మన గాలి వెరీ'గుడ్‌'

23 Apr, 2020 02:21 IST|Sakshi

స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్న జనం

తొలిసారి గ్రీన్‌జోన్‌లోకి ‘తెలుగు’ నగరాలు

ఏక్యూఐలో 25 పాయింట్లతో అమరావతి టాప్‌.. హైదరాబాద్‌–47

సాక్షి, హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు తొలిసారిగా హరిత జోన్‌ (గ్రీన్‌జోన్‌)లో స్థానం సంపాదించాయి. నెలకు పైగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గి పలు నగరాలు, పట్టణాల్లో గాలి నాణ్యత పెరిగింది. గతంలో ఏ కాలంలోనైనా (ముఖ్యంగా వేసవిలో) ఈ స్థాయిలో మెరుగైన వాయునాణ్యత రికార్డయిన దాఖలాల్లేవు. లాక్‌డౌన్‌తో వాహనాలు, పరిశ్రమలు, ఇతర త్రా రూపాల్లోని కాలుష్యం తగ్గి పోవడంతో మొదటిసారి రెండు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాలు, పట్టణాలు ‘గ్రీన్‌జోన్‌’లో స్థానం పొందాయి. హైదరాబాద్, అమరావతి, విశాఖ, రాజమండ్రి వంటి నగరాలు మెరుగైన పాయింట్లు సాధించా యి. తాజాగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించిన గణాంకాల ప్రకారం.. పలు నగరాల్లో వాయు నాణ్యతలో గణనీయమైన మార్పులొచ్చాయి. గత వర్షాకాలంలో నమోదైన వాయు నాణ్యత స్థాయిలో ఈ నగరాలు, పట్టణాల్లో ప్రస్తుతం గాలి నాణ్యత నమోదైందంటే లాక్‌డౌన్‌ ఎంత మార్పు తెచ్చిందో అర్థం చేసుకోవచ్చు. వాయు నాణ్యత 0–50 పాయింట్లుగా ఉంటే దానిని గ్రీన్‌జోన్‌గా పరిగణిస్తారు. 

దక్షిణాది నగరాలే ‘గుడ్‌’: లాక్‌డౌన్‌ కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు వాయు నాణ్యతసూచీలో ‘గుడ్‌’ కేటగిరీ సాధించడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల తో పాటు దక్షిణాదిలోని నగరాలు కూడా ఈ కోవలోకే చేరాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో వాయునాణ్యత పరిస్థితి కొంత బాగుపడినా, మొత్తంగా దక్షిణాది నగరాలతో పోలిస్తే ఉత్తరాది నగరాలు ఇంకా మెరుగైన స్థితి సాధించలేదు.

దేశవ్యాప్తంగా..
గతేడాది ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం బారినపడిన 20 నగరాల్లో మన దేశంలోని 14 నగరాలు నిలవగా, ఇప్పుడు సుదీర్ఘ లాక్‌డౌన్‌తో ఈ పరిస్థితిలో గణనీయ మార్పు వచ్చింది. మునుపెన్నడూ లేనివిధంగా నగరాలు, పట్టణాల్లో ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు. న్యూమోనియా వంటి వ్యాధులతో పోరాడేందుకు స్వచ్ఛమైన వాయువు దోహదపడుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. గత నెలలో వాయునాణ్యతను పరీక్షించినపుడు దాదాపు సగం నగరాలు మాత్రమే ‘శాటిస్‌ఫాక్టరి’ కేటగిరీలో ఉన్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో దేశవ్యాప్తంగా 103 నగరాల్లో 90శాతానికి పైగా నగరాల్లో వాయు నాణ్యత మెరుగుపడి, ‘గుడ్‌’ కేటగిరిలోకి చేరినట్టు సీపీసీబీ గణాంకాలు చెబుతున్నాయి.

ఈ నగరాల్లో ‘గాలి’ మారింది..
బుధవారం (ఏప్రిల్‌ 22) మధ్యాహ్నం 3.15కి సమీర్‌ యాప్‌ ద్వారా ఏక్యూఐ డేటాను సీపీసీబీ అప్‌డేట్‌ చేసింది. అందులోని లెక్కల ప్రకారం.. 25 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి టాప్‌లో నిలిచింది. హైదరాబాద్‌లో మొత్తంగా వాయునాణ్యత 47 పాయింట్లుగా నమోదైంది. ఇంకా నగరంలోని జూబ్లీహిల్స్‌లోని ఇక్రిశాట్‌ కాలనీ వద్ద 38 పాయిం ట్లు, హైదరాబాద్‌ వర్సిటీ వద్ద 42, ఎర్రగ డ్డ సమీపంలో 46, బొల్లారం ఇండస్ట్రియ ల్‌ ఏరియా వద్ద 48, శివార్లలోని ముత్తంగి చెరువు సమీపంలో 51, జూ పార్కు వద్ద 55 పాయింట్లుగా వాయునాణ్యత నమోదైంది. దక్షిణాది నగరాలు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బుధవారం నమోదైన వాయు నాణ్యత స్థాయిలివీ..

గాలికీ ఓ లెక్కుంది!
వాయు నాణ్యత (ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌– ఏక్యూఐ) కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ‘సమీర్‌ యాప్‌’ ద్వారా ఆన్‌లైన్‌ లో వెల్లడిస్తుంటుంది. ఏక్యూఐ 50 పాయింట్ల లోపు ఉంటే స్వచ్ఛమైన గాలి ప్రజలకు అందుతున్నట్టు లెక్క. 50 – 100 పాయింట్లు నమోదైతే గాలి నాణ్యతగా ఉన్నట్టు. అంతకుమించి తే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. 

మరిన్ని వార్తలు