‘ఈనాడు’పై రూ.వెయ్యి కోట్ల దావా వేస్తాం

23 Feb, 2020 04:03 IST|Sakshi

పోలీసులపై నిరాధార కథనం ప్రచురించారు

వాటిపై ఆధారాలుంటే చూపాలి..

లేదంటే బేషరతుగా క్షమాపణ కోరాలి

హోంమంత్రి మహమూద్‌ అలీ స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు శాఖపై నిరాధార కథనం ప్రచురించిన ‘ఈనాడు’పత్రిక బేషరతుగా పోలీసు శాఖకు క్షమాపణ చెప్పాలని, లేదంటే రూ.వెయ్యి కోట్లకు కోర్టులో దావా వేస్తామని హోంమంత్రి మహమూద్‌ అలీ హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్ర పోలీస్‌ శాఖ అనేక సంస్కరణలతో ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని అణచివేసి దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని, అలాంటి శాఖపై నిరాధార కథనాలతో బురదజల్లడం సబబు కాదన్నారు. అధికారుల పోస్టింగులు, బదిలీలపై కథనంలో పేర్కొన్నట్లుగా ఎవరెవరు ఎంత తీసుకున్నారో రుజువు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆధారాలు లేని పక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. శనివారం లక్డీకాపూల్‌లోని తన కార్యాలయంలో మాట్లాడుతూ.. తెలంగాణ పురోగతిని జీర్ణించుకోలేని కొన్ని మీడియా సంస్థలు అక్కసు వెళ్లగక్కుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటివరకు ఓపిక పట్టామని, ఇకపై కఠినంగా ఉంటామని చెప్పారు. అసత్య ప్రచారాలు చేస్తున్న పత్రికలు, చానళ్లను ఉపేక్షించబోమని ప్రకటించారు. హుస్నాబాద్‌ ఏకే47 మిస్సింగ్‌ కేసు విచారణ జరుగుతోందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. సివిల్‌ తగాదాల్లో పోలీసులు నేరుగా తలదూర్చట్లేదని స్పష్టం చేశారు.

డిపార్ట్‌మెంట్‌ పూర్తి పారదర్శకంగా పనిచేస్తోంది: ఏడీజీ 
పోలీసుశాఖ పూర్తి పారదర్శకంగా, విధుల్లో రాజీపడకుండా 24 గంటలపాటు ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతోందని అడిషనల్‌ డీజీ (లా అండ్‌ ఆర్డర్‌) జితేంద్ర అన్నారు. శనివారం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసుశాఖలో అవినీతి అంటూ ఓ పత్రిక (సాక్షి కాదు)లో ప్రచురితమైన కథనం నిరాధారమని ఖండించారు. తమ శాఖపై ఎలాంటి అవినీతి, రాజకీయ ఒత్తిళ్లులేవని స్పష్టంచేశారు. డిపార్ట్‌మెంట్‌లో పోస్టింగులు, ట్రాన్స్‌ఫర్లు పూర్తి పారదర్శకంగా అధికారి ట్రాక్‌ రికార్డుపై ఆధారపడి జరుగుతున్నాయన్నా రు. ఆ కథనం పూర్తి నిరాధారమని, వారిపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు