తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు..?

6 Dec, 2017 02:25 IST|Sakshi

రాహుల్‌ గాంధీ బాధ్యతల స్వీకారం అనంతరం..

సీడబ్ల్యూసీలోకి జైపాల్‌రెడ్డి..?

టీపీసీసీకి అనుబంధంగా మరిన్ని కమిటీలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయా? తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశలో పీసీసీకి అనుబంధంగా లేదా సమాంతరంగా మరిన్ని కమిటీలు ఏర్పాటు కానున్నాయా? పార్టీ సీనియర్లు, సామాజిక సమతుల్యత వంటివాటికి ప్రాధాన్యత ఇవ్వనుందా? ఇలాంటి ప్రశ్నలకు సీనియర్‌ నేతలు అవుననే సమాధానం ఇస్తున్నారు. పార్టీలో నాయకత్వ సమస్యను పరిష్కరించడానికి పలు మార్పులూ చేర్పులను చేపట్టనున్నట్టుగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు వెల్లడించారు.

ఏఐసీసీ అధ్యక్షునిగా రాహుల్‌ గాంధీ బాధ్యతలను తీసుకున్న తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లోని సమస్యలను పరిష్కరించడానికి, పార్టీ సీనియర్లను ఏకతాటిపైకి తీసుకురావడానికి కీలకమైన చర్యలను తీసుకుంటారని చెబుతున్నారు. ఇందుకోసం పార్టీలో కొంత పేరు, పని చేయగలిగే సత్తా ఉన్న వారికి తగిన బాధ్యతలను అప్పగించాలనే ఏఐసీసీ స్థాయి లో స్థూలంగా నిర్ణయాలు జరిగాయని పార్టీ జాతీయ స్థాయిలో కీలకపాత్ర పోషిస్తున్న నేత ఒకరు వెల్లడించారు. సీడబ్ల్యూసీలోకి కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డిని తీసుకునే అవకాశం ఉందని చెప్పారు.  

పొన్నాల, సర్వేలకూ అవకాశం..
కేంద్ర మంత్రిగా పలు కీలకమైన శాఖలకు పని చేసిన జైపాల్‌రెడ్డి సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలనే యోచనలో రాహుల్‌ గాంధీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే సీనియర్లు పొన్నాల లక్ష్మయ్య, సర్వే సత్యనారాయణ వంటివారికి కూడా జాతీయ స్థాయిలోనే అవకాశం కల్పిస్తారని సమాచారం. ఇప్పటికే వి.హన్మంతరావు, మధు యాష్కీ, చిన్నారెడ్డి వంటివారికి ఏఐసీసీలో బాధ్యతలున్నాయి. వీరితోపాటు మరో ఇద్దరు, ముగ్గురికి ఏఐసీసీలో అవకాశాలు వస్తాయని తెలుస్తోంది. అలాగే రాష్ట్రస్థాయిలో మరికొందరు ముఖ్యనేతలకు అవకాశాలు కల్పించనున్నట్టుగా తెలుస్తోంది.  

కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరికి కీలక అవకాశం
కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న సినీ నటి, మాజీ ఎంపీ ఎం.విజయశాంతికి పార్టీలో తగిన వేదికను కల్పించాలనే ప్రతిపాదన ఏఐసీసీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు పార్టీలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కోమటిరెడ్డి సోదరుల్లో ఒకరికి కీలకమైన అవకాశాలను కల్పించాలనే యోచన ఏఐసీసీకి ఉన్నట్టు సమాచారం. వీరికి తగిన అవకాశాలను కల్పించే ప్రతిపాదనపై విజయశాంతి, కోమటిరెడ్డి సోదరులతోనూ ఏఐసీసీ ముఖ్యులు ప్రాథమికంగా చర్చలను పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డికి పీసీసీలో కీలక అవకాశాన్ని కల్పిస్తారని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరణ పూర్తిచేసి, ఎన్నికలకు పీసీసీని సన్నద్ధం చేసే ప్రక్రియ త్వరలోనే జరుగుతుందని ఏఐసీసీ నేతలు చెబుతున్నారు.  

కొత్తగా మరో కమిటీ..!
ఇప్పటికే టీపీసీసీ సమన్వయ కమిటీ ఉంది. దీన్ని పునర్వ్యవస్థీకరించే యోచనలో ఏఐసీసీ ఉంది. సమన్వయ కమిటీలో సత్తా లేని వారిని తొలగించి, పని చేయగలిగే శక్తి ఉన్న నేతలకు అవకాశం కల్పించనున్నారు. పీసీసీకి కీలకమైన రాజకీయ అంశాల్లో తోడ్పాటు అందించేలా, పార్టీ సీనియర్ల ప్రతిపాదనలకు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా ఒక కమిటీని ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో పీసీసీ ఎన్నికల కమిటీ ఉంటుందని, అంతకుముందు పార్టీ నేతల అభిప్రాయాలకు తగిన వేదిక ఉండాలనే యోచనలో ఏఐసీసీ ఉన్నట్టుగా తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు