనని. ఎలాగైతేనేం, ఆ అవకాశం లభించింది. ‘దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను. మీతో పాటే సేవాగ్రామ్‌కు వచ్చేస్తాను. నన్ను తప్పకుండా తీసుకెళ్లండి.’ అని అడిగాడు. ‘ఇంత చిన్న వయసులో ఎందుకు’ అన్నారు గాంధీజీ. దేశం కోసం పని చేయాలని ఉంది.’ అన్నాడు. అలా గాంధీతో పాటే  మహారాష్ట్ర వార్ధాలోని సేవాగ్రామ్‌కు వెళ్లిన అతడు ఆ ఆశ్రమానికి కార్యదర్శిగా, ఖాదీ ఉద్యమ ప్రచారకుడిగా, కుష్టువ్యాధిగ్రస్తుల సేవకుడిగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనే శ్రీపాద సూర్యనారాయణ మూర్తి(ఎస్‌ఎస్‌ఎన్‌ మూర్తి). బాపూజీ బాటలో నడిచారు. ప్రస్తుతం 92 ఏళ్ల వయసులోనూ బాపూజీ జ్ఞాపకాలు ఎంతో పదిలంగా ఉన్నాయని చెబుతారాయన. ఆ విశేషాలు

ఆయన మాటల్లోనే...‘సేవ’ తప్ప మరో ధ్యాస లేదు...
పశ్చిమ గోదావరి జిల్లా గుమ్మలూరు మాది. పాలకొల్లు, తణుకులలో ఉన్నత విద్యను పూర్తి చేసిన తరువాత మా కుటుంబం మద్రాస్‌కు తరలి వెళ్లడంతో ఇంటర్మీడియట్‌ అక్కడే  చదివాను. పోలీస్‌ అడ్మినిస్ట్రేటివ్‌ విభాగంలో 1946 నుంచి 1948 వరకు గ్రేడ్‌–2 అధికారిగా పని చేశాను. కానీ మొదటి నుంచి నా ధ్యాసంతా దేశ సేవపైనే ఉంది. చదువుకొనే రోజుల్లో గాంధీజీ మద్రాస్‌కు వచ్చినప్పడు ఆయనతో పాటే సేవాగ్రామ్‌కు వెళ్లాను. కానీ 2 నెలల కంటే ఎక్కువ కాలం ఉండలేకపోయాను. అప్పటికి దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆశ్రమాన్ని బెంగాల్‌కు మార్చనున్నట్లు గాం«ధీ చెప్పారు. ఇంటికి తిరిగి వెళ్లాలని చెప్పారు. దాంతో మద్రాస్‌ వచ్చేశాను. అలా రెండేళ్ల పాటు ఉద్యోగం చేశాను. కానీ ఆ రెండు నెలల్లో గాంధీజీతో చక్కటి అనుబంధం ఏర్పడింది. ఆయన బాపూ కుటీర్‌లో ఉండేవారు. ఆయనను కలిసేందుకు వచ్చేవారి వివరాలు తెలుసుకొని పంపించడం నాకు అప్పగించిన పని. అలా నెహ్రూ, పటేల్, బాబూ రాజేంద్రప్రసాద్‌ వంటి ఎంతోమంది మహానుభావులను పరిచయం చేసుకొనే అవకాశం లభించింది. పైగా గాంధీజీ కూడా పరిచయం చేసేవారు. ఆ కుటీర్‌ బాపూజీ సెక్రెటేరియట్‌. ఎలాంటి భూకంపాలనైనా తట్టుకోగలిగే సామర్ధ్యంతో కేవలం మట్టితోనే కట్టించిన ఆశ్రమం అది. అరుగుపైన చాప పరుచుకొని బాపూ కూర్చునేవారు. ఎవరు వచ్చినా ఆ అరుగుపైనే సమావేశాలు జరిగేవి. ఉదయం 4.30 గంటలకు, సాయంత్రం 6 గంటలకు బాపూతో కలిసి సర్వమత ప్రార్ధనలలో పాల్గొనడం గొప్ప అనుభూతి. రెండు పూటలా నడక, మితాహారం, చర్ఖాపైన దారం వడకడం, ఆశ్రమంలో పారిశుధ్య పనులు, క్రమశిక్షణతో  చక్కటి జీవన విధానం అలవడింది. మొత్తం 70 మందిమి ఉండేవాళ్లం ఆశ్రమంలో. అప్పటికే కస్తూర్బా గాంధీ చనిపోయారు. ఆమె నివాసం ఉన్న ఆది కుటీర్‌లో నేను ఉండేందుకు అవకాశం లభించడం నా అదృష్టం. సేవాగ్రామ్‌ను బెంగాల్‌కు మార్చనున్నట్లు చెప్పడం వల్లనే తిరిగి మద్రాస్‌కు రావలసి వచ్చింది. కానీ ప్రభుత్వ ఉద్యోగంలో ఎంతో కాలం కొనసాగలేకపోయాను. మరోసారి ఆశ్రమానికి వెళ్లాను. గాంధీజీ చెప్పినట్లు వార్ధా నుంచి బెంగాల్‌కు మారలేదు.

ఆ వార్త తెలిసి ఆశ్రమానికి...
ఆ రోజు 1948 జనవరి 30. షాకింగ్‌ న్యూస్‌. మహాత్ముడు ఇక లేరు. హత్యకు గురయ్యారు. రేడియోలో ఆ వార్త విన్నాను. బాధతో చలించిపోయాను. వెంటనే వెళ్లిపోవాలనిపించింది. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు, చివరకు ఆ ఏడాది మార్చి 30న ఉద్యోగానికి రాజీనామా చేసి, ఏప్రిల్‌ ఒకటో తేదీన వార్ధాకు చేరుకున్నాను. గాంధీజీ తరువాత ఆశ్రమ నిర్వహణ బాధ్యతలను చేపట్టిన శ్రీకృష్ణదాస్‌ జాజీ, జమన్‌లాల్‌ బజాజ్‌ల మార్గదర్శకత్వంలో సేవాగ్రామ్‌ కార్యదర్శిగా పనిచేశాను. ఖాదీ పరిశ్రమకు నిలయమైన సేవాగ్రామ్‌తో పాటు, కుష్టురోగులకు సేవలందజేసే దత్తపూర్, గ్రామీణ పరిశ్రమలకు కేంద్రమైన మగన్‌వాడీలలో పని చేశాను. కుష్టు రోగులకు సేవలందజేయడం గొప్ప అదృష్టంగా భావించాను. నా భార్య మైత్రి వినోబాభావే స్ఫూర్తితో సర్వోదయ ఉద్యమంలో క్రియాశీలమైన కార్యకర్తగా పని చేస్తే దత్తపూర్‌ అనుభవంతో బొబ్బిలి సమీపంలోని చిలకలపల్లిలో కుష్టువ్యాధిగ్రస్తుల సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి 10 గ్రామాలను దత్తతీసుకొని కుష్టు నిర్మూలన, అవగాహన కార్యక్రమాలను ఉద్యమ స్థాయిలో చేపట్టాం..’ అని ముగించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా