రాష్ట్రంపై మలేరియా పంజా

30 Oct, 2018 03:24 IST|Sakshi

     ఇప్పటివరకు 1,163 మందికి సోకినట్లు నిర్దారణ 

     అత్యధిక కేసులు గిరిజన ప్రాంతాల్లోనే.. 

     మరోవైపు 3,121 మందికి డెంగీ సోకినట్లు నిర్దారణ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంపై ప్లాస్మోడియం ఫాల్సిపారం మలేరియా పంజా విసురుతోంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు 1,475 మలేరియా కేసులు నమోదైతే.. అందులో 1,163 మందికి ఫాల్సిపారం మలేరియా సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు శనివారం ప్రభుత్వానికి నివేదించాయి. ఫాల్సిపారం మలేరియా ఆఫ్రికా దేశాల్లో సాధారణమైనా, ఆసియా దేశాల్లో ప్రమాదకరంగా మారింది. మలేరియా మరణాల్లో అధికంగా ఫాల్సిపారం మలేరియా ద్వారానే జరుగుతాయి.

ఈ మలేరియా ప్రధానంగా మెదడుపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. వేగంగా రక్తస్రావం అవడం, రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటివి జరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 12 ఏళ్ల చిన్న పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. రాష్ట్రంలో అత్యధికంగా భూపాలపల్లి జిల్లాలో 425 ఫాల్సిపారం మలేరియా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కొత్తగూడెం జిల్లాలో 312 కేసులు, హైదరాబాద్‌లో 264 కేసులు, ఆసిఫాబాద్‌ జిల్లాలో 42 కేసులు    రికార్డు అయ్యాయి. వీటిలో అత్యధిక కేసులు   గిరిజన ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయి. ఇటీవల వైవాక్స్‌ మలేరియా కూడా ప్రమాదకరంగా తయారైందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో వైవాక్స్‌ మలేరియా కేసులు 312 నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్‌లో 114, భూపాలపల్లి జిల్లాలో 42, మేడ్చల్‌లో 25, కొత్తగూడెం జిల్లాలో 23, ఆసిఫాబాద్‌ జిల్లాలో 20, సంగారెడ్డి జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి నివేదించింది.  

భారీగా డెంగీ కేసులు..  
మరోవైపు రాష్ట్రంలో అధికంగా డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 15,058 మంది రక్త నమూనాలు సేకరిస్తే, అందులో 3,121 మందికి డెంగీ సోకినట్లు నిర్దారణ అయింది. అందులో ఒకరు చనిపోయినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వీటిలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 503 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత హైదరాబాద్‌లో 363, కొత్తగూడెం జిల్లాలో 357, ఆదిలాబాద్‌ జిల్లాలో 338, పెద్దపల్లి జిల్లాలో 217, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 199, కరీంనగర్‌ జిల్లాలో 124 డెంగీ కేసులు నమోదయ్యాయి. డెంగీ రోగులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. సరైన వైద్యం అందక చాలా మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేటు ఆస్పత్రులు పరీక్షల పేర్లు చెప్పి రోగుల నుంచి వేలకు వేలు పిండేస్తున్నాయి.  

ఎన్నికల విధుల్లో సిబ్బంది.. 
కిందిస్థాయిలో వైద్య ఆరోగ్య యంత్రాంగం మొత్తం ఎన్నికల విధుల్లోనే మునిగిపోయింది. ఫలితంగా గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్కడ చూసినా చెత్తా చెదారమే కనిపిస్తుంది. చెత్త ఊడ్చే సిబ్బంది నుంచి పై స్థాయి వరకు అందరినీ ఎన్నికల విధుల్లోనే ఉంచుతున్నారు. దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి.  

అస్సాం పర్యటనకు అధికారులు.. 
రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ యోగితా రాణా, డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు సహా పలువురు అధికారులు వచ్చే సోమవారం నుంచి ఐదు రోజులు అస్సాంలో జరిగే ఒక సదస్సుకు వెళ్తుండటం విమర్శలకు తావిచ్చింది. ఒకవైపు సంబంధిత మంత్రి లక్ష్మారెడ్డి ఆపద్ధర్మంగా ఉన్నారు. కాబట్టి అధికారులే అంతా నడపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కీలకమైన అధికారులు టూర్లకు వెళితే రాష్ట్రంలో జ్వరాలు, కంటి వెలుగు వంటి వాటిని పర్యవేక్షించే కీలక అధికారే ఉండే అవకాశం లేదు. 

లోపించిన పరిశుభ్రత
రాష్ట్రంలో పరిశుభ్రత లోపించింది. దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఫలితంగా డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ నెలలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్యులు తినడానికి కూడా సమయం దొరకడం లేదు.
– డాక్టర్‌ యలమంచిలి రవీంద్రనాథ్, ఖమ్మం  

మరిన్ని వార్తలు