బరిలో ఇంజినీర్లు

22 Nov, 2018 13:33 IST|Sakshi

ఎమ్మెల్యే అభ్యర్థుల్లో బీటెక్‌ చేసిన వారే అధికం

బరిలో ఎక్కువ మంది విద్యావంతులు

ఉమ్మడి జిల్లాలో పోటీ చేస్తున్ననేతల విద్యార్హతలివే

 సాక్షి, బాన్సువాడ: అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని వివిధ స్థానాల నుంచి విద్యావంతులే అధికంగా బరిలో నిలిచారు. వీరిలోనూ అత్యధికంగా ఇంజినీరింగ్‌ విద్య చదివిన వారు ఉన్నారు. పార్టీలు ఎక్కువగా ఉన్నత చదువులు చదివిన వారికే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఉమ్మడి జిల్లాలోని వివిధ పార్టీల ఇంజినీర్‌ అభ్యర్థుల వివరాలను 
పరిశీలిస్తే..

పోచారం 

బాన్సువాడ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంజినీరింగ్‌ విద్యను పూర్తి చేశారు. అయితే కొన్ని కారణాల రీత్యా ఆయన పరీక్షలకు హాజరు కాకపోవడంతో ఆ కోర్సు అసంపూర్తిగా మిగిలింది. ప్రస్తుతం ఆయన టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేస్తున్నారు. 

హన్మంత్‌ సింధే 

జుక్కల్‌ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తున్న హన్మంత్‌ సింధే నీటి పారుదల శాఖలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా పనిచేశారు. తన ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఆయన 2004 ఎన్నికల్లో ఓడిపోయినా, 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం మళ్లీ టీఆర్‌ఎస్‌ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. 

బిగాల గణేశ్‌గుప్తా 

నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తున్న బిగాల గణేశ్‌గుప్తా సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. ఈయన 2009లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేస్తున్నారు. 

ఆనంద్‌రెడ్డి 

నిజామాబాద్‌ రూరల్‌ స్థానానికి పోటీ చేస్తున్న కేశ్‌పల్లి ఆనంద్‌రెడ్డి డిప్లొమా ఇన్‌ సివిల్‌ (పాలిటెక్నిక్‌) పూర్తి చేశారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈయన గతంలోనూ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. 

ఈరవత్రి అనిల్‌ 

బాల్కొండ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలో నిలిచిన ఈరవత్రి అనిల్‌ కుమార్‌ సైతం బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ఆయన 2009లో ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నారు. 

ప్రశాంత్‌రెడ్డి 

బాల్కొండ స్థానానికి టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేస్తున్న వేముల ప్రశాంత్‌రెడ్డి సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. 2014లో ఎమ్మెల్యేగా గెలుపొంది, ఆ తర్వాత మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌గా పదవీ బాధ్యతలను చేపట్టారు. 

వినయ్‌కుమార్‌ రెడ్డి 

ఆర్మూర్‌ స్థానానికి బీజేపీ తరపున పోటీలో నిలిచిన పొద్దుటూరి వినయ్‌కుమార్‌రెడ్డి బీటెక్‌(ట్రిపుల్‌ ఈ) పూర్తి చేశారు. రాజకీయాలపై ఆసక్తితో బీజేపీలో చేరి ప్రస్తుతం పోటీ చేస్తున్నారు.

డిగ్రీపైన చదివిన వారూ ఎక్కువే..

భూపతిరెడ్డి

కాగా వైద్య రంగంలో సేవలందించిన డాక్టర్‌ భూపతిరెడ్డి ఎం.ఎస్‌(ఆర్థోపెడిక్‌) పూర్తి చేసి, తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీగా పని చేసి, ప్రస్తుతం కాంగ్రెస్‌ టికెట్‌పై నిజామాబాద్‌ రూరల్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

 జీవన్‌రెడ్డి

ఆర్మూర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి సైతం పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేశారు. ఆయన ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చదివారు.

అరుణతార

జుక్కల్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అరుణతార ఎం.కాం, ఎంబీఏ, ఎల్‌ఎల్‌ఎం చదివారు. విద్యాధికురాలైన ఈమె 1999లో జుక్కల్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు.

 డిగ్రీ పూర్తి చేసిన వారు

కామారెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంప గోవర్ధన్‌ (బీఏ), కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ(బీకాం), అలాగే బోధన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి (బీఏ), నిజామాబాద్‌ అర్బన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి తాహెర్‌ బిన్‌ హందాన్‌ (బీఏ), నిజామాబాద్‌ రూరల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ (బీఏ)లు చదివారు.

 విద్యలో వెనుకబడిన వారు..

జుక్కల్‌ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్న సౌదాగర్‌ గంగారాం కేవలం ఏడో తరగతి వరకే చదివారు. బోధన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి షకీల్‌ ఆమేర్, బాన్సువాడ కాంగ్రెస్‌ అభ్యర్థి కాసుల బాల్‌రాజ్‌లు పదో తరగతి వరకు చదువుకున్నారు. అలాగే ఎల్లారెడ్డి బీజేపీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి, కామారెడ్డి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డిలు ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసిన వారిలో ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు