అల్లు అరవింద్‌పై సంచలన ఆరోపణలు

5 Jan, 2018 12:27 IST|Sakshi

గీతా ఆర్ట్స్‌ ఆఫీసు నుంచే నాపై వికృతప్రచారం : కత్తి మహేశ్‌

పవన్‌ ఎయిడ్స్‌ కంటే ప్రమాదకారి.. యువతరాన్ని ఆగంపట్టిస్తున్నాడు

చట్టపరమైన పరిష్కారం కాదు.. సామాజిక చికిత్స కావాలని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌పై సినీ విమర్శకుడు మహేశ్‌ కత్తి సంచలన ఆరోపణలు చేశారు. గీతా ఆర్ట్స్‌ ఆఫీసు నుంచే తనపై వికృత ప్రచారం సాగుతున్నదని, పవన్‌ అభిమానులకు తన ఫోన్‌ నంబర్‌​ షేర్‌ అయింది కూడా అక్కడి నుంచేనని తెలిపారు. శుక్రవారం తన ఫేస్‌బుక్‌ పేజీలో వరుస పోస్టులు చేసిన మహేశ్‌.. మరోమారు పవన్‌ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తరచూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తోన్న కొందరు పీకే ఫ్యాన్స్‌ ఫొటోలను, దూషణల పర్వం స్క్రీన్‌షాట్లను సైతం పొందుపర్చారు.

గీతా ఆర్ట్స్‌ ఆఫీసు కేంద్రంగా.. : ‘‘నన్ను పందితో పోల్చుతూ ఇటీవల పుట్టుకొచ్చిన ఫేస్‌బుక్‌ పేజీల్లో అధికభాగం గీతా ఆర్ట్స్‌ ఆఫీసులోనే క్రియేట్‌ అయ్యాయని తెలిసింది. ఈ విషయంలో ఆ ఆఫీసు అధినేత అల్లు అరవింద్‌ తక్షణమే చర్యలు తీసుకొని, వికృత ప్రచారాన్ని ఆపేయాలి. తిట్టమని కోరుతూ పవన్‌ అభిమానులకు నా ఫోన్‌ నంబర్‌ షేర్‌ అయింది కూడా ఈ ఆఫీసు నుంచే! నిజానికి అల్లు అరవింద్‌తో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి విబేధాలు లేవు. వికృతపర్వాల సంగతి ఆయనకు తెలిసి ఉంటే గనుక అలాంటి శునకానందానికి దూరంగా ఉండాలని కోరుతున్నా’’ అని కత్తి మహేశ్‌ రాసుకొచ్చారు.

వాళ్లను చూస్తే జాలేస్తుంది : సోషల్‌ మీడియాలో పవన్‌ అభిమానుల నుంచి దారుణమైన తిట్లు ఎదుర్కొంటున్నానన్న మహేశ్‌.. వాటి తాలూకా ఒకటి రెండు స్క్రీన్‌ షాట్లను పొందుపర్చారు. ‘‘ఇంత నీచంగా తిడుతుంటే పీకే ఫ్యాన్స్‌పై కేసు ఎందుకు పెట్టవు? అని నా స్నేహితులు అడుగుతుంటారు. వాస్తవం ఏంటంటే.. ఆ కామెంట్లు చేసేవాళ్లలో అత్యధికులు మైనర్లే! పిల్లల మీద కేసులు పెట్టడానికి నా మనసు అంగీకరించట్లేదు. ఇన్‌ఫ్యాక్ట్‌ వాళ్లను చూస్తే జాలేస్తుంద’’ని తెలిపారు.

పీకే ఎయిడ్స్‌ కంటే ప్రమాదకారి : ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి మహేశ్‌ ఘాటువ్యాఖ్యలు చేశారు. ‘‘పీకే ఒక వైరస్‌. హెచ్‌ఐవీ కంటే ప్రమాదకారిలా యువతరాలను బలితీసుకుంటున్నాడు. ఆయనను అనుసరిస్తూ హేతుబద్ధమైన ప్రవర్తన, సామాజిక బాధ్యతలను మర్చిపోతున్నారు. ఈ రుగ్మతకు చట్టబద్ధమైన పరిష్కారం కంటే సామాజిక చికిత్స అవసరం’’ అని కత్తి మహేశ్‌ అన్నారు. కాగా, కత్తి వ్యాఖ్యలపై అల్లు కుటుంబంకానీ, గీతా ఆర్ట్స్‌ సంస్థగానీ ఇంకా ప్రతిస్పందించలేదు.
ఇవి మహేశ్‌ పోస్ట్‌ చేసిన సంభాషణలు(అసభ్యకరమైన పదజాలాన్ని బ్లర్‌ చేశాం)

మరిన్ని వార్తలు