ఉప ముఖ్యమంత్రా? కుల సంఘ నేతా?

13 May, 2016 06:19 IST|Sakshi

మాల మహానాడు ప్రశ్న
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రా లేక కుల సంఘ నేతా? అనిమాల మహానాడు గురువారం ప్రశ్నించింది. ఎస్సీల వర్గీకరణ వద్దంటూ ఇక్కడ జంతర్ మంతర్‌లో నిర్వహిస్తున్న రెండో రోజు రిలే దీక్షలో ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య మాట్లాడారు. ఎస్సీలను వర్గీకరించాలని కేంద్ర ప్రభుత్వానికి కడియం శ్రీహరి సిఫారసు చేయడం ఎంత మేరకు సబబని ప్రశ్నించారు. ‘కడియం శ్రీహరి ఒక కుల సంఘానికి నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రికి మాలల ఓట్లు అవసరం లేదా? వచ్చే ఎన్నికల్లో ‘మాలల పంతం-కేసీఆర్ అంతం’ అనే నినాదంతో మాలలు ముందుకు సాగుతారు.

గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది. తెలంగాణలో మాలల కంటే మాదిగలే మెజారిటీ జిల్లాల్లో లబ్ధి పొందుతున్నారని ఉషా మెహ్రా కమిషన్ నివేదిక తేల్చిచెప్పింది..’ అని అన్నారు. వర్గీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రెండు రాష్ట్రాల్లో మంత్రులు, ఎంపీలను అడ్డుకుంటామన్నారు. వర్గీకరణ జాతీయ సమస్య అని, అనేక రాష్ట్రాల్లో దళితులు దీనిని వ్యతిరేకిస్తున్నారని గుర్తుచేశారు. ఈ దీక్షలో చెన్నయ్యతోపాటు జె.శ్రీనివాస్, భాస్కర్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. దీక్ష అనంతరం ఎస్సీ వర్గీకరణ సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకమని, అమలు చేయరాదని కోరుతూ ఎస్సీ కమిషన్‌కు వినతిపత్రం సమర్పించినట్టు చెన్నయ్య తెలిపారు.

మరిన్ని వార్తలు