ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఆర్‌.కృష్ణయ్య 

14 Jan, 2019 01:22 IST|Sakshi

హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశం డిమాండ్‌ చేసింది. ఆదివారం బీసీ భవన్‌లో జరిగిన సమావేశానికి సంఘం బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య హాజరై ప్రసంగించారు. క్లాస్‌–వన్‌ ఉద్యోగుల్లో బీసీ ఉద్యోగుల శాతం ఎనిమిది దాటలేదని, కేంద్ర స్థాయి ఉద్యోగుల్లో 16% దాటలేదని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన 71 ఏళ్ల తర్వాత కూడా 56%జనాభా గల బీసీలకు ఇంత తక్కువ ప్రాధాన్యం ఉండటం చూస్తే ఈ వర్గాలకు ఎంత అన్యాయం జరుగుతుందో స్పష్టం అవుతోందన్నారు. అగ్రకులాలకు పది శాతం రిజర్వేషన్లు పెట్టాలని కేంద్రం నిర్ణయించడం దుర్మార్గమన్నారు.

అగ్రకులాల్లోని పేదలకు ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థలలో 80 % పదవులు అగ్రకులాల వారే అనుభవిస్తున్నారని ఆరోపించారు. 15% జనాభా ఉండి 80% పదవులు పొందుతున్న అగ్రకులాల వారికి రిజర్వేషన్లు ఇవ్వడంలో శాస్త్రీయత లేదన్నారు. ఈబీసీలకు రిజర్వేషన్లు సిద్ధాంత వ్యతిరేకమని, అధికారం కోసం పాలకులు అడ్డదారులు తొక్కే ప్రయత్నమని మండిపడ్డారు. ఈ సమావేశంలో గుజ్జకృష్ణ, నీల వెంకటేశ్,ఎం. వెంకటేశ్,జి.రామకృష్ణ,్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు