కానిస్టేబుల్‌ శిక్షణ తీసుకునేవాళ్లు రోల్‌మోడల్‌గా ఉండాలి

17 Jan, 2020 11:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పీజీ చదివిన వాళ్లు కానిస్టేబుల్‌గా రావడం వల్ల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. ఇప్పటివరకు విదేశీ పోలీసులను ఆదర్శంగా చూపించేవాళ్లం. కానీ ఇప్పుడు తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారని హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం పాతబస్తీలో కార్‌ హెడ్‌క్వార్టర్స్‌లో నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

పోలీసు పోస్టుల భర్తీ తెలంగాణలో అధికం
ఈ సమావేశంలో మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోలీస్‌ శాఖకు మరింత ప్రాధాన్యం ఇచ్చారన్నారు. పోలీస్‌ శాఖలో సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్ర పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అధికంగా పోలీస్‌ పోస్టులను భర్తీ చేస్తున్నామని మహమూద్‌ అలీ తెలిపారు. 

దేశంలోనే తెలంగాణ నంబర్‌ 1..
సీపీ అంజనీ కుమార్‌ మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో శాంతిభద్రతలు పరిరక్షించడంలో పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. 100 డయల్‌, పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌, టెక్నాలజీ పోలీస్‌ సేవలు.. ఇలా అన్ని విధాలుగా తెలంగాణ దేశంలోనే నెంబర్‌1 స్థాయిలో ఉంది. ఇక కానిస్టేబుల్‌ అభ్యర్థులకు 9 నెలల్లో స్కిల్స్‌, లా అండ్‌ ఆర్డర్‌, టెక్నాలజీ, కోర్టు ప్రోసీజర్‌, క్రైమ్‌ ఎవిడెన్స్‌, ట్రాఫిక్‌, వీఐపీ సెక్యూరిటీ అన్ని విధాలుగా శిక్షణ అందిస్తాం. కానిస్టేబుల్‌ శిక్షణ తీసుకునే వారందరూ ఓ రోల్‌ మోడల్‌గా ఉండాలి.

ప్రజలే పోలీసులు-పోలీసులే ప్రజలు.. ఈ సూత్రం అందరూ గుర్తుంచుకోవాలి. సరైన సమయంలో యువత పోలీస్‌ శాఖలో చేరుతున్నారు. ఉన్నత చదువు చదివిన వాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగానికి రావడం సంతోషకరం. ప్రతిభకు తగ్గట్లుగా వారిని పోలీస్ శాఖలో ఉపయోగించుకుంటాం. ఇక దేశంలోనే హైదరాబాద్ ఉత్తమ నగరంగా పేరు సంపాదించింది. శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. దీని ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి’ అని అంజనీ కుమార్‌ పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు