అభివృద్ధిలో తెలంగాణ నంబర్‌వన్‌

15 May, 2018 07:14 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు పక్షపాతి

డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ

పొన్నారిలో ‘రైతుబంధు’ సభ

హాజరైన మంత్రులు పోచారం, రామన్న, రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్‌ ‘గుత్తా’

సాక్షి, తలమడుగు(బోథ్‌) : అనతికాలంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌ రాష్ట్రంగా అవతరించిందని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామంలో రైతుబంధు పథకంలో భాగంగా సోమవారం చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నతో కలిసి ఆయన రైతులకు పెట్టుబడి చెక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 40 శాతం భూరికార్డులు వివాదాలతో ఉన్నాయన్నారు.

సీఎం కేసీఆర్‌ చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంతో 96శాతం వరకు ఎలాంటి వివాదాలు లేకుండా భూ సమస్యలు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. నాలుగైదు నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు సహకరించిన రెవెన్యూ యంత్రాంగంతో పాటు ఇతర శాఖల అధికారులను అభినందించారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న పాస్‌ పుస్తకాలను 17 రకాల సైక్యూరిటీతో రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇక నకిలీ పాస్‌బుక్‌లకు కాలం చెల్లినట్లే అన్నారు. రాష్ట్రంలో 58 లక్షల పాస్‌ పుస్తకాలను రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి అని అన్నారు. దేశంలో రైతు సంక్షేమానికి సుమారు రూ.50 వేల కోట్లు వరకు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు.   

వ్యవసాయాన్ని పండుగలా చేస్తాం: మంత్రి పోచారం
వ్యవసాయం అంటే పండుగలా మారుస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతు సమన్వయ సంఘాలు రైతులకు సాగులో అండగా ఉంటూ వారికి సంబంధిత అధికారుల ద్వారా సూచనలు, సలహాలు అందేలా కృషి చేయనున్నట్లు తెలిపా రు. అలాగే మార్కెట్‌లో గిట్టుబాటు ధర అందని పక్షంలో రైతు సమన్వయ సంఘాల ద్వారా పంట దిగుబడులను కొనుగోలు చేస్తామన్నారు. దేశంలో రైతులను పట్టించుకున్న నాయకుడు ఒక్క కేసీఆర్‌ మాత్రమే అన్నారు. వచ్చే జూన్‌ 2నుంచి రైతులకు బీమా పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీ రైతుకు రూ.5 లక్షల జీవిత బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. ఇందుకు గాను ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రైతుబంధు చెక్కులను పెట్టుబడి ఖర్చులకు వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. 

రైతుకు అండగా సీఎం : మంత్రి రామన్న  
పెట్టుబడి కోసం రైతుల పడే ఇక్కట్లను గుర్తించిన సీఎం కేసీఆర్‌ అన్నదాతకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగా ఎకరానికి ఏడాదికి రూ.8వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించి రైతులకు తొలివిడత చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

రైతుబంధు పథకం దేశానికే ఆదర్శం : ‘గుత్తా’
రైతుబంధు పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుం దని రైతు సమితి రాష్ట్ర చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. రైతు సమితీలు గ్రామాల్లో కీలకపాత్ర పోషించాలన్నారు. అనంతరం గ్రామంలోని రైతు లకు పట్టా పాస్‌ పుస్తకాలు, చెక్కలు పంపిణీ చేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీ గోడాం నగేశ్, మాజీ మంత్రి వేణుగోపాలచారి, వ్యవసాయ శాఖ కమిషనర్‌ జగన్‌మోహన్, పాడి పరిశ్రమ సంస్థ చైర్మన్‌ లోక భూమారెడ్డి, బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు, కలెక్టర్‌ దివ్య దేవరాజన్, ఎస్పీ విష్ణువారియర్, జిల్లా రైతు సమన్వయకర్త అడ్డి భోజారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ దామోదర్‌రెడ్డి, సహకార సంఘ చైర్మన్‌ కృష్ణారెడ్డి, ఆదిలాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మనీషా, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజన్న, తహసీల్దార్‌ రాంరెడ్డి, ఎం పీపీ మంజుల శ్రీధర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీలత, ఎంపీడీవో భూమయ్య, సర్పంచ్‌ సంగీత, ఎంపీటీసీ లక్ష్మీరమణ,  ఏడీఏ రమేశ్, వైద్యాధికారి రాజీవ్‌రాజు,మండల రైతు సమన్వయకర్తలు గోవ ర్ధన్‌రెడ్డి, కేదారేశ్వర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు