ప్రచారంలో దూసుకుపోతున్న ‘ఏనుగు’

4 Dec, 2018 14:11 IST|Sakshi
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏనుగు గుర్తుతో ప్రచారం నిర్వహిస్తున్న మల్‌రెడ్డి రంగారెడ్డి అనుచరులు

మూడు నియోజకవర్గాల్లో గట్టి పోటీ

సొంత పార్టీల టికెట్లు దక్కని నేతలు బీఎస్పీ నుంచి బరిలోకి 

ప్రచారంలో దూసుకుపోతున్న ‘ఏనుగు’ 

ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్న అభ్యర్థులు 

ఇప్పటికే మాయావతితో మేడ్చల్‌లో సభ  

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఏనుగు.. జిల్లా రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. మూడు నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసిస్తోంది. యూపీ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పే బహుజన్‌ సమాజ్‌ (బీఎస్పీ) పార్టీ మన జిల్లాలో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీల టికెట్‌ ఆశించి భంగపడ్డ నాయకులను ‘బెహన్‌జీ’ మాయవతి అక్కున చేర్చుకున్నారు. టికెట్లు కేటాయించి ఆదరించారు. ఏనుగు గుర్తుతో రంగంలోకి దిగిన అభ్యర్థులు ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మేడ్చల్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారపర్వంలో దూసుకెళ్తున్నారు. మేడ్చల్‌లో టీఆర్‌ఎస్‌ టికెట్‌ రాకపోవడంతో రెబల్‌గా బరిలో దిగిన నక్కా ప్రభాకర్‌గౌడ్‌ బీఎస్పీ పార్టీ గుర్తుపై పోటీచేస్తున్నారు.

ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిల గెలుపోటములలో నిర్ణయాత్మక శక్తిగా మారిన ప్రభాకర్‌.. చాపకింద నీరులా ప్రజల్లోకి చొచ్చుకెళుతున్నారు. మొదట్నుంచి మేడ్చల్‌లో సొంతవర్గాన్ని కూడగట్టిన ఆయన మాయవతితో బహిరంగ సభ నిర్వహించి బలాన్ని ప్రదర్శించారు. బీసీ కార్డును ప్రయోగించడం ద్వారా ఆయా వర్గాల్లో బీఎస్పీకి ఉన్న ఆదరణ ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారు. జవహర్‌నగర్, మేడ్చల్‌ ప్రాంతాల్లో ఉత్తరాది ప్రాంత ఓటర్లు ఎక్కువగా కలిసివస్తుందని అంచనా వేస్తున్నారు.  

షాద్‌నగర్‌లోనూ ఐరావతం 
షాద్‌నగర్‌ సెగ్మెంట్‌లోనూ అంబారీ సవారీ చేస్తోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వం దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన వీర్లపల్లి శంకర్‌ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తొలుత ఇండిపెండెంట్‌గా బరిలో దిగాలని నిర్ణయించుకున్న ఆయన చివరి నిమిషంలో జాతీయ పార్టీ గుర్తుతో పోటీకి దిగారు. ఈ నేపథ్యంలోనే బీఎస్పీ అభ్యర్థిగా కదనరంగంలోకి దూకిన శంకర్‌ ముఖ్య పార్టీల అభ్యర్థులకు తీసిపోని విధంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

కేవలం ఈ మూడు నియోజకవర్గాలే గాకుండా ఎల్‌బీనగర్‌ మినహా ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలోని సెగ్మెంట్ల బరిలో బీఎస్పీ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈసారి శాసనసభ ఎన్నికల్లో హోరాహోరీ పోటీ నెలకొనడంతో చిన్నా చితక పార్టీలకు డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో బీఎస్పీ టికెట్ల కూడా గిరాకీ వచ్చింది. కాగా, మూడు స్థానాల్లో ప్రత్యర్థులను గట్టిగా ఢీకొంటున్న ఏనుగు.. ఇతర నియోజకవర్గాల్లో మాత్రం ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకునే అవకాశం కనిపిస్తోంది.

కూటమికి తలనొప్పి
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్‌ టికెట్‌ను ఆశించిన మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా ఏనుగెక్కారు. కాంగ్రెస్‌ టికెట్‌ రాకపోగా.. సీటును పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించడంతో నిరాశ చెందిన ఆయన బీఎస్పీ బీ–ఫారం దక్కించుకున్నారు. ఏనుగు గుర్తుపై పోటీచేస్తున్న మల్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువాతో ప్రచారం సాగిస్తున్నారు. టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు దీటుగా ఆయన ప్రచారపర్వాన్ని కొనసాస్తుండడంతో పోటీ ఉత్కంఠ భరితంగా మారింది.

గత ఎన్నికల్లో ఆయన సోదరుడు రాంరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఈ సారి ఆ ఓటు బ్యాంకేగాకుండా కాంగ్రెస్‌ శ్రేణులు కూడా కలిసివస్తాయని మల్‌రెడ్డి బ్రదర్స్‌ అంచనా వేస్తున్నారు. అంతేగాకుండా ఎస్సీ సామాజికవర్గం ఓటర్లు కూడా గణనీయంగా ఉండడం అనుకూలం కానుందని భావిస్తున్నారు.


 

మరిన్ని వార్తలు