మహేశ్వరం..ఎవరికో వరం

6 Dec, 2018 16:33 IST|Sakshi
పట్లోళ్ల సబితారెడ్డి (కాంగ్రెస్‌ అభ్యర్థి),   తీగల కృష్ణారెడ్డి (టీఆర్‌ఎస్‌ అభ్యర్థి),    అందెల శ్రీరాములు యాదవ్‌(బీజేపీ అభ్యర్థి)

నియోజకవర్గంలో త్రిముఖ పోరు 

సంక్షేమ పథకాలపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నమ్మకం 

ప్రభుత్వ వైఫల్యాలు, ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకతపై సబిత ఆశలు  

కేంద్ర సర్కారు పనితీరు, బీసీ ఓట్లపై బీజేపీ అభ్యర్థి శ్రీరాములు విశ్వాసం  

మహేశ్వరం: నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇబ్రíహీంపట్నం, మలక్‌పేట్‌ నియోజకవర్గాల నుంచి విడిపోయి 2009లో మహేశ్వరం ఏర్పడింది. కందుకూరు, సరూర్‌నగర్, బాలాపూర్, మహేశ్వరం మండలాలతోపాటు ఆర్‌కేపురం, సరూర్‌నగర్‌ డివిజన్లతో ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి విజయం సాధించారు.  వైఎస్సార్‌ కేబినెట్లో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశంలోనే తొలి మహిళా హోశాఖ మంత్రిగా చరిత్ర సృష్టించారు. 2014లో టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకొని ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ నుంచి కారు గుర్తుతో పోటీకి దిగారు. ప్రస్తుత ఎన్నికల్లో ఇక్కడి నుంచి మొత్తం 17 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ప్రధానంగా ముగ్గురి మధ్యనే తీవ్ర పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్, మహాకూటమి, బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన తీగల కృష్ణారెడ్డి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. మహాకూటమి భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ, సీపీఐ, టీజేఎస్, ఎమ్మార్పీఎస్‌ సహకారంతో కాంగ్రెస్‌ అభ్యర్థి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి ముమ్మరంగా ప్రచారం చేశారు. బీజేపీ నుంచి బరిలోకి దిగిన అందెల శ్రీరాములుయాదవ్‌ గట్టిపోటీ ఇస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఈనేపథ్యంలో నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొందని చెప్పవచ్చు.  


అభివృద్ధిని ప్రచారం చేస్తూ..  
తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి మరోమారు విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన  సంక్షేమ పథకాలు, తాను ప్రత్యేక చొరవతో చేసిన అభివృద్ధి పనులను  ప్రజలకు తెలియజేస్తూ ప్రచారం చేశారు. గొర్రెల పంపిణీ, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు, రైతుబీమా పథకాలే తన గెలుపుకు తోడ్పడుతాయని భావిస్తున్నారు. అన్ని గ్రామాలు, తండాల్లో పర్యటిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. తెలంగాణ సర్కారు పథకాలే తనను మరోమారు గెలిపిస్తాయనే ధీమాతో తీగల ఉన్నారు.    


సర్కారు వైఫల్యమే అస్త్రంగా..  
మహాకూటమి అభ్యర్థి (కాంగ్రెస్‌) సబితారెడ్డి తెలంగాణ సర్కారుపై ఉన్న వ్యతిరేకతను అస్త్రంగా చేసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలను ఆమె ఎండగడుతున్నారు. దీంతోపాటు తాజా, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిపై ఉన్న వ్యతిరేకతను, ఆయన అసమర్థతతో నియోజకవర్గం వెనుకబడిందని ఆరోపిస్తున్నారు. ఈ అంశాలను ప్రచారం చేస్తూ విరివిగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను అన్నివర్గాల ప్రజలకు తెలియజేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చి అభివృద్ధి చేస్తామని అంటున్నారు. తనను గెలిపిస్తే మహేశ్వరాన్ని మరో హైటెక్‌ సిటీగా మారుస్తానని సబితారెడ్డి ప్రచారం చేస్తున్నారు.  


బీసీ వాదంతో ముందుకు 
మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ చాపకింద నీరులా దూసుకుపోతోంది. ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో వివరిస్తున్నారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తనను గెలిపిస్తే మహేశ్వరం నియోజకవర్గ రూపురేఖలను మార్చేస్తానని ప్రజలకు వివరిస్తున్నారు. కేంద్ర సర్కారు సాయంతో అన్నివర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఐటీఐ కాలేజీలను ఏర్పాటు చేయిస్తానని హామీ ఇస్తున్నారు. బీసీవాదంతో ముందుకెళ్లి కుల సంఘాలను ఏకం చేసి వారిని ఆకర్షిస్తున్నారు. దీంతోపాటు ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్, బీజేపీ అనుబంధ సంస్థల మద్దతుతో ముందుకెళ్తున్నారు. ఇటీవల మహేశ్వరంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సరూర్‌నగర్‌లో అమిత్‌షా సభలు విజయవంతం కావడంతో కేడర్‌లో జోష్‌ నెలకొంది. మహేశ్వరం గడ్డపై కాషాయం జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉన్నారు.

ఓటర్ల సంఖ్య ఇలా..
మొత్తం: 40,23,212 
పురుషులు:     2,19,014 
స్త్రీలు:         2,04,147 
ఇతరులు:    50  

ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు : 17 మంది   

ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురు 

టీఆర్‌ఎస్‌ నుంచి తీగల కృష్ణారెడ్డి   

ప్రజాకూటమి అభ్యర్థి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి  

కమలం నుంచి అందెల శ్రీరాములు యాదవ్‌ పోటీ 
 

మరిన్ని వార్తలు