నూతన డీజీపీగా మహేందర్‌రెడ్డి

11 Nov, 2017 08:32 IST|Sakshi

ఆదివారం ఉదయం బాధ్యతల స్వీకరణ

సోమవారం భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర డీజీపీగా మహేందర్‌రెడ్డి నియమితులయ్యారు. అనురాగ్‌ శర్మ ఆదివారం పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో డీజీపీగా హైదరాబాద్‌ పోలీసు కమిషనర్, 1986 బ్యాచ్‌కు చెందిన ఎం.మహేందర్‌రెడ్డిని నియమిస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం శాంతి భద్రతల విభాగం అదనపు కమిషనర్‌గా ఉన్న వీవీ శ్రీనివాస్‌రావును హైదరాబాద్‌ ఇన్‌చార్జి కమిషనర్‌గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.

సోమవారం రాత్రికల్లా రాష్ట్రంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఐపీఎస్‌ అధికారుల బదిలీలు జరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు పోలీసు అకాడమీలో ప్రస్తుత డీజీపీ అనురాగ్‌ శర్మ పదవీ విరమణ పరేడ్‌ జరగనుంది. అనంతరం 11.30 గంటలకు మహేందర్‌రెడ్డి ఇన్‌చార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర పోలీసు ముఖ్య కార్యాలయ వర్గాలు స్పష్టంచేశాయి. అనురాగ్‌ శర్మను రాష్ట్ర అంతర్గత భద్రతా సలహదారుగా నియమిస్తూ సంబంధిత ఫైల్‌పై సీఎం సంతకం చేశారు. 

డీజీపీ సేవలను ప్రశంసించిన పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌
రాష్ట్ర డీజీపీ అనురాగ్‌ శర్మ ఆదివారం పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఆయన సేవలను ప్రశంసిస్తూ శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో అభినందనలు తెలిపింది. మూడున్నరేళ్ల పాటు హౌసింగ్‌ కార్పొరేషన్‌కు ఆయన తోడ్పాటు అందించారని, సలహాలు, సూచనలు చేశారని గుర్తు చేసుకుంది. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ దామోదర్‌గుప్తా, డీజీపీ అనురాగ్‌శర్మ, ఫైర్‌ సర్వీసెస్‌ డీజీ రాజీవ్‌ రతన్, హౌజింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ బి.మల్లారెడ్డి, చీఫ్‌ ఇంజనీర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు