మజ్లిస్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి

9 Jun, 2019 05:56 IST|Sakshi

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండో అతి పెద్దపార్టీగా మజ్లిస్‌ అవతరించిన కారణంగా ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కంటే మజ్లిస్‌ (ఎంఐఎం) సభ్యుల సంఖ్య అధికంగా ఉన్నందున ప్రతిపక్ష హోదా ఇవ్వాలని శాసనసభ స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తా మని చెప్పారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయ మైన దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష హోదాకు మొత్తం స్థానాల్లో పదిశాతం సంఖ్యాబలం అవసరంలేదని, ఢిల్లీలో మొత్తం 70 సీట్లు ఉండగా కేవలం 3 సీట్లు గల బీజేపీకి ప్రతిపక్ష హోదా కల్పించడం జరిగిందని గుర్తు చేశారు.

స్పీకర్‌ కూడా తమ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ సభ్యులు చేజారుతున్నారని కాంగ్రెస్‌ బాధ పడుతోందని, తాండూరు మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికల సందర్భంగా మజ్లిస్‌కు చెందిన నలుగురు కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకొని చైర్మన్‌ పదవి దక్కకుండా చేసింది మరచిపోయా రా అని విమర్శించారు. గత పర్యా యం ఏపీలో అప్పటి అధికార టీడీపీ వైఎస్సార్‌సీపీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలను పార్టీలో చేర్చుకున్నప్పుడు కాంగ్రెస్‌ ఎందుకు ప్రశ్నించలేదన్నారు.

జగన్‌ మంత్రి వర్గం అభినందనీయం
ఏపీ సీఎం జగన్‌ తన మంత్రి వర్గంలో అన్ని వర్గాలు, కులాలకు సముచిత స్థానం కల్పించడం అభినందనీయమని అసదుద్దీన్‌ ప్రశంసించారు. గతంలో చంద్రబాబు ఒకే కులంపై ఫోకస్‌ పెట్టి ప్రాధాన్యత ఇచ్చాడని విమర్శించారు. ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులతోపాటు మంత్రి వర్గంలో సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశం ఇవ్వడం మంచి పరిణామమన్నారు. దీంతో ప్రజలందరికి ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం ఏర్పడుతుందన్నారు. ఏపీ సీఎం తీసుకుంటున్న నిర్ణయాలను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. జగన్‌ పాలన అంటే ఏమిటో ప్రజలకు స్పష్టమవుతున్నదని, సీఎంగా ఇంకా మంచి పేరు తెచ్చుకోవడం ఖాయమని అసదుద్దీన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.  

>
మరిన్ని వార్తలు