ఎప్పుడు పూర్తయ్యేనో!

25 Jan, 2019 11:08 IST|Sakshi

మక్కా మసీదు పునరుద్ధరణ పనుల్లో అంతులేని జాప్యం

ఏడాదిన్నరవుతున్నా నత్తనడకనే.. ఇప్పటికీ 70 శాతం పూర్తి కాని వైనం

కేటాయించింది రూ.8.48 కోట్లు  విడుదలైనవి మాత్రం రూ.2 కోట్లే  

శాఖల మధ్య సమన్వయ లేమి కూడా ఓ కారణమేనంటున్న అధికారులు  

సాక్షి, సిటీబ్యూరో:  చారిత్రక మక్కా మసీదు నిర్వహణ, మరమ్మతు పనులు నత్తకు నడక నేర్పుతున్నాయి. మసీదు దుస్థితిపై అప్పట్లో ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితం కావడంతో అధికారులు స్పందించి మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టారు. 2017 ఆగస్ట్‌ 23న రూ. 8.48 కోట్లు ని«ధులు కేటాయించి పనులు ప్రారంభించారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. కానీ గడువు ముంచుకువస్తున్నా పనుల్లో పురోగతి మాత్రం కనిపించడంలేదు. రూ.2 కోట్లు మాత్రమే విడుదల కావడంతో పనులు ముందుకు సాగడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.   

పురావస్తు శాఖ పర్యవేక్షణలో..  
మక్కా మసీదు మరమ్మతు పనులను వక్ఫ్‌ బోర్డు ద్వారా రాష్ట్ర పురావస్తు శాఖ పర్యవేక్షణలో చేయలని నిర్ణయించారు. మొదటి దశలో మసీదు పైకప్పు మరమ్మతులతో పాటు గోడల్లో నీరు రాకుండా పనులు చేపట్టారు. పురావస్తు శాఖ అనుభవజ్ఞులైన సిబ్బంది, అధికారుల పర్యవేక్షణలో పనులు ప్రారంభించారు. కాగా.. ఇప్పటికీ 70 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. ముంబైకి  చెందిన ఓ కాంట్రాక్టర్‌ టెండర్‌ దక్కించుకుని నిర్మాణ పనులు చేస్తున్నారు. మసీదు పైకప్పు, నిజాం సమాధుల పనులు 80 శాతం వరకు పూర్తి కాగా మసీదు లోపలి డోమ్‌ల పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. సౌండ్, లైట్‌ సిస్టమ్‌ల కోసం టెండర్లు కూడా ఇంకా ప్రకటించలేదు. చారిత్రక కట్టడం కావడంతో రాష్ట్ర పురావస్తు శాఖ  సూచనల మేరకు పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. వచ్చే నెలలో మసీదు పనులు పూర్తి స్థాయిలో పూర్తి కావాల్సి ఉండగా పలు పనులు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. చారిత్రక కట్టడం కావడంతో పనుల్లో జాప్యం ఏర్పడుతోందని, నిధులు సకాలంలో అందకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. పురావస్తు శాఖ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు ఎప్పటికప్పుడు బిల్లులు అందజేస్తే నిధులు వక్ఫ్‌ బోర్డు ద్వారా జారీ చేస్తామని మైనార్టీ శాఖ అధికారులు చెబుతున్నారు.  

శాఖల మధ్య కొరవడిన సమన్వయం..
మక్కా మసీదు మరమ్మతు పనులు పురావస్తు శాఖ పర్యవేక్షణలో జరుగుతున్నా.. నిధులు మాత్రం మైనార్టీ సంక్షేమ శాఖ వక్ఫ్‌ బోర్డు చెల్లిస్తోంది. అడపాదడపా మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారులు, కార్యదర్శి, వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ మసీదు పనులను పరిశీలించి వారం రోజుల్లో పనులు పూర్తి అవుతాయని, మరికొంత మంది నెల రోజుల్లో పూర్తి అవుతాయని ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఇంత వరకు మైనార్టీ సలహాదారుడు తప్ప ఎవరికీ మసీదు నిర్మాణానికి సంబంధించిన పూర్తి సమాచారం లేకుండాపోయింది. దీంతో పనులు పూర్తి కావడానికి మరో ఏడాది పట్టే విధంగా ఉంది. రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతోనే పనులు నిర్లక్ష్యంగా సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.  

ఆరు నెలల్లో పూర్తి చేస్తాం..
మొదట్లో అనుకున్న సమయానికి మసీదుల పనులు పూర్తి చేయడానికి ప్రణాళికలు చేశాం. కానీ పలు మరమ్మతులు పనులు చాలా సున్నితంగా చేయాల్సి వస్తోంది. పైకప్పుతో పాటు సమాధుల, మదర్సా పనులు చివరి దశలో ఉన్నాయి. మా అంచనా ప్రకారం మరో ఆరు నెలల్లో పనులు పూర్తవుతాయని భావిస్తున్నాం.      – విశాలాక్షి, రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్‌  

మరిన్ని వార్తలు