ప్లీజ్‌.. నాకు పెళ్లి వద్దు

17 Nov, 2019 06:21 IST|Sakshi

అమ్మానాన్న ఇష్టంలేని వివాహం చేస్తున్నారు

నేను ఉన్నత చదువులు చదువుకుంటాను

బషీరాబాద్‌: ‘‘సార్‌.. నేను డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నా. ఇంకా ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయాలనేది నా లక్ష్యం. మా అమ్మానాన్న నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. ఆదివారం నిశ్చితార్థం కూడా పెట్టుకున్నారు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మంచి, చెడు ఆలోచించగలిగే శక్తి నాకు ఉంది. పైగా నేను మేజర్‌ను. దయచేసి ఈ పెళ్లిని ఆపండి సార్‌.. లేదంటే నా జీవితం అంధకారం అవుతుంది. మీరే నాకు న్యాయం చేయాలి’’అంటూ శనివారం వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ గ్రామానికి చెందిన ఓ 20 ఏళ్ల యువతి తల్లిదండ్రులపై తాండూరు గ్రామీణ సీఐ జలందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.

వెంటనే స్పందించిన సీఐ ఆమె తల్లిదండ్రులను ఠాణాకు రప్పించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అమ్మాయి మేజర్‌ కావడంతో ఆమెకు ఇష్టం లేని పెళ్లి చేయవద్దని వారికి సూచించారు. ‘మంచి సంబంధమని ఇప్పటికే పెళ్లికి అంగీకరించాం. అందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఆదివారం నిశ్చితార్థం పెట్టుకున్నాక ఇష్టం లేదంటే బంధువుల ఎదుట మా పరువు ఏం కావాలి’అంటూ తల్లిదండ్రులు పోలీసుల ఎదుట కన్నీటిపర్యంతం అయ్యారు. తాము ఇంటికి వెళ్లి మాట్లాడుకుంటామని తల్లిదండ్రులు యువతిని తీసుకొని ఇంటికి వెళ్లారు. యువతి మేజర్‌ కావడంతో ఇష్టం లేని పెళ్లి చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. కాగా, వరుడి వయస్సు 40 ఏళ్లని తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా